మహారాష్ట్రలో రైలు ప్రయాణికుల భద్రతను ప్రమాదంలో పడేసే సంఘటన ఒకటి వెలుగుచూసింది. ఓ మహిళా ప్రయాణికురాలు ఎక్స్‌ప్రెస్ రైల్లోని ఏసీ కోచ్‌లో కూర్చొని విద్యుత్ కెటిల్‌తో నూడుల్స్ వండుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రైల్లో ఇలాంటి విద్యుత్ పరికరాలను వినియోగించడం నిషేధం అని తెలిసినా, ఆమె నిర్లక్ష్యంగా కెటిల్‌ను ప్లగ్ చేసి ఆహారం తయారు చేస్తుండటం ప్రయాణికుల్లో ఆందోళన కలిగించింది. అంతే కాకుండా, వీడియోలో ఆమె ముందుగా 10–15 మందికి టీ కూడా ఇలాగే తయారు చేసినట్లు చెప్పడం మరింత షాక్ కలిగించింది.

ఈ వీడియో ‘ఎక్స్’లో వైరల్ కావడంతో రైల్వే అధికారులు వెంటనే స్పందించారు. రైల్లో విద్యుత్ కెటిల్ వినియోగించడం పూర్తిగా నిషేధితమని, ఇది విద్యుదాఘాతం, షార్ట్ సర్క్యూట్ ప్రమాదాలకు దారి తీసే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. రైలు కోచ్‌లలో ఉపయోగించే విద్యుత్ సరఫరా, ఏసీ వ్యవస్థలకు ఇలాంటి పరికరాల వాడకం అంతరాయం కలిగించే ప్రమాదం ఉందని రైల్వే శాఖ స్పష్టం చేసింది. ‘‘ఇలాంటి చర్యలు రైల్లోని విద్యుత్ వ్యవస్థను దెబ్బతీసి ఇతర ప్రయాణికుల భద్రతకు హాని కలిగించే ప్రమాదం ఉంది. ఇది తీవ్రమైన నేరం’’ అని రైల్వే శాఖ తమ అధికారిక పోస్ట్‌లో పేర్కొంది. రైల్లో ఇలాంటి ప్రమాదకర చర్యలను అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రతి ప్రయాణికుడిపై ఉందని కూడా హెచ్చరించింది.
రైల్వే చట్టంలోని సెక్షన్ 147(1) ప్రకారం రైల్లో అనుమతించని పరికరాల వినియోగం, రవాణా నియమావళిని ఉల్లంఘించడం శిక్షార్హమైన నేరం. ఈ క్రమంలో వీడియోలో కనిపించిన మహిళను గుర్తించి, ఆమెపై కేసు నమోదు చేయడానికి RPF చర్యలు ప్రారంభించింది. వీడియోను రికార్డ్ చేసి అప్లోడ్ చేసిన వారిపై కూడా చర్యలు తప్పవని అధికారులు తెలిపారు. ప్రయాణికులు రైల్లో ఇలాంటి ప్రమాదకర పరిస్థితులు గమనిస్తే వెంటనే RPF హెల్ప్‌లైన్ లేదా రైల్వే అధికారులకు సమాచారమివ్వాలని, అలాంటి చర్యలు ప్రాణహానిని నివారిస్తాయని రైల్వే శాఖ కోరింది. ఈ ఘటనతో రైల్లో సరైన నిబంధనలు పాటించడం ఎంత ముఖ్యమో మరోసారి రుజువైంది.
