24 మందితో చంద్రబాబు కేబినెట్… డిప్యూటీ సీఎంగా పవన్‌ కళ్యాణ్‌

Telugu BOX Office


టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఉపముఖ్యమంత్రిగా బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వారితో పాటే మరో 23 మంది మంత్రులూ ప్రమాణం చేయనున్నారు. ఉపముఖ్యమంత్రిగా పవన్‌ కల్యాణ్‌ ఒక్కరే ఉండనున్నారు. పవన్‌ సహా మొత్తం 24 మంది మంత్రుల జాబితాను మంగళవారం అర్ధరాత్రి దాటాక 1.15 గంటల సమయంలో ప్రకటించారు. ఒక స్థానాన్ని ఖాళీ ఉంచారు. జనసేనకు మూడు, బీజేపీకి ఒక స్థానం కేటాయించారు. సీనియర్లకు, యువతకు మధ్య సమతూకం పాటిస్తూ మంత్రివర్గాన్ని రూపొందించడం విశేషం. మంత్రివర్గంలో సగానికిపైగా కొత్తవారికి అవకాశం లభించింది. ఏకంగా 17 మంది కొత్తవారికి అవకాశం కల్పించారు. అలాగే ముగ్గురు మహిళలకు చోటు లభించింది. మొత్తం కేబినెట్లో బీసీలు 8 మంది, ఎస్సీలు ఇద్దరు, ఎస్టీ ఒకరు, ముస్లిం మైనారిటీల నుంచి ఒకరికి, వైశ్యుల నుంచి ఒకరికి అవకాశం దక్కింది. నలుగురు కాపులు, నలుగురు కమ్మ, ముగ్గురు రెడ్లకు అవకాశమిచ్చారు.

బీజేపీ నుంచి ఎవరికి మంత్రివర్గంలో చోటు కల్పించాలన్న విషయంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో చర్చించేందుకు చంద్రబాబు వేచి ఉండటంతో జాబితా ప్రకటించడంలో జాప్యం జరిగింది. ఆశావహులు, మద్దతుదారులు జాబితా కోసం నరాలు తెగేంత ఉత్కంఠతో క్షణమొక యుగంలా ఎదురు చూశారు. మంత్రివర్గ కూర్పుపై చంద్రబాబు కొన్ని రోజులుగా విస్తృత కసరత్తు చేశారు. సామాజిక వర్గాలు, ప్రాంతాలు, వివిధ వర్గాల ఆకాంక్షల మధ్య సమతూకం పాటిస్తూ మంత్రివర్గాన్ని సిద్ధం చేశారు. టీడీపీ నుంచి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ మంత్రివర్గంలో చేరారు. ఆనం రామనారాయణరెడ్డి, కొలుసు పార్థసారథిలకు ఇచ్చిన హామీని చంద్రబాబు నిలబెట్టుకున్నారు.

Share This Article
Leave a comment