ఇంటిల్లిపాది ఎంతో ఆనందంగా జరుపుకునే దీపావళి పండుగ (Deepavali Festival) సమయం ఆసన్నమైంది. చీకట్లను తరిమికొట్టి వెలుగులు, ఆనందం, ఐశ్వర్యం నింపే ఈ పండుగను ‘దీపాల వరస’ అని అర్థం చేసుకోవచ్చు. ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసం కృష్ణపక్ష అమావాస్య నాడు జరిగే ఈ పండుగను భారతదేశం మొత్తం ఘనంగా జరుపుకుంటారు. ఈ రోజున భక్తులు లక్ష్మీదేవిని ఆరాధిస్తూ, కుటుంబసభ్యులతో కలిసి సంతోషంగా దీపాలు వెలిగిస్తారు.

సనాతన ధర్మం ప్రకారం దీపావళి ఒక్క రోజు పండుగ కాదు. ఐదు రోజులపాటు కొనసాగే ఆధ్యాత్మిక ఉత్సవం ఇది. ఆశ్వయుజ మాసం కృష్ణపక్ష త్రయోదశి (ధనత్రయోదశి), చతుర్దశి (నరకచతుర్దశి), అమావాస్య (లక్ష్మీ పూజ), కార్తీక శుద్ధ పాడ్యమి (బలి పాడ్యమి), విదియ – ఈ ఐదు రోజులు కలిపి దీపావళిగా పరిగణిస్తారు. ప్రతి రోజు తనదైన ప్రాధాన్యతను కలిగి ఉంటుంది.
దృక్‌సిద్ధాంత గణిత ప్రకారం, ప్రదోషకాలంలో అమావాస్య తిథి వ్యాప్తి ఉన్న రోజునే దీపావళి జరుపుకోవాలి. ఆ లెక్కన 2025 సంవత్సరంలో అమావాస్య తిథి అక్టోబర్ 20న మధ్యాహ్నం 3.42 గంటలకు ప్రారంభమై, అక్టోబర్ 21న సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. ప్రదోషకాలానికి, రాత్రి వేళలకు అమావాస్య తిథి ఉండటం వల్ల ఈసారి దీపావళి పండుగ అక్టోబర్ 20న జరుపుకోవాలి. అదే రోజున లక్ష్మీపూజ, దీపదానం, పితృదేవతలకు దీపారాధన వంటి శుభకార్యాలు చేయడం శ్రేష్ఠమని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. దీపావళి రోజున లక్ష్మీదేవిని ఆరాధించడం ద్వారా ఇంటిలో ఐశ్వర్యం, శాంతి, సౌభాగ్యం పెరుగుతాయని నమ్మకం.

లక్ష్మీ పూజ ముహూర్తం:
దీపావళి రోజున, అంటే అక్టోబర్ 20వ తేదీన సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 8.30 గంటల మధ్య లక్ష్మీ పూజ (Date and Time to Worship Goddess Lakshmi) నిర్వహించడం అత్యుత్తమ సమయం. ఈ సమయాన్ని శుభప్రదమైన ప్రదోష కాలం (Pradosh Kaal) అంటారు. ఆ రోజు ప్రదోషకాల సమయం సాయంత్రం 5.45 గంటల నుంచి 8.15 గంటల వరకు ఉంటుంది. ఈ సమయంలో చేసే పూజలు, దీపారాధనలు, దానాలు విశేషమైన ఫలితాలను ఇస్తాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

దీపావళి కేవలం దీపాల పండుగ మాత్రమే కాదు, అది మనసుల మధ్య వెలుగులు నింపే ఆత్మీయ సమయం కూడా. ఈ రోజున చెడును, చీకటిని, అజ్ఞానాన్ని దూరం చేసుకుంటూ సత్యం, ధర్మం, వెలుగును ఆహ్వానిస్తాం. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఒకే మనసుతో జరుపుకునే ఈ పండుగ భారత సాంస్కృతిక విలువలకు ప్రతీకగా నిలుస్తుంది.
