నటీనటులు: నిఖిల్, అనుపమ పరమేశ్వరన్, అనుపమ్ ఖేర్, శ్రీనివాసరెడ్డి, ప్రవీణ్, ఆదిత్యా మేనన్, తులసి, సత్య, వైవా హర్ష, వెంకట్ తదితరులు
మ్యూజిక్: కాలభైరవ
ఛాయాగ్రహణం: కార్తీక్ ఘట్టమనేని
కళ: సాహి సురేష్
నిర్మాణ సంస్థ: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
నిర్మాతలు: టి.జి.విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: చందు మెుండేటి
విడుదల తేదీ: 13-08-2022
హ్యాపీడేస్ చిత్రంలో నలుగురు కుర్రాళ్లలో ఒకడిగా నటించిన నిఖిల్ సిద్ధార్థ్ తర్వాత యువత సినిమాతో మంచి విజయాన్నే సొంతం చేసుకున్నాడు. మధ్యలో కొన్ని పరాజయాలు పలకరించినా స్వామి రారా, కార్తికేయ వంటి చిత్రాలతో వరుస సక్సెస్‌లను సొంతం చేసుకున్నాడు. అప్పటి నుంచి రొటీన్‌కి భిన్నంగా సినిమాలు చేసే ప్రయత్నాలు చేస్తున్నాడు. సినిమాలు హిట్స్ అవుతున్నాయి. కానీ.. సాలిడ్ హిట్ కావాలని చాన్నాళ్లుగా నిఖిల్ వెయిట్ చేస్తున్నాడు. మరో వైపు దర్శకుడు చందు మొండేటికి సైతం మరో హిట్ అవసరం అయ్యింది. దీంతో వీరిద్దరూ చేతులు కలిపారు.
2014లో నిఖిల్, చందు మొండేటి కాంబినేషన్లో వచ్చిన కార్తికేయ సినిమా చాలా పెద్ద విజయాన్ని సాధించింది. దానికి కొనసాగింపుగా చేసిన చిత్రమే కార్తికేయ 2. సముద్ర గర్బంలో దాగిన ద్వారకా నగరం.. దాన్ని పాలిచించిన శ్రీకృష్ణుడు ఉన్నాడా..లేడా అనే విషయాలను కార్తికేయ 2లో చెప్పబోతున్నట్లు టీజర్, ట్రైలర్‌తో చిన్న టచ్ ఇచ్చింది చిత్ర యూనిట్. దీంతో సినిమాపై ఆసక్తి కలిగింది. కార్తికేయ సాధించినట్లుగానే కార్తికేయ 2 కూడా భారీ విజయాన్ని దక్కించుకుందా.. ప్రేక్షకులను మెప్పించిందా! అనే విషయాలను తెలుసుకోవాలంటే సినిమా కథలోకి వెళదాం…
కార్తికేయ (నిఖిల్) (Nikhil) ఓ వైద్యుడు. ప్రశ్నలకు సమాధానం వెతకడం అంటే ఇష్టం. ప్రతి సమస్యకీ ఓ సమాధానం ఉంటుందని, తన దగ్గరికి రానంత వరకే ఏదైనా సమస్య అనీ.. వస్తే మాత్రం దానికి సమాధానం దొరకాల్సిందేనని అంటాడు. అందుకోసం ఎంతదూరమైనా ప్రయాణించే వ్యక్తిత్వం అతడిది. మొక్కు తీర్చడం కోసమని అమ్మతో కలిసి ద్వారక వెళతాడు. అనుకోకుండా అక్కడ ఓ ఆర్కియాలజిస్ట్ హత్యకు గురికావడం, దాని వెనక కారణాల్ని వెతుకుతూ కార్తికేయ చేసే సాహసోపేతమైన ప్రయాణమే అసలు కథ. ముగ్ధ (అనుపమ పరమేశ్వరన్) ఎవరు? కార్తికేయ ప్రయాణానికీ, శ్రీకృష్ణతత్వానికీ సంబంధమేమిటనేది తెరపైనే చూడాలి.
విజయవంతమైన ‘కార్తికేయ’కు కొనసాగింపుగా రూపొందిన చిత్రమిది. అయితే కథానాయకుడి పాత్ర, అతడి వ్యక్తిత్వం మినహా.. తొలి భాగం కథకీ, దీనికీ సంబంధమేమీ ఉండదు. ఈసారి శ్రీకృష్ణుడి చరిత్ర చుట్టూ కథను అల్లాడు దర్శకుడు. దైవం, మానవత్వం వంటి విషయాలను చెబుతూనే కథానాయకుడి సాహస ప్రయాణాన్ని ఆసక్తికరంగా ఆవిష్కరించడంలో చిత్రబృందం సఫలమైంది. కథానాయకుడు ద్వారక వెళ్లినప్పట్నుంచీ కథలో వేగం పుంజుకుంటుంది. అప్పటివరకు భిన్న పాత్రల్ని, కథలో పార్శ్వాల్ని పరిచయం చేశాడు దర్శకుడు. హత్యకు గురైన ఆర్కియాలజిస్ట్, ఆయన చేసిన పరిశోధనల ఆధారంగా సమాధానాల్ని వెతుక్కుంటూ కథానాయకుడు వెళ్లే క్రమం ఆకట్టుకుంటుంది. ఆ క్రమంలో ఎదురయ్యే సవాళ్లు, చోటు చేసుకునే అనూహ్య మలుపులు రక్తి కట్టిస్తాయి. ద్వితీయార్ధం నుంచి కథ మరింత బిగితో సాగుతుంది. మధుర గోవర్ధనగిరిలో గుహ, అక్కడ లభించిన ఆధారంతో ఆ ప్రయాణం మరో చోటుకి కొనసాగడం, అభీరా తెగతో కలిసి ప్రయాణం చేయడం, ప్రీ క్లైమాక్స్ సన్నివేశాలు.. ఇలా ద్వితీయార్ధం అంతా కూడా ప్రేక్షకుల్ని కథలో లీనం చేస్తుంది. అక్కడక్కడా సినిమాటిక్ స్వేచ్ఛతో కథనాన్ని నడిపించినా.. వాణిజ్యాంశాల పేరుతో పాటలు, కామెడీ వంటి హంగుల్ని జోడించకుండా తెలివిగా చివరి వరకూ ఉత్కంఠ కొనసాగేలా చేశాడు దర్శకుడు. కొనసాగింపు చిత్రం కాబట్టి తొలి భాగానికి దీటుగా ఉండేలా.. ఆ అంచనాలకు తగ్గట్టుగా ఉండేలా విస్తృతమైన పరిధి ఉన్న కథని ఎంచుకోవడం కలిసొచ్చింది. కథా నేపథ్యం, దానికి తగ్గ సాంకేతిక హంగులు కూడా చక్కగా జోడించడం వల్ల కథ ఓ కొత్తదనాన్ని పంచుతుంది. పతాక సన్నివేశాలు మరో కథకి ఆరంభాన్ని సూచిస్తాయి.
ఫస్టాఫ్ విషయానికి వస్తే కృష్ణుడు దాచిన అపూర్వమైన వస్తువు.. దాని కోసం విలన్స్ ప్రయత్నించటం వంటి సన్నివేశాలతో రన్ చేశారు. మరో వైపు నిఖిల్ ద్వారకకు రావటం అక్కడ అనుపమ పరమేశ్వరన్ పరిచయం, విచిత్రమైన పరిస్థితులు ఎదురవటం జరుగుతాయి. ఆ తర్వాత తను కూడా ఆ వస్తువును వెతకాలనుకోవటం వంటి సీన్స్‌ను చూపించారు. సన్నివేశాలను ఆసక్తికరంగా తెరకెక్కించటం.. దైవం..దైవత్వం.. మానవాళికి మేలు చేయటానికి దేవుడు ఓ ప్రతినిధిని ఎన్నుకోవటం వంటి దృశ్యాలతో ప్రథమార్థం ఆసక్తికరంగా అనిపించింది.
సెకండాఫ్‌లో హీరో ఒక్కో మిస్టరీని ఛేదిస్తూ వెళ్లటం అక్కడ తాను చేసే సాహసకత్యాలు..చివరకు అనుకున్న పనిని పూర్తి చేయటంతో సినిమాను ముగించారు. కార్తికేయ 3 ఉంటుందనే విషయాన్ని చివర్లో చెప్పటం కొస మెరుపు. పాత్రల విషయానికి వస్తే హీరో నిఖిల్ ఎక్కడా ఎక్కువగా హీరోయిజాన్ని చూపించాలనే ఉద్దేశంతో కాకుండా పరిధి మేరకు నటిస్తూ వచ్చాడు. కార్తికేయలో ఎలాంటి ఓ ఎగ్జయిట్‌మెంట్‌ను చూశామో అలాంటి ఎగ్జయిట్మెంట్ మనకు కనిపిస్తుంది. పార్ట్ వన్ కంటే పార్ట్ 2లో యాక్షన్ పార్ట్ కాస్త ఎక్కువే. కానీ కథానుగుణంగా తప్పలేదు. దానికి తన నటనతో నిఖిల్ న్యాయం చేశారు. దర్శకుడు చందు మొండేటికి ‘కార్తికేయ’ తొలి సినిమా. దాన్ని ఎంత శ్రద్ధగా, ప్రేమతో తీశారో ఈ సినిమాపై కూడా అంతే జాగ్రత్తలు తీసుకున్నట్టు స్పష్టమవుతుంది. నిర్మాణం బాగుంది.