పూరీ జగన్నాథ్ రథయాత్రలో ఈ మిస్టరీ మీకు తెలుసా?

Telugu BOX Office

మన భారతదేశంలో పురాణకాలం నుండీ ప్రసిద్ధి చెందిన పట్టణాలలో పూరీ ఒకటి. ఈ పట్టణం ఒడిశా రాష్ట్ర రాజధాని అయిన భువనేశ్వర్ కి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ పట్టణాన్ని పూర్వం పురుషోత్తమ క్షేత్రమని , శ్రీ క్షేత్రం అని కూడా పిలిచేవారు. ఈ పట్టణంలో విష్ణువు జగన్నాధుని పేరిట కొలువై పూజలందుకుంటున్నాడు. ఈ ఆలయం వైష్ణవ దివ్యదేశాల్లో ప్రముఖమైనది మరియూ హిందువులు అతి పవిత్రంగా భావించే ఛార్ ధామ్ పుణ్యక్షేత్రాలలో ఒకటి. పూరీ ఆలయాన్ని 1078 లో కళింగ పరిపాలకుడైన అనంతవర్మ చోడగంగాదేవ ప్రారంభించగా ఆయన మనవడైన రాజా అనంగ భీమదేవ్‌ పాలనలో పూర్తయింది. అంతకు ముందు అక్కడున్న ఆలయాన్ని ఇంద్రద్యుమ్న మహారాజు కట్టించాడని అంటారు. దీని వెనకో కథ ఉంది.

జగన్నాథుడిని పూజించిన విశ్వావసుడు
ఈ జగన్నాథుడు గిరిజనుల దేవుడనీ , నీలమాధవుడనే పేరుతో పూజలందుకున్నాడనీ స్థలపురాణం. అడవిలోని ఓ రహస్య ప్రదేశంలో ఉన్న ఈ జగన్నాథుణ్ని గిరిజనుల రాజైన విశ్వావసుడు పూజించేవాడట. విషయం తెలుసుకున్న ఇంద్రద్యుమ్న మహారాజు ఆ రహస్యాన్ని కనిపెట్టడానికి విద్యాపతి అనే బ్రాహ్మణ యువకుణ్ని అడవికి పంపుతాడు. విశ్వావసుడి కూతురైన లలితను విద్యాపతి ప్రేమించి పెళ్ళాడతాడు. ఈ జగన్నాధ విగ్రహాన్ని చూపించమని పదేపదే ప్రాధేయపడుతున్న అల్లుడి విన్నపాన్ని కాదనలేని ఆ సవరరాజు , అతని కళ్లకు గంతలు కట్టి గుడి దగ్గరికి తీసుకువెళతాడు. విద్యాపతి ఆ దారి తెలుసుకునేందుకు తెలివిగా తాను వెళ్ళే ఆ దారి పొడుగునా ఆవాలు జారవిడుస్తాడు. కొన్నాళ్లకు అవి మొలకెత్తి దారి స్పష్టంగా తెలుస్తుంది. దీంతో వెంటనే అతను ఇంద్రద్యుమ్న మహారాజుకు కబురు పెడతాడు.

కలలో కనిపించిన జగన్నాథుడు
రాజు అడవికి చేరుకునే లోగా అక్కడ ఆ విగ్రహాలు మాయమవుతాయి. దీంతో ఇంద్రద్యుమ్నుడు నిరాశతో నిరాహారదీక్ష మొదలుపెట్టి అశ్వమేథయాగం చేస్తాడు. నీలాచలం మీద ఓ ఆలయాన్ని నిర్మించి నరసింహస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాడు. ఒకనాడు ఆయన అక్కడే నిద్రిస్తుండగా, జగన్నాథుడు కలలో కనిపించి సముద్రతీరంలో చాంకీనది ముఖద్వారానికి వేప కొయ్యలు కొట్టుకొస్తాయనీ వాటితో విగ్రహాలు చేయించమనీ ఆదేశిస్తాడు. కొయ్యలైతే కొట్టుకొచ్చాయి కానీ, విగ్రహ నిర్మాణానికి ఎవరూ ముందుకు రాలేదు. ఏం చేయాలా అని రాజు ఆలోచిస్తున్న సమయంలో దేవశిల్పి విశ్వకర్మ వికలాంగుడి రూపంలో వస్తాడు. తానొక్కడినే రహస్యంగా ఓ గదిలో విగ్రహాలకు రూపకల్పన చేస్తాననీ, ఆ సమయంలో పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోననీ, ఆ 21 రోజులూ అటువైపు ఎవరూ రాకూడదనీ, తన పనికి ఆటంకం కలగకూడదనీ షరతు విధిస్తాడు. రాజు అంగీకరిస్తాడు. రోజులు గడుస్తున్నా గదిలోంచి ఎలాంటి శబ్దమూ రాదు. దీంతో రాణి గుండిచాదేవి తొందర పెట్టడంతో గడువు పూర్తికాకుండానే రాజు తలుపులు తెరిపిస్తాడు.

దీంతో చేతులూ కాళ్లూ లేని, సగం చెక్కిన విగ్రహాలు మాత్రం దర్శనమిస్తాయి. పశ్చాత్తాపంతో రాజు బ్రహ్మదేవుడిని ప్రార్థిస్తాడు. చతుర్ముఖుడు ప్రత్యక్షమై ఇకమీదట అదేరూపంలో విగ్రహాలు పూజలందుకుంటాయని ఆనతిస్తాడు. తానే స్వయంగా వాటికి ప్రాణప్రతిష్ఠ చేస్తాడు. అందుకే పూరీ ఆలయంలోని విగ్రహాలకు అభయహస్తం, వరదహస్తం కనిపించవు. చతుర్దశ భువనాలనూ వీక్షించడానికా అన్నట్టు ఇంతింత కళ్లు మాత్రం ఉంటాయి. దేశంలో ఎక్కడ లేనివిధంగా పూజలందుకుంటున్న ఇక్కడి ఈ దారు దేవత మూర్తులను 8-12 లేదా 19 సంవత్సరాలకి ఒకసారి మార్చి నూతన దేవతా మూర్తులను ప్రతిష్టించుతూ ఉంటారు. దీనిని నవ కళేబర ఉత్సవంగా నిర్వహిస్తారు. ఈ ఆలయ ఆధ్వర్యంలో జరిగే ఉత్సవాలన్నింటికల్లా ముఖ్యమైనది జగన్నాథ రథయాత్ర. ‘జగన్నాధ రథ యాత్ర’ గా పిలవబడే ఈ రధయాత్రలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు.

12 రోజుల పాటు జరిగే ఉత్సవం
సాధారణంగా ఏ హిందూ ఆలయంలోనైనా సరే, ఊరేగింపు నిమిత్తం మూలవిరాట్టును కదిలించరు. అందుకు ఉత్సవ విగ్రహాలుంటాయి. అలాగే ఊరేగింపు సేవలో ఏటా ఒకే రథాన్ని వినియోగించడం అన్ని చోట్లా చూసేదే. ఈ సంప్రదాయాలన్నింటికీ మినహాయింపు ఒడిశాలోని ఈ పూరీ జగన్నాథ స్వామి ఆలయం. బలభద్ర, సుభద్రలతో సహా ఈ ఆలయంలో కొలువైన జగన్నాథుడిని ఏడాదికొకసారి గుడిలోంచి బయటికి తీసుకువచ్చి భక్తులకు కనువిందు చేస్తారు. ఊరేగించేందుకు ఏటా కొత్తరథాలను నిర్మిస్తారు. అందుకే ఈ జగన్నాథ రథయాత్రను అత్యంత అపురూపంగా భావిస్తారు భక్తులు. ఈ ఉత్సవం ప్రతి సంవత్సరం ఆషాడ శుధ్ధ విధియ రోజున ప్రారంభమై 3 కిలోమీటర్ల దూరంలోని గుండిచా ఆలయం వరకు సాగుతుంది. ఆ తరువాత సుభద్ర, బలబద్ర సమేత జగన్నాథుని ఉత్సవ మూర్తులు బహుదా యాత్ర పేరిట తిరిగి పూరీ ఆలయానికి చేరటంతో ముగుస్తుంది. ఇది 12 రోజులు పాటు జరిగే ఉత్సవం. ఈ యాత్రకి రెండు నెలల ముందు నుంచే దీనికి సంబంధించిన ఏర్పాట్లు మొదలవుతాయి.

వారం రోజులపాటు గుండీచాదేవి ఆతిథ్యం స్వీకరించి అనంతరం దశమినాడు తిరుగు ప్రయాణం మొదలవుతుంది. దీన్ని ‘బహుదాయాత్ర’ అని అంటారు. ఆ రోజు మధ్యాహ్నానికి మూడు రథాలూ జగన్నాథ ఆలయానికి చేరుకుని గుడిబయటే ఉండిపోతాయి. స్వామివారిని దర్శించుకునేందుకు బారులు తీరే భక్తులు మర్నాడు ఏకాదశినాడు స్వామివార్లను బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు. సునావేషగా వ్యవహారించే ఈ వేడుకను చూసేందుకు బారులు తీరుతారు భక్తులు. ద్వాదశినాడు విగ్రహాలను మళ్లీ గర్భగుడిలోని రత్నసింహాసనంపై అలంకరించడంతో యాత్ర పూర్తయినట్లే. యాత్రపేరిట పదిరోజులుగా స్వామి లేని ఆలయం నూతన జవజీవాలు పుంజుకుని కొత్తకళ సంతరించుకుంటుంది. ఇలాంటి ఎన్నో విశిష్టతలూ , భిన్న సంస్కృతులూ , సాంప్రదాయాలు కలగలిసిన ఈ పూరీ జగన్నాధుని ఆలయాన్ని ఏటా ఎన్నో లక్షల మంది సందర్శిస్తారు.

రథాల తయారీ ప్రత్యేకం

ప్రతి ఏడాది రథాల తయారీకి అవసరమైన చెట్లను ఎంపిక చేసి వాటిని సరిగ్గా 1072 ముక్కలుగా ఖండించి పూరీకి తరలిస్తారు. ప్రధాన అర్చకుడితో సహా మొత్తం తొమ్మిది మంది శిల్పులు , వారికి సహాయకులు కలిపి 125 మంది ఈ రథాల తయారీలో పాల్గొంటారు. 1072 వృక్ష భాగాలను రథం తయారుచేయడానికి అనువుగా 2188 ముక్కులుగా ఖండిస్తారు. అటుపై వీటిలో 832 భాగాలతో జగన్నాథుడి రథం తయారు చేస్తారు. జగన్నాథుడి రథాన్ని నందిఘోష అంటారు. ఈ రథం ఎత్తు ఎప్పుడూ కూడా 45 అడుగులు ఉంటుంది. మొత్తం 16 చక్రాలు ఉంటాయి. ఎర్రటి చారలు ఉన్న పసుపు రంగం వస్త్రంతో ఈ రథాన్ని అలంకరిస్తారు. 763 భాగాలతో బలరాముడి రథం తయారు చేస్తారు. బలభద్రుడి రథాన్ని తాళధ్వజం అంటారు. ఈ రథం ఎత్తు 44 అడుగులు. మొత్తం 14 రథ చక్రాలు ఉంటాయి. దీనికి ఎర్రటి చారలు ఉన్న నీలి రంగు వస్ర్తంతో దీనిని అలంకరిస్తారు.

Share This Article
Leave a comment