హైదరాబాద్ పేరు చెప్పగానే వెంటనే గుర్తొచ్చేవాటిలో నగరం నడిబొడ్డున ఉండే హుస్సేన్ సాగర్.. అందులోని బుద్ధ విగ్రహం. నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ప్రత్యేకంగా తయారు చేయించిన ఈ విగ్రహం హైదరాబాద్‌ను అద్భుతమైన ప్రపంచ పర్యాటక పర్యాటక ప్రాంతాల్లో ఒకటిగా నిలబెట్టింది. అయితే ఈ విగ్రహం చుట్టూ ఓ విషాద గాథ ఉందని, ఇది హుస్సేన్ సాగర్ అడుగున రెండేళ్లు ఉండిపోయిందని చాలామందికి తెలియకపోవచ్చు. అప్పట్లో విగ్రహం తరలింపు సమయంలో దీని కిందపడి ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు.
58 అడుగుల ఎత్తు, 350 టన్నుల బరువు .. 1990 మార్చి 10… అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఈ బుద్ధ విగ్రహం గురించి విస్తృతంగా చర్చ జరుగుతోంది. అత్యంత బరువు గల ఈ విగ్రహం హుస్సేన్ సాగర్ మధ్యలో కొలువుదీరడానికి సిద్ధంగా ఉంది. అదే రోజు బుద్దుడి విగ్రహం తరలింపులో అపశృతి చోటుచేసుకుంది. విగ్రహం 35 అడుగుల లోతున నీటిలో పడిపోయింది. ఆ ఘటనలో ఎనిమిది మంది చనిపోయారని ద వాషింగ్టన్ పోస్ట్ 1990లో ‘బుద్ధ ఆఫ్ ది లేక్ బాటమ్’ శీర్షికతో రాసిన ఒక కథనంలో ప్రస్తావించింది. బుద్ధ విగ్రహం మునిగిన ఘటనపై రాజకీయ నాయకులు, జాతీయ, అంతర్జాతీయ మీడియా నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. దాదాపు రెండేళ్లు విగ్రహం అలా ‘సాగర’ గర్భంలోనే ఉండిపోయింది.
స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని చూసి…
ఆంధ్రప్రదేశ్‌లో 1984లో ఎన్టీఆర్ నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. ఈ బుద్ధ విగ్రహం నెలకొల్పడానికి ఎన్టీఆర్ అమెరికా పర్యటన కారణమైంది. ఎన్టీఆర్ అమెరికాలో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని చూసి అలాంటిదే తన రాష్ట్రంలో నెలకొల్పాలని నిర్ణయించుకున్నారు. ఆ విగ్రహం న్యూయార్క్ నగరంలోని లిబర్టీ ద్వీపంలో 1886వ సంవత్సరంలో ప్రతిష్టించారు. ‘‘151 అడుగుల ఎత్తులో ఉన్న స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అమెరికా స్వేచ్ఛను ప్రతిబింబిస్తుంది, నేనూ అలాంటిదే కోరుకున్నాను. అది సమాజానికి నా వంతు సేవగా ఉంటుంది’’ అని ఎన్టీఆర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.
హుస్సేస్‌సాగర్‌లో గౌతమ బుద్దుడి విగ్రహం చెక్కించాలని ఎన్టీఆర్ నిర్ణయించుకున్నారు. బుద్దుడు గొప్ప మానవతా వాది అని, ప్రజలకు సత్యాన్ని బోధించాడని, ఆయన తమకు గర్వకారణమని, అందులోనూ భారతదేశంలో జన్మించాడని ఎన్టీఆర్ చెప్పారు. అతిపెద్ద బుద్ధ విగ్రహం తయారు చేయడానికి స్తపతి గణపతిని నియమించారు. అప్పటికే ఆయనకు పలు ఆలయాలు, భవనాలు నిర్మించిన అనుభవం ఉంది. విగ్రహం ఏక శిలతో రూపుదిద్దుకోవాలని ఎన్టీఆర్ కోరుకున్నారు. విగ్రహం తయారీ కోసం హైదరాబాద్ సమీపంలోని నేటి యాదాద్రి భువనగిరిలో ఒక గ్రానైట్ కొండను గుర్తించారు. ఎన్టీఆర్ చేతుల మీదుగా పని ప్రారంభమైంది. విగ్రహానికి ఐదు కోట్ల రూపాయలకు పైగా ఖర్చు అయింది. గణపతి ఆధ్వర్యంలో రెండేళ్లు కష్టపడి ఈ ఏకశిల విగ్రహాన్ని చెక్కారు. అక్కడి నుంచి విగ్రహాన్ని హుస్సేన్ సాగర్ తీరంలోకి రావడానికి దాదాపు ఐదేళ్లు పట్టింది.
ఈ భారీ విగ్రహాన్ని హుస్సేన్ సాగర్‌లోకి తరలించే బాధ్యతలు ఏదైనా కంపెనీకి అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. హుస్సేన్ సాగర్‌లో విగ్రహం ప్రతిష్టించడానికి 15 అడుగుల వేదిక కూడా నిర్మించారు. ఇక విగ్రహం ప్రతిష్టాపన ఒకటే మిగిలింది. అంతలోనే ఎదురుదెబ్బ తగిలింది. విగ్రహ ప్రతిష్టాపనకు మూడు నెలలు ఉందనగా 1989 డిసెంబర్లో ఎన్టీఆర్ ప్రభుత్వం దిగిపోయింది. మళ్లీ ఎన్నికలు రావడంతో విగ్రహం ప్రతిష్టాపన ఆలస్యమైంది. ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. బుద్దుడి విగ్రహం ప్రతిష్టించాలని చెన్నారెడ్డి నిర్ణయించడంతో పనులు ముందుకు సాగాయి.
దీంతో ఏబీసీ ఇండియా అనే కంపెనీకి హుస్సేన్ సాగర్‌కు విగ్రహం తీసుకొచ్చే బాధ్యత అప్పగించింది అప్పటి ప్రభుత్వం. హైదరాబాద్‌లో అప్పట్లో రోడ్లు ఇరుకుగా ఉండటంతో ఆ విగ్రహాన్ని తరలించడం కష్టమైంది. విగ్రహం తరలింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక రోడ్లు సైతం వేసింది. కొన్ని రోడ్లు వెడల్పు చేసింది. 1990 మార్చి 10 రోజున విగ్రహాన్ని హుస్సేన్ సాగర్‌లోకి తరలించారని ప్రణాళిక వేశారు. ముందుగా ట్రక్‌లో విగ్రహాన్ని హుస్సేన్ సాగర్‌కు ప్రణాళిక ప్రకారమే సురక్షితంగా తరలించారు. రిబ్బన్ కట్ చేసిన తర్వాత విగ్రహాన్ని అప్పటికే సిద్ధం చేసిన భారీ పడవలోకి తరలించారు. 100 మీటర్లకు పైగా దూరం ప్రయాణించాక పడవ ఒక్కసారిగా కుదుపులకు లోనైంది. ఎంతలా అంటే ఆ అలల ధాటికి పక్కన ప్రయాణిస్తున్న ఓ పడవ పైకి లేచి నీటిలో పడిపోయింది. పడవ కుదుపుల కారణంగా విగ్రహం నీటిలోకి మెల్లగా జారిపోవడం మొదలైంది. విగ్రహం తరలించడానికి ఏబీసీ కంపెనీ ఏర్పాటుచేసిన వర్కర్లు దాని కిందే ఉండిపోయారు. ఏబీసీ కంపెనీ ప్రతినిధి ఎస్.కె. ముంద్రా సహా ఎనిమిది మంది విగ్రహం కింద చిక్కుకొని ప్రాణాలు కోల్పోయారు. ఓ ఐదు గంటల అనంతరం విగ్రహం పూర్తిగా నీటిలో మునిగిపోయింది.
ముఖ్యమంత్రిగా మర్రి చెన్నారెడ్డి ఏడాది పాటే ఉన్నారు. అనంతరం 1990 డిసెంబర్లో నేదురుమల్లి జనార్థన్ రెడ్డి సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆయన హయాంలోనూ బుద్ధ విగ్రహాన్ని బయటకు తీయించలేదు. 1992 అక్టోబర్‌లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించాక విగ్రహాన్ని బయటకు తీసే పనులు చేపట్టారు. అదే ఏడాది ప్రత్యేక క్రేన్ల సాయంతో హుస్సేన్ సాగర్‌లో మునిగిపోయిన బుద్దుడి విగ్రహాన్ని బయటకు తీశారు. 1992 డిసెంబర్ 1న విగ్రహాన్ని ప్రతిష్టించారు. 1994లో టీడీపీ అధికారంలోకి రావడంతో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా మరోసారి బాధ్యతలు చేపట్టారు. అనంతరం ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతంలో సుందరీకరణ పనులు చేయించారు. అంతకుముందు ట్యాంక్‌బండ్ చుట్టూ పలువురు చరిత్రకారుల విగ్రహాలు ఎన్టీఆర్ చెక్కించి, నెలకొల్పారు.