తెలుగు సినిమా కీర్తి కెరటాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన కళాత్మక దృశ్య కావ్యం ‘శంకరాభరణం’ 45 వసంతాలు పూర్తి చేసుకుంది. 1980, ఫిబ్రవరి 2న విడుదలైన ఈ చిత్రం తెలుగు సినిమా సత్తాని ప్రపంచవ్యాప్తంగా చాటింది. కళాతపస్వి కె.విశ్వనాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని పూర్ణోదయా ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై ఏడిద నాగేశ్వరరావు, ఆకాశం శ్రీరాములు నిర్మించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో పాటు తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్టాల్లో అఖండ విజయం సాధించింది. అప్పట్లోనే పాన్ ఇండియా మూవీగా నిలిచి.. అమెరికాలోనూ రెగ్యులర్ థియేటర్లో విడుదలైన మొట్టమొదటి తెలుగు చిత్రంగా రికార్డులకెక్కింది. అప్పట్లో ఎక్కడ చూసినా.. ఎక్కడ విన్నా శంకరాభరణం ప్రస్తావనే. శాస్త్రీయ సంగీతానికి ఆదరణ కరువైన రోజుల్లో ఈ చిత్రం విడుదల తరువాత ఎంతో మంది శాస్త్రీయ సంగీతం నేర్చుకోవటం మొదలుపెట్టారంటే తెలుగు ప్రజలపై ఈ చిత్రం ఎంతలా చెరగని ముద్ర వేసిందో అర్ధం చేసుకోవచ్చు.
ఇక అవార్డుల విషయానికి వస్తే జాతీయ అవార్డుల్లో కళాత్మక విలువలు , వినోదాత్మకంతో కూడిన జనరంజక చిత్రంగా స్వర్ణ కమలం అందుకుంది. తెలుగులో స్వర్ణ కమలం అందుకున్న తొలి తెలుగు చిత్రం కూడా ఇదే. అలాగే గాయకులు SP బాలసుబ్రహ్మణ్యం ఉత్తమ నేపధ్య గాయకుడిగా, వాణీజయరాం ఉత్తమ గాయనిగా, కేవీ మహదేవన్ ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డులు అందకున్నారు. ఫ్రాన్స్‌లో జరిగే Besancon ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌లో ఉత్తమ చిత్రంగా అంతర్జాతీయ అవార్డు అందుకుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఏకంగా 8 నంది అవార్డులు అందుకుంది. ఇక దేశంలోని అనేక సాంస్కృతిక సంస్థలు ఈ చిత్ర బృందాన్ని అవార్డులు, సన్మానాలతో ముంచెత్తాయి.
ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు గారు శంకరాభరణం చిత్రంపై ఏకంగా మూడు రోజులు ప్రవచనాలు కార్యక్రమం నిర్వహించారు. ఓ చలనచిత్రంపై ఇలా ప్రవచనం నిర్వహించడం అదే మొదటిసారి కావడం విశేషం. ఈ చిత్రానికి పనిచేసిన ప్రతి ఒక్కరికీ ఓ ప్రత్యేక గౌరవాన్ని తీసుకు వచ్చింది ఈ చిత్రం. ప్రధాన పాత్ర పోషించిన జేవీ సోమయాజులును అందరూ శంకరాభరణం శంకరశాస్త్రి అనే పిలిచేవారు. అప్పటివరకు వ్యాంపు పాత్రలు ఎక్కువగా చేసే మంజు భార్గవి తులసి పాత్రలో ఒదిగిపోయింది. ప్రముఖ హాస్య నటుడు అల్లు రామలింగయ్య ఓ కీలక పాత్ర పోషించారు . ఈ సినిమా పాటలు ఇప్పటికీ భాషతో సంబంధం లేకుండా అలరిస్తూనే ఉంటాయి. ఈ చిత్ర నిర్మాత ఏడిద నాగేశ్వరరావు తాను చెన్నై, హైదరాబాద్ నగరాల్తలో నిర్మించుకున్న ఇళ్లకు శంకరాభరణం అని పేరు పెట్టుకున్నారు. నాలుగున్నర దశాబ్దాలు దాటుతున్నా ఈ చిత్రం భారతీయ సినీ ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకోవడం విశేషం.