సీఎం అయ్యి 30 ఏళ్లు.. తెలుగు నేలపై చంద్రబాబు అరుదైన రికార్డు

Telugu BOX Office

నారా చంద్రబాబు నాయుడు తొలిసారి సీఎం పగ్గాలు చేపట్టి సోమవారానికి సరిగ్గా 30 ఏళ్లు పూర్తయ్యాయి. పార్టీనే ప్రాణంగా నమ్ముకుని సాగుతున్న ప్రస్థానానికి ఒక్కసారిగా విఘాతం కలిగితే.. పార్టీని రక్షించుకునే దిశగా చేసిన పోరాట ఫలితంగానే ఆయనకీ పీఠం దక్కింది. సానుకూల దృక్పథం ఉన్నవారెవరూ విఫలమైనట్లు చరిత్రలో లేదు. చంద్రబాబుకు ఉన్న మంచి లక్షణాల్లో సానుకూల దృక్పథం ఒకటి. అదే ఆయనకు 1999 ఎన్నికల్లో విజయం చేకూర్చి పెట్టింది.  అసలైన ఎన్టీఆర్‌ వారసులెవరో ప్రజలు తమ ఓటుతో తేల్చిచెప్పిన ఎన్నికలవి. ఆ ఎన్నికల్లో చంద్రబాబు 44.14 శాతం ఓట్లతో 181 సీట్లను కైవసం చేసుకుని ఉమ్మడి రాష్ట్ర సీఎంగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత 2004, 09ల్లో వరుస ఓటముల తర్వాత 2014లో విభజిత ఆంధ్రప్రదేశ్‌కు తొలి సీఎంగా.. మొత్తంగా మూడోసారి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. ఆ తర్వాత 2019లో ఓటమి పాలై జగన్‌ ఐదేళ్ల ఏలుబడిలో ఎన్నో అవమానాల పాలైనా అన్నిటినీ అధిగమించి తిరిగి 2024లో నాలుగోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు.

 గతంలో ముఖ్యమంత్రులుగా చేసినవారిది ఒక తీరయితే.. చంద్రబాబుది మరో తీరు. ఆయన పరిపాలన మిగిలినవారికంటే భిన్నం. తొలిసారి సీఎం అయ్యాక ఎన్నో విప్లవాత్మక పాలనా సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. అప్పటి వరకు కార్యాలయాలకే పరిమితమైన అధికారులను ప్రజల వద్దకు పంపి.. వారి సమస్యలను తెలుసుకోవడం, వివిధ పథకాల కింద లబ్ధిదారులను గుర్తించడం కోసం చేపట్టిన ‘ప్రజల వద్దకు పాలన’ విశేష జనాదరణ పొందింది. ప్రతి ఒక్కరూ జన్మభూమి రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతో 1997 జనవరి 1న ఆయన ప్రవేశపెట్టిన ‘జన్మభూమి’ కార్యక్రమం ఎన్నో పల్లెల్లో వెలుగులు తీసుకొచ్చింది. ప్రవాసాంధ్రులను సైతం కదలించి జన్మభూమివైపు చూసేలా చేసింది. పేదరికం లేని సమాజ స్థాపన దిశగా విజన్‌-2020కి రూపకల్పన చేశారు. జలసంరక్షణ కోసం నీరు-మీరు, చెట్ల పెంపకాన్ని పెంచేందుకు పచ్చదనం- పరిశుభ్రత కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ప్రభుత్వ వ్యవస్థలను సరళీకృతం చేయడం, పాలనలో పారదర్శకత తీసుకొచ్చేందుకు ఈ-గవర్నెన్స్‌ తీసుకొచ్చారు తొలి విడత పాలనలో చంద్రబాబు సీఎంగా కాక ఆంధ్రప్రదేశ్‌ సీఈవోగా పేరుపొందడం విశేషం.

చంద్రబాబు విజన్‌కు నిదర్శనం హైటెక్‌ సిటీ.  ఆయన తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పుడే హైటెక్‌ సిటీ నిర్మాణానికి బీజం పడింది. కొండలు, గుట్టలతో నిండి ఉన్న ప్రాంతంలో కేవలం 14 నెలల్లో దాని నిర్మాణం పూర్తి చేసి.. 1998 నవంబరు 22న నాటి ప్రధాని వాజపేయితో ప్రారంభింపజేశారు. బిల్‌ గేట్స్‌ను ఒప్పించి మెప్పించి మైక్రోసాఫ్ట్ కంపెనీని భాగ్యనగరానికి తీసుకొచ్చారు. ప్రభుత్వాలు ఎన్ని పథకాలను ప్రవేశపెట్టినా వాటి ద్వారా సమాజంలో అందరినీ ఆర్థికంగా ఆదుకోవడం అసాధ్యం. స్వయంపోషకత్వమే దానికి పరిష్కారం. ఈ ఆలోచనతోనే చంద్రబాబు ‘డెవల్‌పమెంట్‌ ఆఫ్‌ ఉమెన్‌ అండ్‌ చిల్డ్రన్‌ ఇన్‌ రూరల్‌ ఏరియాస్‌ (డ్వాక్రా)’ పేరుతో మహిళా స్వయంసహాయక సంఘాలను ప్రవేశపెట్టారు. ఇవి నేటికీ అత్యుత్తమ ఫలితాలను  ఇస్తున్నాయి. పేదరిక నిర్మూలన కోసం చేపట్టిన కార్యక్రమాల్లో మంచి ఫలితాలు ఇచ్చిన పథకాల్లో ‘వెలుగు’ మరొకటి.

2014లో ముచ్చటగా మూడోసారి చంద్రబాబు సీఎం అయ్యారు. అయితే ఈసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కాదు. విభజిత ఆంధ్రప్రదేశ్‌కు. రాజధాని లేని రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఆయన తొలి ప్రాధాన్యం.. దేశంలో ఏ రాష్ట్రానికీ లేని విధంగా రాజధాని నిర్మాణం చేయడం. ఆ ఆలోచన నుంచి రూపుదిద్దుకున్నదే అమరావతి. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు పోలవరం ప్రాజెక్టును పట్టాలెక్కించారు. సముద్రంలోకి వృథాగా పోయే నీటిని ఒడిసిపట్టేందుకు నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టారు. గోదావరి జలాలను కృష్ణా నదిలోకి ఎత్తిపోసేందుకు ప్రారంభించిన పట్టిసీమ ప్రాజెక్టును శంకుస్థాపన చేసిన ఆరు నెలల్లోనే అందుబాటులోకి తెచ్చారు. ఇన్ని చేసినా 2019 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో వ్యక్తిగతంగా ఆయనకు ఎన్నో నిర్బంధాలు.. అవమానాలు ఎదురయ్యాయి. చివరికి 52 రోజులు జైల్లో గడపాల్సి వచ్చింది. అన్నింటినీ తట్టుకుని నిలబడి రాజకీయ వ్యూహంతో, చాతుర్యంతో జనసేన, బీజేపీలను కలుపుకొని 2024 ఎన్నికల్లో అఖండ ప్రజాదరణతో నాలుగోసారి సీఎం బాధ్యతలు చేపట్టారు. ఈసారి వైసీపీ పాలనలో విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసే బాధ్యతను తలకెత్తుకుని ముందుకు సాగుతున్నారు.  ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చేందుకు అహర్నిశలు పాటుపడుతున్నారు.

చంద్రబాబు తొలిసారి సీఎం అయ్యేనాటికి ఆయన వయసు 45 ఏళ్లు. తెలుగు నేలపై అతిపిన్న వయసులో ముఖ్యమంత్రి అయిన రెండో వ్యక్తిగా పేరుగాంచారు. ఆ సమయంలో ఆయన తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలు వ్యక్తిగతంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి. ఓ వైపు పార్టీని పటిష్ఠం చేసుకుంటూనే పాలనపై పట్టుబిగించి ప్రభుత్వాన్ని నడిపించారు.

1995 సెప్టెంబరు 1న చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇది జరిగి సోమవారానికి 30 ఏళ్లు పూర్తవుతుంది. ఆయన ఇప్పటికి 5,442 రోజుల పాటు సీఎంగా పనిచేసి నేడు 5,443వ రోజుకు అడుగుపెడుతున్నారు. ఇప్పటికీ పలు సమావేశాల్లో ఆయనే స్వయంగా ‘95 సీఎం’ను చూస్తారని చెబుతుంటారు. కానీ మూడు విడతలతో పోలిస్తే ఈసారి తనదైన మార్కును చూపించలేకపోతున్నారన్న విమర్శలూ ఉన్నాయి. అటు పార్టీపై గానీ, ఇటు ప్రభుత్వంపై గానీ పూర్తిస్థాయిలో పట్టు సాధించడంలో విఫలమవుతున్నారన్న వ్యాఖ్యలు తరచూ వినవస్తున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు అంతర్జాతీయ ప్రశస్తి తెచ్చిన చంద్రబాబు.. విభజిత ఆంధ్రప్రదేశ్‌కూ అదే గౌరవాన్ని తీసుకొస్తారన్న ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా మరోసారి 95నాటి సీఎంగా తనదైన ముద్రతో అటు పార్టీని, ఇటు ప్రభుత్వాన్ని గాడినపెడతారని టీడీపీ శ్రేణులు.. రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్నారు.

Share This Article
Leave a Comment