కేంద్ర వార్షిక బడ్జెట్ 2025-26ను శనివారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. మొత్తం రూ.50,65,345 కోట్లతో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్‌లో మధ్యతరగతి ప్రజానీకంతో పాటు వేతన జీవులకు భారీగా ఊరట ఇచ్చారు. శాఖల వారీగా చూసుకుంటే.. రక్షణ శాఖకు ఏకంగా రూ.4.91 లక్షల కోట్లు కేటాయించారు. ఆ తర్వాత గ్రామీణ శాఖకు రూ.2.66 లక్షల కోట్లు కేటాయించారు.
ఈ బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ మీద వరాల జల్లు కురిపించింది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రానికి ప్రత్యేకంగా కేటాయింపులు చేసింది. పోలవరం ప్రాజెక్టుకు గతేడాది కంటే రూ.400 కోట్లు అధికంగా కేటాయించిన కేంద్ర ప్రభుత్వం.. మొత్తంగా రూ.5,936 కోట్లు ఇస్తున్నట్లు బడ్జెట్‌లో పేర్కొంది. విశాఖ పోర్టుకు కూడా గతేడాదితో పోలిస్తే రూ.445 కోట్లు అధికంగా ఇస్తున్నామని తెలిపింది. మొత్తంగా విశాఖ పోర్టుకు రూ.730 కోట్లు కేటాయించింది.
ఏపీకి ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు ఇలా..
పోలవరం ప్రాజెక్టుకు రూ.5,936 కోట్లు
విశాఖ స్టీల్‌కు రూ.3,295 కోట్లు
విశాఖ పోర్టుకు రూ.730 కోట్లు
జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ కి రూ. 186 కోట్లు
ఏపీ ఆరోగ్య వ్యవస్థల బలోపేతానికి రూ. 162 కోట్లు
లెర్నింగ్ ట్రాన్స్ఫార్మేషన్ ఆపరేషన్ కి మద్దతుగా రూ. 375 కోట్లు
ఏపీలో రోడ్లు, వంతెనల ప్రాజెక్టుకు రూ.240 కోట్లు
ఏపీ ఇరిగేషన్, లైవ్లీ హుడ్ ఇంప్రూవ్‌మెంట్ ప్రాజెక్టు 2వ దశకు రూ.242.50 కోట్లు
కేంద్ర బడ్జెట్‌పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు మేలు చేకూర్చే బడ్జెట్ ఉందని కొనియాడారు. వికసిత్ భారత్ విజన్‌ను ప్రతిబింభించేలా బడ్జెట్ ఉందని… మహిళా, పేదల, యువత, వ్యవసాయదారుల సంక్షేమానికి పెద్దపీట వేశారన్నారు. రానున్న ఐదేళ్లలో ఆరు కీలక రంగాల్లో అభివృద్ధికి ఈ బడ్జెట్ మార్గదర్శకతం చేస్తోందని చంద్రబాబు అన్నారు. మధ్యతరగతి వర్గానికి ట్యాక్స్ రిలీఫ్, ఈ బడ్జెట్‌లో వచ్చిన అదనపు ప్రయోజనం అని కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని ప్రశంసించారు. ఈ బడ్జెట్‌ను మనస్పూర్తిగా స్వాగతిస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు.