అర్ధనారీశ్వర ఆలయం.. ఒక్కసారైనా దర్శించాల్సిందే!

Telugu BOX Office

శివాలయాల్లో సాధారణంగా శివలింగం, పార్వతీదేవి విగ్రహాలు వేర్వేరు మందిరాల్లో ఉండటం చూస్తుంటాం. కానీ ఈ ఆలయంలో మాత్రం శివలింగం కాకుండా స్వామి అర్ధనారీశ్వర రూపంలో కనిపిస్తాడు. అరుణాచలం తరువాత గిరి ప్రదక్షిణ చేసే ఆలయంగా గుర్తింపు పొందిన ఈ క్షేత్రంలో విష్ణుమూర్తిని కూడా దర్శించుకోవచ్చు. తమిళనాడులోని నామక్కల్‌కు దగ్గరగా తిరుచెంగోడ్‌లో ఉంది ఈ ఆలయం.

చోళుల కాలం నాటి నిర్మాణశైలితో, ఎత్తైన శిఖరంపైన కనిపిస్తుంది అర్ధనారీశ్వర ఆలయం. నాగగిరిగా పిలిచే కొండపైన ఉండే ఈ ఆలయానికి రెండువేల సంవత్సరాల చరిత్ర ఉంది. స్వామి ఇక్కడ అర్ధనారీశ్వరుడిగా కొలువుదీరడం వల్లే ఈ ఆలయానికి ఆ పేరు వస్తే ఇక్కడ చేసే అలంకరణలూ అలాగే ఉంటాయి. చేతిలో దండాయుధంతో కనిపించే అర్ధనారీశ్వర విగ్రహానికి ధోవతినీ చీరనూ అలంకరిస్తారు. అదేవిధంగా రుద్రాక్షమాలతోపాటు మంగళసూత్రాలూ వేస్తారు. స్వామి తలపైన జటాజూటమూ, ఎడమకాలికి పట్టీ కూడా ఉంటాయి.

స్థల పురాణం
శివపురాణం ప్రకారం… ఓసారి విష్ణుమూర్తి, బ్రహ్మ, ఇంద్రుడు, భృంగి అనే మహర్షీ కలిసి శివుడిని దర్శించుకునేందుకు కైలాసానికి వెళ్లారట. విష్ణుమూర్తి, బ్రహ్మ, ఇంద్రుడు మొదట పార్వతీదేవికి నమస్కరించి ఆ తరువాత శివుడి దగ్గరకు వెళ్తే… భృంగి మాత్రం నేరుగా పరమేశ్వరుడిని పూజించాడట. అది చూసి పార్వతీదేవి ఆగ్రహించి… భృంగి నేరుగా స్వామిని పూజించకుండా అడ్డుకుందట. అయినా కూడా భృంగి కీటకం రూపంలోకి మారిపోయి స్వామిని పూజించడంతో పార్వతీదేవి సహించలేక భృంగిని సంహరించేందుకు సిద్ధమయ్యిందట. దాంతో పరమేశ్వరుడు తామిద్దరమూ ఒకటేనని చెబుతూ అమ్మవారిని శాంతింపచేశాడట.

ఆ తరువాత పార్వతీదేవి విష్ణుమూర్తి సలహాతో ఈ ప్రాంతానికి వచ్చి కేదారగౌరి వ్రతాన్ని చేసి శివుడిలో సగభాగం అయ్యిందనీ.. అలా స్వామి ఇక్కడ అర్ధనారీశ్వరుడి రూపంలో కొలువుదీరాడనీ ప్రతీతి. అలాగే ఈ ఆలయం ఉన్న శిఖరాన్ని నాగగిరిగా పిలవడం వెనకా ఆసక్తికరమైన కథ ఉంది. ఓసారి ఆదిశేషుడూ, వాయుదేవుడూ తామిద్దరిలో ఎవరు గొప్ప అనేది తెలుసుకునేందుకు చిన్న పోటీ పెట్టుకున్నారట. అందులో భాగంగా ఆదిశేషుడు మేరుపర్వతాన్ని అధిరోహించి చుట్టుకోవాలనీ, ఆ ప్రయత్నాన్ని వాయుదేవుడు ఆపాలన్నదీ ఆ పోటీ. ఆదిశేషుడు విజయం సాధించడంతో వాయుదేవుడు ఆగ్రహించి గాలిని స్తంభింపచేశాడట. చివరకు దేవతలు కల్పించుకుని వాయుదేవుడిని శాంతింపచేయడంతో గాలిని ఒక్కసారిగా ఉధృతంగా వదిలాడనీ… దాంతో మేరుపర్వతం మూడు ముక్కలుగా మారి భూమిపైన పడిందనీ.. అందులో ఈ నాగగిరి ఒకటనీ అంటారు. అలా దీనిపైన స్వామి అర్ధనారీశ్వరుడి రూపంలో స్వయంభువుగా కొలువుదీరాడనీ చెబుతారు.


గిరిప్రదక్షిణకు ప్రాధాన్యం
నాగగిరి శిఖరంపైన ఉన్న ఆలయాన్ని చేరుకునేందుకు దాదాపు 1200 మెట్లు ఉంటాయి. అలాగే ఏడు కిలోమీటర్ల విస్తీర్ణం ఉండే ఈ గిరి చుట్టూ ప్రదక్షిణ చేస్తే కోర్కెలు నెరవేరతాయనీ ఓ నమ్మకం. అందుకే అరుణాచలం తరువాత పౌర్ణమి తిథుల్లో ఈ శిఖరం చుట్టూ భక్తులు ప్రదక్షిణ చేసేందుకు ఆసక్తి చూపిస్తారు. ఇక, కొండపైన గర్భగుడిలో అర్ధనారీశ్వరుడి రూపాన్ని దర్శించుకున్నాక ఆదికేశవ పెరుమాళ్‌గా పిలిచే విష్ణుమూర్తినీ శ్రీదేవి-భూదేవిలనూ పూజిస్తారు భక్తులు. ఇక్కడ శివరాత్రి, కార్తికమాసంలో చేసే విశేష పూజలు ఒకెత్తయితే… వైశాఖమాసంలో నిర్వహించే రథోత్సవం మరొకెత్తు. నాలుగు రథాల్లో వేర్వేరుగా అర్ధనారీశ్వరుడితోపాటు వినాయకుడు, మురుగన్‌, విష్ణుమూర్తి విగ్రహాలనూ ఊరేగించే వేడుక కన్నులపండుగ్గా సాగుతుంది.

ఎలా చేరుకోవచ్చు
ఈ ఆలయం తమిళనాడులోని నామక్కల్‌ నుంచి తిరుచెంగోడ్‌కు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. విమానంలో రావాలనుకునేవారు తిరుచిరాపల్లి లేదా కోయంబత్తూరు విమానాశ్రయంలో దిగితే అక్కడినుంచి ఆలయానికి చేరుకోవచ్చు. అదే రైల్లో లేదా బస్సుల్లో రావాలనుకునేవారు నామక్కల్‌ రైల్వేస్టేషన్‌ లేదా బస్‌ స్టేషన్‌లో దిగొచ్చు.

Share This Article
Leave a comment