అయ్యప్ప దీక్షా స్వాములు నల్ల వస్త్రాలే ఎందుకు ధరిస్తారు?

Telugu BOX Office

శబరిమల అయ్యప్పస్వామి ఆలయ సందర్శన కోసం వెళ్లే వారిలో ఎక్కువ మంది మండల దీక్షను చేపడతారు. 41 రోజుల పాటు చేసే ఈ దీక్షలో కఠినమైన నియమాలను పాటిస్తారు. ఈ వ్రతంలో ఉండేవారంతా ఉదయాన్నే గజగజ వణికే చలిలో చన్నీటితో స్నానం చేయాలి. కటిక నేలమీదే నిద్రపోవాలి. బ్రహ్మచార్యం పాటించాలి. అన్నింటికంటే ముఖ్యంగా ప్రతిరోజూ నల్లని రంగు బట్టలే ధరించాలని గ్రంథాలలో పేర్కొనబడింది. ఇలా 41 రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో, నియమ నిష్టలతో అయ్యప్ప స్వామిని పూజించి మకర సంక్రాంతి రోజున మకర జ్యోతి దర్శనం కోసం వేయి కళ్లతో వేచి చూస్తారు. అనంతరం స్వామి సన్నిధిలో మాలను తొలగిస్తారు.

​ఆరోగ్య ప్రయోజనాలు..
అయ్యప్ప దీక్షను తీసుకోవడం వల్ల ఆధ్యాత్మిక భావన పెరగడమే కాదు.. ఆరోగ్య పరంగా ఎంతగానో మేలు చేకూరుతుంది. ఈ మండల దీక్షలో ఉన్నంత కాలం పాటించే పద్ధతుల వల్ల అనేక ప్రయోజనాలు కలగనున్నాయి. తెల్లవారుజామునే చల్లని వాతావరణంలో చన్నీటితో స్నానం చేయడం వల్ల మీ మనసు తేలిక పడి అయ్యప్ప స్వామిని పూజించడంలో ఏకాగ్రత పెరుగుతుంది. అంతేకాదు ఎన్నో ఆలోచనలతో ఉండే మన మెదడును సైతం ఉత్తేజపరుస్తుంది.

​పాదాలతో నడవడం వల్ల..
అయ్యప్ప మాలను ధరించిన వారు ప్రతిరోజూ చెప్పులు లేకుండా నడవడం వల్ల పాదాలపై ఒత్తిడి పెరిగి, రక్త ప్రసరణ, గుండె మంచిగా పని చేస్తుంది. అంతేకాదు ఈ 41 రోజుల పాటు శాకాహారం మాత్రమే తినడం వల్ల, అందులో ఎలాంటి మసాల తిండి ఉండకపోవడం వల్ల జీర్ణ సమస్యలనేవే ఉండవు.


​భగవంతుని అనుగ్రహం లభిస్తుందని..

సాధారణంగా చలికాలంలో అయ్యప్ప మాలను వేసుకునే స్వాములందరూ నల్లని దుస్తులనే ధరిస్తారు. ఎందుకంటే ఇది శరీరంలోని వేడిని గ్రహించి మనకు వెచ్చదనాన్ని ఇస్తుంది. అలాగే శబరిమల యాత్ర కోసం అడవులలో ప్రయాణించే సమయంలో నలుపు రంగు అడవి జంతువుల నుండి మనల్ని కాపాడుతుంది. ఇలా అయ్యప్ప మాలను ధరించిన వారు స్వామి వారి అనుగ్రహం పొందడంతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. నల్లని దుస్తులను ధరించి దీక్షలో పాల్గొనడం వల్ల శని దేవుని ప్రభావం తొలగిపోతుంది.

​సామాన్య జీవనం అలవడుతుందని..
అయ్యప్ప మాలను ధరించిన వారికి సామాన్య జీవనం గడపడం అలవాటుగా మారుతుంది. అందుకే మాలను తీసిన తర్వాత కూడా వారు చాలా హుందాగా ప్రవర్తిస్తారు. అంతేకాదు మండల దీక్షను చేపట్టిన వారికి.. మిగిలిన జీవితానికి ఆదర్శంగా నిలుస్తుంది. అయ్యప్ప దీక్ష తర్వాత కూడా ఎలాంటి హంగు, ఆర్భాటాలు లేకుండా బతకగలుగుతారు.

Share This Article
Leave a comment