చిత్రం: నేను మీకు బాగా కావాల్సిన వాడిని; నటీనటులు: కిరణ్ అబ్బవరం, సంజన ఆనంద్, సోనూ ఠాకూర్, సిద్ధార్థ్ మీనన్, ఎస్వీ కృష్ణారెడ్డి, బాబా భాస్కర్, సమీర్, సంగీత, నిహారిక, ప్రమోదిని, భరత్ రొంగలి తదితరులు; సంగీతం: మణిశర్మ; కూర్పు: ప్రవీణ్ పూడి; ఛాయాగ్రహణం: రాజ్ నల్లి; స్క్రీన్‌ప్లే, మాటలు: కిరణ్ అబ్బవరం; దర్శకత్వం: శ్రీధర్ గాదె; నిర్మాత: కోడి దివ్య దీప్తి; విడుదల తేదీ: 16-09-2022
‘రాజావారు రాణిగారు’ సినిమాతో తెలుగు సినీ ప్రేక్షకులను పలకరించిన యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం. తర్వాత వచ్చిన ‘SR కళ్యాణ మండపం’ చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించారు. యూత్‌లో కాస్త క్రేజ్ సంపాదించుకున్నారు. దీంతో ఆయనకు వరుస సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి. కమర్షియల్ అంశాలతో పాటు వైవిధ్యమైన కాన్సెప్ట్ మూవీస్‌తో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ మూవీ ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’ సినిమా రిలీజైంది. మరి ఆ సినిమా ఎలా ఉందనేది తెలుసుకోవాలంటే ముందు కథ గురించి తెలుసుకుందాం…
కథేంటంటే: తేజు (సంజనా ఆనంద్) ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని. ఓ కుర్రాడిని ప్రేమించి మోసపోతుంది. ఇంట్లో వాళ్లకు ముఖం చూపించుకోలేక భారంగా జీవితాన్ని గడిపేస్తుంటుంది. ఈ క్రమంలోనే మద్యానికి బానిసవుతుంది. అలాంటి ఆమె జీవితంలోకి క్యాబ్ డ్రైవర్ వివేక్ (కిరణ్ అబ్బవరం) ఎంట్రీ ఇస్తాడు. తేజు తాగి పడిపోయిన ప్రతిసారీ ఆమెను తన రూంలో డ్రాప్ చేసేది అతనే. ఓసారి ఆమెను ఓ గ్యాంగ్ కిడ్నాప్ చేయబోతే కాపాడతాడు. దీంతో ఆమెకు వివేక్‌పై మంచి అభిప్రాయం ఏర్పడి.. తన విషాద గాథను అతనితో పంచుకుంటుంది. అదే సమయంలో వివేక్ కూడా తన విఫల ప్రేమకథను ఆమెతో పంచుకుంటాడు. మరి ఆ తర్వాత ఏమైంది? ఇద్దరి ప్రేమకథలకు ఉన్న లింకేంటి? ఒకరి కథ మరొకరు తెలుసుకున్నాక ఇద్దరూ కలిసి ఏం చేశారు? అన్నది తెరపై చూసి తెలుసుకోవాలి.
హీరోయిన్ ప్రేమలో మోసపోతుంది. దాంతో అబ్బాయిలంటేనే ద్వేషం పెంచుకుంటుంది. ఫ్రస్టేషన్‌తో ఉంటుంది. అలాంటి అమ్మాయికి ఓ క్యాబ్ డ్రైవర్ అయిన హీరో పరిచయం అవుతాడు. ఆమె మనసు మారుస్తాడు. కానీ హీరోకి, హీరోయిన్‌కి ఓ రిలేషన్ ఉంటుంది. అదేంటనేదే కథ. దాని చుట్టూనే కథంతా నడుస్తుంది. కిరణ్ అబ్బవరం మన పక్కింటి కుర్రాడిలాంటి పాత్రలో నటించి మరోసారి మెప్పించాడు. తనే స్క్రీన్ ప్లే.. మాటలు రాసుకున్నాడు. అలాగే సినిమాలో తన పాత్రకు కావాల్సిన హీరోయిజం ఎలివేషన్ సీన్స్, ఫైట్స్ కూడా ఇన్క్లూడ్ చేసుకున్నాడు.
తన పాత్ర పరంగా తన నటన ఓకే. ఇక హీరోయిన్ సంజనా ఆనంద్ పాత్ర చుట్టూనే సినిమా అంతా రన్ అవుతుంది. ఆమె నటన పరంగా ఓకే అనించిందే తప్ప.. ఆ పాత్రలోని ఎమోషన్స్‌ను ఇంకా బాగా చేసుండవచ్చు అనే భావన కలిగింది. ఇక బాబా భాస్కర్ పాత్రలో కాస్తో కూస్తో కామెడీ కనిపించింది. అది తప్ప సినిమాలో ఎంటర్టైనింగ్ పార్ట్ వెతికినా కనపడదు. సిద్ధార్థ్ మీనన్ చుట్టూనే ఫస్టాఫ్ అంతా నడుస్తుంది. నిజానికి ఫస్టాఫ్‌లో అతనే హీరో అనిపిస్తాడు. ఇక సినిమాలోని ఇతర తారాగణంగా నటించిన ఎస్.వి.కృష్ణారెడ్డి, సమీర్ తదితరులు వారి వారి పాత్రల పరిధి మేరకు నటించారు.
ఎవరెలా చేశారంటే: వివేక్ పాత్రలో కిరణ్ అబ్బవరం నటన బాగుంది. నిజానికి ఈ చిత్రంలో ఆయన తన నటనపైన కంటే మాస్ ఎలివేషన్లపైనే ఎక్కువ దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే కథను పక్కకు నెట్టి మరీ బలవంతంగా యాక్షన్ ఎపిసోడ్స్ ఇరికించేశారు. వాటిని డిజైన్ చేసిన విధానం బాగున్నా.. అవి కిరణ్ ఇమేజ్‌కు మించిన స్థాయిలో ఉన్నాయి. ఐటెం పాటలో.. నచ్చావబ్బాయ్ గీతంలో కిరణ్ వేసిన స్టెప్పులు ఆకట్టుకుంటాయి. తేజు పాత్రలో సంజనా ఆనంద్ ఫర్వాలేదనిపించింది. వాస్తవానికి కథలోనే సరైన బలం లేకపోవడం వల్ల తెరపై ప్రతి పాత్రా తేలిపోయింది. సోనూ ఠాకూర్, బాబా భాస్కర్, ఎస్వీ కృష్ణారెడ్డి తదితరుల పాత్రలు పరిధి మేరకు ఉంటాయి. శ్రీధర్ గాదె రాసుకున్న కథలో ఏమాత్రం కొత్తదనం లేదు. కిరణ్ అబ్బవరం అందించిన స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందుకు తగినట్లుగానే ఉన్నాయి. సినిమా మొత్తంలో కాస్త కాలక్షేపాన్నిచ్చింది మణిశర్మ సంగీతం మాత్రమే. అదే చిత్రానికి ప్రధాన ఆకర్షణ. నిర్మాణ విలువలు బాగున్నాయి.