నల్లమల ఫారెస్ట్‌లో నైట్ క్యాంప్.. అదిరిపోయే ఎక్స్‌పీరియన్స్

Telugu BOX Office

చిటపటమని చికునులు కురిసే వేళ.. పచ్చని చెట్ల నడుమ.. పక్షుల కిలకిలరావాలు వింటూ నిద్రపోతే ఎంత హాయిగా ఉంటుందో.. ఇది కల కాదు.. నిజమే అటవీ శాఖ అధికారులు అలాంటి సౌకర్యమే కల్పించారు. పర్యాటకులకు స్వర్గధామంగా విరాజిల్లే నల్లమలలో ఓ రాత్రి విడిది చేయొచ్చు. వారమంతా ఉరుకులు పరుగులు.. వారాంతంలో కుటుంబ సభ్యులతో పట్టణంలో తిరగడం.. హోటల్‌లో భోజనం చేయడం.. రాత్రికి నాలుగు గోడల మధ్య గడిపే మీరు ప్రకృతి రమణీయతను ఆస్వాదించొచ్చు.. విజ్ఞానం, వినోదం పొందొచ్చు.

 ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు నల్లమల పచ్చటి అందాలతో పరిఢవిల్లుతోంది. పర్యాటకులకు వినోదంతోపాటు విజ్ఞానం పంచేందుకు సిద్ధమైంది. పులుల సంతానోత్పత్తి కాలం కావడంతో జులై నుంచి సెప్టెంబరు వరకు అడవిలోకి వెళ్లడం నిషేధించారు. కానీ ‘జంగిల్‌ క్యాంప్‌’లో విడిదికి అవకాశం కల్పించారు. బైర్లూటిలో రూ.30 లక్షలతో ఆరడుగుల ఎత్తులో రెండు ఉడెన్‌ హౌస్‌లు నిర్మించారు. 3 కాటేజీలు, 6 టెంట్‌లు, రెండు ఫ్యామిలీ హౌస్‌లు, పచ్చర్లలో 4 కాటేజీలు, 2 టెంట్లు ఏర్పాటు చేశారు.

 

ఆన్‌లైన్‌లో ఎన్‌ఎస్‌టీఆర్‌.కో.ఇన్‌ లాగిన్‌లో బుక్‌ చేసుకోవచ్చు. లాగిన్‌ కాగానే బైర్లూటి ఎకో టూరిజం, పచ్చర్ల, తుమ్మల బయలు, నెక్కంటి ఇష్టకామేశ్వరి, రోళ్లపాడు అభయారణ్యం వెబ్‌సైట్‌లో కనిపిస్తాయి. ఇష్టమైన దాన్ని ఎంచుకోవచ్చు.

గతంలో కాటేజీ లేదా టెంట్‌హౌస్‌కు రోజుకు రూ.7 వేలు చెల్లించాల్సి ఉండేది. ప్రస్తుతం రూ.5 వేలకు ఇస్తున్నారు. ఫ్యామిలీ హౌస్‌లో ఆరుగురికి గతంలో రూ.20 వేలు ఉండేది. తాజాగా రూ.12 వేలకు ఇస్తున్నారు. మంది పెరిగితే అదనంగా రూ.1,500 చెల్లించాలి.

సెప్టెంబర్‌ వరకు సఫారీ బంద్‌ చేశారు. పర్యాటకులు అడవిలోకి వెళ్లడాన్ని అనుమతించరు. ఎకోవాక్, హెరిటేజ్‌వాక్, జంగిల్‌ సఫారీ, ట్రెక్కింగ్, బర్డ్స్‌ బటర్‌ఫ్లై స్కౌట్ వంటివి ఉండవు.

Share This Article
Leave a Comment