క్యాబ్, ఆటో సర్వీసులంటే ఓలా, ఉబర్ మాత్రమే గుర్తొచ్చే రోజులవి. అప్పుడు ముగ్గురు మిత్రులు కలిసి మూడో సంస్థను రంగంలోకి తెచ్చారు. మార్కెట్ జెయింట్స్‌గా ఉన్న రెండు పెద్ద కంపెనీలతో పోటీపడి గెలిచారు. యావద్దేశం విస్తరించారు. ఆ సంస్థే ర్యాపిడో.. ఇప్పుడు దాని విలువ రూ.6800 కోట్లు. ర్యాపిడోను ఆ స్థాయికి తీసుకెళ్లిన ఆ ముగ్గురు కుర్రాళ్లే పవన్ గుంటుపల్లి, అరవింద్ శంక, రిషికేష్. సరికొత్త ఆలోచనే పెట్టుబడిగా సాగిన వారి విజయ యాత్రపై ప్రత్యేక కథనం…
రోడ్డు మీద అంతా గజిబిజి గందరగోళంగా ఉంటుంది. ఆటోలూ, కార్లతో పాటు పెద్ద వాహనాలన్నీ ఎక్కడివక్కడ ఆగిపోతుంటాయి. కానీ, బైకుల వాళ్లు మాత్రం ఆ రద్దీలోంచి నేర్పుగా తప్పించుకుంటారు. నిత్యం ఇలాంటి దృశ్యాలు కోకొల్లలుగా కనిపిస్తుంటాయి. బైక్‌లకు మాత్రమే సాధ్యమైన ఈ ప్రత్యేకతే ర్యాపిడో విజయసూత్రమైంది. ఎక్కడికి కావాలంటే అక్కడికి నిమిషాల్లో డ్రాప్ చేయగలిగిన మొబిలిటీ సర్వీస్‌గా అది గుర్తింపు పొందింది. పైగా క్యాబ్‌లూ, ఆటోలతో పోలిస్తే చాలా తక్కువ ఖర్చుతో వేగంగా గమ్యస్థానానికి చేరగలిగిన అవకాశం బైక్ ట్యాక్సీలతోనే సాధ్యం. ర్యాపిడోకు అదే వరమైంది.
పవన్ ఖరగ్‌పూర్ ఐఐటీలో చదువుకున్నాడు. ఆ తరవాత రిలయెన్స్ ఇండస్ట్రీస్‌లో ఇంటర్న్‌షిప్ చేశాడు. కొంత కాలం శామ్సంగ్ రీసెర్చ్ సెంటర్లోనూ పనిచేశాడు. అరవింద్- భువనేశ్వర్ ఐఐటీ విద్యార్థి. టాటామోటార్స్, ఫ్లిప్‌కార్ట్ సంస్థల మాజీ ఉద్యోగి. రిషికేష్ బెంగళూరులోని పేస్ యూనివర్సిటీలో చదువుకున్నాడు. ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా కలుసుకున్న ఈ ముగ్గురూ టెక్నాలజీ, బిజినెస్, ప్రొడక్ట్ మేనేజ్మెంట్లలో సిద్ధహస్తులు. వీరి నేపథ్యాలు భిన్నమే అయినా ఆలోచనలు మాత్రం ఒకేలా ఉండటంతో కలిసి వ్యాపారం చేయాలనుకున్నారు.
క్యాబ్ సర్వీసులు ఓ స్థాయి వారికి పరిమితం. ఆటో ఛార్జీలూ ఇంచుమించు అంతే ఉంటున్నాయి. సామాన్యుల కోసం ఏదైనా చేయాలనే ఆలోచనతో ఈ ముగ్గురూ కలిసి 2015లో బైక్ ట్యాక్సీని ప్రారంభించాలనుకున్నారు. అప్పటికే ఉబర్, ఓలాల్లో బైక్ ట్యాక్సీ అందుబాటులో ఉంది. ఆ పోటీని తట్టుకుంటూ… వాటికంటే మెరుగైన సేవలు అందించాలన్న లక్ష్యంతో ర్యాపిడో సంస్థకు శ్రీకారం చుట్టింది పవన్ మిత్ర బృందం. ఆలోచన అయితే ఉంది కానీ, దాన్ని ఆచరణలో పెట్టడానికి మాత్రం వీరి వద్ద పెట్టుబడి లేకపోయింది. దానికోసం ఎన్నో బ్యాంకుల చుట్టూ తిరిగారు, సుమారు వంద మంది పెట్టుబడిదారుల్ని కలిశారు. అందరూ ఆలోచన బాగుంది అన్నారు తప్ప ఎక్కడా పెట్టుబడి ఊసులేదు.
దాదాపు ఏడాదిపాటు తమ ప్రయత్నాలు ఫలించకపోయినా తమ ఆలోచన మీదున్న నమ్మకంతో ఎక్కడా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా రకరకాల మార్గాలు అన్వేషించారు. చివరికి 2016లో హీరో మోటోకార్ప్ ఛైర్మన్ పవన్ ముంజాల్‌కి ర్యాపిడో లక్ష్యం నచ్చింది. తమ సంస్థ తరపున కాకుండా వ్యక్తిగతంగా పెట్టుబడి పెట్టడంతో పాటు- పవన్ మిత్రబృందానికి ఎన్నో సలహాలూ సూచనలూ ఇచ్చి ముందడుగు వేయించారాయన. ఆ ప్రోత్సాహంతో తొలిసారి బెంగళూరులో ఆరంభమైన ర్యాపిడో బైక్ ట్యాక్సీ… క్రమంగా దేశవ్యాప్తంగా విస్తరించి వందకుపైగా నగరాల్లో పరుగులు తీస్తోంది. రోజుకు పది లక్షలకుపైగా ట్రిప్లతో దూసుకుపోతోంది. క్రమంగా ఆటో సర్వీసునూ అందుబాటులోకి తీసుకొచ్చింది.
చిన్న స్థాయిలో మొదలైన ర్యాపిడో బైక్ ట్యాక్సీ మార్కెట్లో పోటీని, పలు సవాళ్లనీ అధిగమించి విజయవంతమవడానికి ఎన్నో కారణాలున్నాయి. విద్యార్థులూ, నిరుద్యోగులూ, మధ్యతరగతి యువతకు ఆర్థికంగా వెన్నుదన్నుగా ఉండాలని- అలాంటి వారినే డ్రైవర్లుగా ఎంచుకోవడం మొదలుపెట్టింది. మంచి కండిషన్లో ఉన్న బైక్, డ్రైవింగ్ లైసెన్స్, క్రమశిక్షణతో కూడిన డ్రైవింగ్… వంటి వాటిని అర్హతలుగా నిర్ణయించి లక్షల మందికి ఈ సంస్థ ఉపాధినిస్తోంది. రైడ్ షేర్ ఇన్సూరెన్స్‌తో వచ్చిన మొదటి బైక్ ట్యాక్సీ కూడా ర్యాపిడోనే. బైక్ ట్యాక్సీలో ప్రయాణిస్తున్న సమయంలో రైడర్‌కి ప్రమాదం జరిగితే ఈ సంస్థ బీమా చెల్లిస్తుంది. అంతేకాదు, కెప్టెన్ (బైక్ నడిపే వ్యక్తి) ఎంత స్పీడులో వెళ్తున్నాడూ, మలుపుల వద్ద ఎలా తిప్పుతున్నాడూ వంటివన్నీ ట్రాకర్ల సాయంతో ఓ బృందం గమనిస్తుంటుంది. అతి వేగంగా నడిపినా, ఎలాపడితే అలా డ్రైవ్ చేసినా ఆ కెప్టెన్‌ని డీయాక్టివేట్ చేస్తారు.
మహిళా కెప్టెన్లను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుంటుంది ర్యాపిడో. చెన్నైలో ‘బైక్ పింక్’ పేరుతో ఆప్‌లో ఓ ఆప్షన్ ఉంది. మహిళల్ని జాగ్రత్తగా దిగబెట్టడానికి- ఆసక్తి ఉన్న ఆడవాళ్లకు డ్రైవింగ్ నేర్పించి, వారికి లైసెన్స్, బైకు కొనుక్కోవడానికి లోన్లూ ఇప్పిస్తున్నారు. ఇంకా ఇటువంటి ఎన్నో ఆలోచనలే ర్యాపిడోను ఆరువేల కోట్ల రూపాయల విలువైన సంస్థగా నిలబెట్టాయి అంటోంది పవన్ మిత్ర బృందం.