కేంద్ర మంత్రివర్గంలో ఇద్దరు టీడీపీ ఎంపీలకు స్థానం ఖరారైంది. శ్రీకాకుళం నుంచి వరుసగా మూడోసారి ఎంపీగా గెలిచిన కింజరాపు రామ్మోహన్‌నాయుడికి క్యాబినెట్ మంత్రి పదవి దక్కనుంది. అలాగే గుంటూరు ఎంపీగా తొలిసారి గెలిచిన పెమ్మసాని చంద్రశేఖర్‌కు సహాయ మంత్రి పదవి ఇవ్వనున్నారు. ఆదివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోపాటు వీరిద్దరు కూడా మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో16 ఎంపీ స్థానాలు గెలిచిన టీడీపీ.. ఎన్డీయే కూటమిలో బీజేపీ తర్వాత రెండో అతిపెద్ద పార్టీ కావడం విశేషం. ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణలో టీడీపీకి మరో రెండు మంత్రి పదవులు దక్కనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మంత్రి పదవులు దక్కించుకున్న రామ్మోహన్‌నాయుడు, చంద్రశేఖర్‌లకు టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
కేంద్ర మాజీ మంత్రి, దివంగత ఎర్రన్నాయుడి కుమారుడిగా రాజకీయాల్లోకి వచ్చిన రామ్మోహన్‌నాయుడు వరుసగా మూడోసారి శ్రీకాకుళం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 2019 ఎన్నికల్లో రాష్ట్రమంతా వైసీపీ గాలి వీచినా తట్టుకుని నిలబడి, ఎంపీగా గెలిచారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన ఎర్రన్నాయుడి కుమారుడిగా, ఉత్తరాంధ్ర నుంచి వరుసగా గెలుస్తున్న యువనేతగా, పార్లమెంటరీ వ్యవహారాల్లో అనుభవమున్న నాయకుడిగా రామ్మోహన్‌నాయుడికి మంత్రి పదవి ఖాయమని అందరూ ఊహించిందే. తెలుగుతో పాటు హిందీ, ఆంగ్ల భాషల్లో ప్రావీణ్యంతో పార్లమెంట్ చర్చల్లో ఆయన ఇప్పటికే తనదైన ముద్ర వేశారు. పార్లమెంటులో రామ్మోహన్ నాయుడు ప్రసంగాలకు ఎన్నోసార్లు ప్రసంశలు దక్కాయి. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకునే చంద్రబాబు ఆయనకు కేంద్ర క్యాబినెట్ బెర్తు ఖరారు చేశారు.
ఇక అదృష్టమంటే గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్‌దే అని చెప్పాలి. ఈ ఎన్నికల ముందే క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చిన ఆయన గుంటూరు నుంచి ఎంపీగా భారీ మెజారిటీతో గెలిచారు. గుంటూరు జిల్లా బుర్రిపాలెం నుంచి సాధారణ వైద్యుడిగా అమెరికా వెళ్లిన ఆయన అనతికాలంలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. అమెరికాలో వైద్యవిద్య లైసెన్సింగ్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల కోసం ‘యు వరల్డ్’ పేరుతో ఆన్‌లైన్ శిక్షణ సంస్థను ప్రారంభించి, స్వల్ప వ్యయంతో వారికి శిక్షణ అందించేందుకు శ్రీకారం చుట్టారు. ఈ సంస్థ తర్వాత వివిధ కోర్సుల్లో పరీక్షలకు ఆన్‌లైన్ శిక్షణిస్తూ అతికొద్ది కాలంలోనే రూ.వేల కోట్ల సంపద సృష్టించారు. అంతర్జాతీయంగా ఆయనకున్న అనుభవం రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావడం, ఇక్కడి యువతకు ఉపాధి అవకాశాల కల్పనలో ఉపకరిస్తుందనే ఉద్దేశంతో ఆయన్ను కేంద్ర మంత్రి పదవికి చంద్రబాబు ఎంపిక చేసినట్లు చెబుతున్నారు. దీంతో పెమ్మసాని చంద్రశేఖర్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
మరోవైపు కేంద్ర క్యాబినెట్ ఎంపికలో తొలుత 10 స్థానాల కంటే ఎక్కువచోట్ల గెలిచిన పార్టీలకు ప్రాతినిధ్యం కల్పిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో టీడీపీకి ముందుగా రెండు మంత్రి పదవులు ఇస్తున్నారని.. మంత్రివర్గ విస్తరణలో మరో 2 మంత్రి పదవులు వస్తాయని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.