అసలు కల్కి ఎవరు.. కల్కి పురాణంలో ఉన్న రహస్యమేంటి?

Telugu BOX Office

ఇప్పుడు ప్రపంచమంతా వినిపిస్తోన్న పేరు కల్కి. మహాభారతంలోని పాత్రలను నేటి కలియుగానికి లింక్ చేస్తూ ‘కల్కి 2898 AD’ అనే ఓ సరికొత్త ప్రపంచాన్ని దర్శకుడు నాగ్ అశ్విన్ సృష్టించారు. గురువారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలోనే అసలు ‘కల్కి’ ఎవరని తెలుసుకునేందుకు అందరూ ఆసక్తి కనబరుస్తున్నారు. మరి మన పురాణాల ప్రకారం ‘కల్కి’ ఎవరు.. ఆయన కథేంటో మనమూ తెలుసుకుందామా…

 


పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్‌
ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే!

‘‘అర్జునా! మంచి వారిని రక్షిస్తాను, చెడ్డవారిని శిక్షిస్తాను. ధర్మసంస్థాపన కోసం ప్రతియుగంలో జన్మిస్తాను’’ అంటూ మహాభారతంలో కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడితో శ్రీకృష్ణుడు చెప్పిన మాట. ఒక్క మాటలో చెప్పాలంటే అధర్మం చెలరేగినప్పుడు..నీతి, నిజాయతీ నశించినప్పుడు..ఆ అధర్మాన్ని అంతం చేసి తిరిగి ధర్మ సంస్థాపన చేసేందుకు నేను పుడతాను అంటూ శ్రీకృష్ణుడు చెప్పాడు. మన పురాణాలు, ఇతిహాసాల ప్రకారం ఈ ప్రపంచం ప్రమాదంలో పడిన ప్రతిసారి ఒక అవతారం వచ్చి కాపాడుతూ ఉంటుంది.వాటిలో పది అవతారాలను దశావతరాలుగా మనం పూజిస్తూనే ఉన్నాం. అలా మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన , పరుశురామ, శ్రీరామ, బలరామ, కృష్ణ అవతారాలు. ఇప్పటికే ముగిశాయి.ఇక రావాల్సిన చివరి అవతారం కల్కి.

ఈ కల్కి అవతారం మిగిలిన 9 అవతారాలకీ చాలా భిన్నమైందని పురాణాలు చెబుతున్నాయి. ఎందుకంటే ఈ అవతారం కలియుగం చివరిలో లేదా ధర్మం అదుపు తప్పినప్పుడో వస్తుంది.ఆ సమయంలో కల్కి వచ్చి తిరిగి ధర్మ సంస్థాపన చేస్తాడని అంటుంటారు. ముఖ్యంగా భాగవతంలో, కల్కి పురాణం అనే గ్రంథంలో కల్కి గురించి వర్ణన ఉంది. అధర్మమే అడుగడుగునా కనిపించే కలియుగంలో పాపాలు శ్రుతిమించినప్పుడు కల్కి అవతరిస్తాడని ఇందులో చెప్పారు. మన పురాణాల ప్రకారం నాలుగు యుగాలు కలిపితే ఒక మహాయుగం. కృత, త్రేత, ద్వాపర, కలియుగాలు కలిపి ఒక మహాయుగం అన్నమాట.వీటిలో మూడు యుగాలు ఇప్పటికే ముగిశాయి. ప్రస్తుతం నడుస్తున్నది కలియుగం.


ఈ కలియుగంలోనే కల్కి హిమాలయాల్లో ఉన్న దేవతల రహస్య నగరమైన శంభలలో జన్మిస్తాడని కల్కి పురాణం చెబుతుంది. అయితే దేవతలు నివసిస్తారని చెప్పే ఈ శంభల నగరాన్ని ఇప్పటివరకూ చూసినవాళ్లు లేరు. కానీ ఈ నగరాన్ని కనుగొనేందుకు ఎంతోమంది అన్వేషించారు. ఇక్కడి అంతులేని శక్తులను కైవసం చేసకోవాలని కలలుకన్నారు. అయితే మౌంట్ కైలాశ్ నుంచి శంభలకి మార్గం ఉందని అప్పట్లో రష్యా పరిశోధకుడు నికోలా రోరిచ్ ఒక పుస్తకం కూడా రాశారు. ఆయన శంభలకి రూట్ మ్యాప్ కూడా తన చిత్రాల్లో గీశారు. కానీ ఆ నగరం ఇప్పటికీ ఎవరి కంటా పడలేదు.

అలాంటి మాయా నగరంలో విష్ణు యశుడు.. సుమతి అనే దంపతులుకి కల్కి జన్మిస్తాడని కల్కి పురాణంలో ఉంది. ఇక కల్కికి నలుగురు సోదరులు ఉంటారట. వారందరితో కలిసి ధర్మ సంస్థాపన చేసి మళ్లీ కృతయుగాన్ని ప్రారంభిస్తాడని చెబుతారు. ఇక ప్రతి అవతారంలోనూ విష్ణువుకి భార్య అయిన లక్ష్మీ దేవి కూడా ఒక రూపంలో వస్తుంటారు. అలానే కల్కి పురాణం ప్రకారం సింహళ దేశం అంటే ఇప్పటి శ్రీలంకలో బృహద్రధ వంశానికి చెందిన ఓ కుటంబంలో పద్మ అనే పేరుతో లక్ష్మీ దేవి అవతరిస్తుందని అంటారు. కల్కి పుట్టిన తర్వాత ఆయన్ను కంటికి రెప్పలా కాపాడేందుకు సాక్షాత్తు ఆ ఆదిశక్తే రక్షకురాలిగా ఉంటుందని పురాణంలో రాసి ఉంది.

ఏడుగురు గొప్ప భక్తులు, మహర్షులు చిరంజీవులుగా ఉంటారని విష్ణువే ఆయా యుగాల్లో వరం ఇచ్చారు. వారిలో పరుశురాముడు, కృపాచార్య, అశ్వత్థామ, వ్యాస వీరంతా కల్కిని చూసేందుకు శంభలకి వస్తారని కల్కి పురాణం చెబుతుంది. వీరు నలుగురు కల్కి ధర్మ సంస్థాపనలో సహాయం చేస్తారట. వారే పుట్టిన ఆ పిల్లాడికి కల్కి అని పేరు పెట్టి వెళ్తారని కూడా అంటారు. ఇక దేవదత్తము అనే తెల్లటి గుర్రంపై వీర ఖడ్గం ధరించి కల్కి ధర్మసంస్థాపన చేసి తిరిగి కృతయుగాన్ని ప్రారంభిస్తాడని కల్కి పురాణం చెబుతుంది.

Share This Article
Leave a comment