హిందూ దేవాలయాల్లో అనేక చోట్ల శని గ్రహము నవగ్రహాలలో ఒక భాగంగా ఉంటుంది. అయితే కొన్ని పుణ్యక్షేత్రాల్లో మాత్రం కేవలం శనీశ్వరుడిని మాత్రమే పూజిస్తుంటారు. అలాంటి ఆలయాలు దేశవ్యాప్తంగా చాలా ఉన్నాయి. అలాంటి పుణ్యక్షేత్రాల్లో ఒకటే మందపల్లిలోని శ్రీ మందేశ్వర స్వామి ఆలయం. ఈ క్షేత్రంలోని శివలింగాన్ని ఆ శనేశ్వరుడే ప్రతిష్టించాడని భక్తులు విశ్వసిస్తారు. పురాణ ప్రాధాన్యత కలిగిన ఈ విశిష్టమైన దేవాలయానికి సంబంధించిన ఓ కథ ప్రాచుర్యంలో ఉంది.
మందపల్లి పూర్వం దట్టమైన అరణ్యంగా ఉండేది. ఈ ప్రాంతంలో కైటభుడనే రాక్షసుడు ఉండేవాడు. అతని కుమారులే అశ్వర్థుడు, పిప్పలుడు. వీరిద్దరు మారు రూపాల్లో తిరుగుతూ ఈ అటవీ ప్రాంతంలో తమస్సు చేయడానికి వచ్చే మునులు, వేదాలను నేర్చుకోవడానికి వచ్చే వారిని చంపి తినేవారు. ఈ నేపథ్యంలోనే అగస్త్య మహర్షి దక్షిణ దేశ యాత్రలో భాగంగా మందపల్లి ప్రాంతానికి వస్తారు. అక్కడ ఉన్న మునులు అగస్త్య మహర్షికి ఇక్కడ జరుగుతున్న విషయాలన్నీ చెప్పి తమను ఆ రాక్షసుల బారి నుంచి కాపాడాల్సిందిగా వేడుకొంటారు. దీంతో అగస్త్య మహాముని బాగా ఆలోచించి ఇక్కడ గోదావరి తీరంలో శివుడి గురించి తపస్సు చేస్తున్న శనేశ్వరుడి దగ్గరకు మునులను తీసుకువెళుతాడు. ఆ రాక్షసులను సంహరించి తమను కాపాడాల్సిందిగా మునులు శనీశ్వరుడిని వేడుకొంటారు.
వీరి అభ్యర్థనను సున్నితంగా తిరస్కరించిన శనీశ్వరుడు తాను ప్రస్తుతం శివుడి గురించి తపస్సు చేస్తున్నానని తమస్సు వల్ల వచ్చిన శక్తితోనే ఆ రాక్షసులను సంహరించగలనని చెబుతాడు. దీంతో మునులు బాగా ఆలోచించి తమ తప:శక్తిని శనీశ్వరుడికి ధారపోయడానికి అంగీకరిస్తారు. ఈ ప్రతిపాదనకు అంగీకరించిన శనీశ్వరుడు అశ్వర్థుడు, పిప్పలుడులను సంహరించడానికి అంగీకరిస్తాడు. ప్రథకం ప్రకారం మొదట శనీశ్వరుడి ఒక ముసలి బ్రాహ్మణుడి రూపంలో రావి చెట్టు రూపంలో ఉన్న అశ్వర్థుడి వద్దకు వెళుతాడు. వచ్చినవాడు సాధారణ బ్రాహ్మనుడేననని బ్రమించిన అశ్వర్థుడు శనీశ్వరుడిని అమాంతం మింగేస్తాడు. దీంతో శనీశ్వరుడు ఆ అశ్వర్థుడి కడుపులోకి వెళ్లి అతని ప్రేగులను తెంపేస్తాడు. దీంతో అశ్వర్థుడు విలవిల్లాడుతూ ప్రాణాలు వదిలేస్తాడు. ఆ తర్వాత పిప్పలుడి వద్దకు బ్రాహ్మణ యువకుడి రూపంలో వెళ్లి తనకు వేదాలు నేర్పించాల్సిందిగా కోరుతాడు. పిప్పలుడు కూడా వచ్చినవాడు సాధారణ బ్రాహ్మణుడే అని భావించి శనీశ్వరుడిని మింగేస్తాడు. ఇక్కడ కూడా శనీశ్వరుడు పిప్పలుడి కడుపులోకి వెళ్లి అతని ప్రేగులను తెంపి సంహరిస్తాడు.
అనంతరం ఆ ఇద్దరి అసురుల సంహారం వల్ల కలిగిన బ్రహ్మహత్యా పాతకాన్ని నివారించుకొనేందుకు మందపల్లిలో శనీశ్వరుడు ఒక లింగాన్ని ప్రతిష్టించి దానికి సోమేశ్వరుడని పేరు పెడుతాడు. అయితే ఈ శివలింగం శనీశ్వరుడు ప్రతిష్టించడం వల్ల అదే పేరుతో అంటే శనేశ్వరాలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయ నిర్మాణంతో పాటు ఇక్కడి పూజా విధానాలు కూడా కొంత విభిన్నంగా ఉంటాయి. శత్రు, రోగ, రుణ బాధల నుంచి విముక్తి కోసం వేలాది మంది భక్తులు ఈ దేవాలయాన్ని సందర్శిస్తుంటారు. వీరిలో జాతక చక్రంలో శని వల్ల సమస్యలున్నవారే ఎక్కువ. అదే విధంగా కోర్టు కేసులు, శత్రు భయం, రోగాలు, రుణాల నుంచి విముక్తి కోసం స్థానికులే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడకు నిత్యం వేల సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తుంటారు. తమ కోర్కెలు తీరితే స్వామివారికి ముడుపులు తప్పకుండా చెల్లించేస్తుంటారు. ఈ ఆలయంలోనే సప్తమాత్రుకలు ప్రతిష్టించినట్లు చెప్పే పార్వతీ దేవి విగ్రహం ఉంది. అదే విధంగా అష్టమహా నాగుల్లో ఒకడైన కర్కోటకుడచే ప్రతిష్టించిన శివలింగాన్ని కూడా దర్శించుకోవచ్చు. అటు పక్కనే గౌతమి మహర్షి ప్రతిష్టించిన శ్రీ వేణుగోపాలస్వామి విగ్రహాన్ని దర్శించుకోవచ్చు.
శనివారం రోజున వచ్చే త్రయోదశి, మహాశివరాత్రి, శనివారం రోజున వచ్చే అమావాస్య రోజున ఈ క్షేత్రంలో విశేష పూజలు నిర్వహిస్తుంటారు. ఆ రోజుల్లో ఇక్కడకు లక్షల్లో భక్తులు వస్తుంటారు. ఆ రోజుల్లో శనీశ్వరుడికి తైలంతో అభిషేకం చేస్తారు. ఇందుకు అవసరమైన వస్తువులన్నీ దేవాలయం ప్రాంగణంలోనే దొరుకుతాయి. పూజ తర్వాత నల్లటి వస్త్రాలను దానం చేస్తారు. ఇక పూజలో మిగిలిపోయిన వస్తువులను ఇంటికి తీసుకువెళ్ల కూడదనేది ఇక్కడ అనాదిగా వస్తున్న ఆచారం. అదేవిధంగా ఆలయం నుంచి బయటికి వెళ్తూ వెనక్కి తిరిగి చూడకూడదని పూజారులు హెచ్చరిస్తూ ఉంటారు. ఇందుకు విరుద్ధంగా నడుచుకొంటే శని దోషం మళ్లీ చుట్టుకుంటుందని వారు చెబుతుంటారు. అందువల్లే పూజ తర్వాత ఎవరూ వెనక్కు తిరిగి చూడరు. కోనసీమ జిల్లాలో ముక్తేశ్వరం-కొత్తపేట మార్గంలో ఈ క్షేత్రం ఉంది. రాజమండ్రి నుంచి మందపల్లి ఆలయానికి 38 కిలోమీటర్ల దూరం. దేశంలోని ఎక్కడి నుంచైనా బస్సు, రైలు, విమాన మార్గాల్లో రాజమండ్రి చేరుకుని.. మందపల్లికి రోడ్డుమార్గంలో వెళ్లొచ్చు.