ఏ ఆలయానికి వెళ్లినా దేవతామూర్తుల రూపం సర్వాలంకారభూషితంగా కనిపిస్తుంది. కానీ ఈ ఆలయంలో కొలువైన దేవికి అలంకరణ నామమాత్రంగానే ఉంటుంది. అంతేనా… దేవి శిరస్సు పాదాల వద్ద కనిపిస్తుంది. పసుపు నీళ్లతో చేసే అభిషేకాన్ని అమితంగా ఇష్టపడే శక్తిస్వరూపిణిగా పూజలు అందుకుంటున్న ఆ అమ్మవారే ఎరుకుమాంబ. సకల శుభాలనూ కలిగించే ఎరుకుమాంబను పూజిస్తే… కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. గౌరీ స్వరూపంగా కొలువుదీరి భక్తుల పూజల్ని అందుకునే ఎరుకుమాంబ ఆలయం విశాఖపట్నంలోని దొండపర్తిలో ఉంది.
నమ్మి కొలిచే భక్తుల కోర్కెలను నేరవేరుస్తూ ఏడాది మొత్తం పూజలందుకునే ఈ దేవి విగ్రహం కాస్త భిన్నంగా ఉంటుంది. ఇక్కడ అమ్మవారి శిరస్సు పాదాల వద్ద ఉంటే… శిరస్సు ఉండాల్సిన చోట ఓంకారం కనిపిస్తుంది. బుధవారం నాడు విశేష పూజల్ని అందుకునే ఈ దేవిని ఉత్తరాంధ్ర ప్రజలు ఎంతో భక్తిశ్రద్ధలతో కొలుస్తారు.
ప్రస్తుతం రైల్వేస్టేషన్ ఉన్న ప్రాంతంలోని వైర్లెస్ కాలనీలో అమ్మవారు ఒకప్పుడు స్వయంభువుగా వెలసి పూజలు అందుకునేదట. అయితే రైల్వేస్టేషన్ నిర్మాణ సమయంలో స్థానికులు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాల్సి రావడంతో వాళ్లంతా మరోచోటికి వెళ్లిపోయారట. కొన్ని రోజులకు అమ్మవారు ఆ ఊరివాళ్లకు కలలో కనిపించి… తానూ భక్తులు ఉన్న ప్రాంతంలోనే ఉంటాననీ తన విగ్రహాన్ని ఎడ్లబండిపైన తీసుకెళ్లమనీ, అది ఆగినచోట ఆలయాన్ని నిర్మించమనీ ఆదేశించిందట. దాంతో భక్తులు అమ్మవారు చెప్పినట్లుగానే ఆ విగ్రహాన్ని ఎడ్లబండిపైన తీసుకొస్తున్నప్పుడు విగ్రహం నుంచి శిరస్సు వేరు పడిందట.
భక్తులు ఆ శిరస్సును అతికించేందుకు ఎంత ప్రయత్నించినా విఫలం కావడంతో ఏం చేయాలో తెలియక కంగారుపడిపోయారట. అప్పుడు దేవి మళ్లీ కలలో కనిపించి… తన కాళ్ల వద్దే శిరస్సును ఉంచి పసుపునీళ్లతో అభిషేకం చేస్తే సంతోషిస్తానని చెప్పడంతో ఎడ్లబండి ఆగిన చోటే ఆలయాన్ని నిర్మించి దేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించి శిరస్సును అలాగే ఉంచేశారని కథనం. అప్పటినుంచీ ఆలయానికి వచ్చే భక్తులు పసుపునీళ్లను దేవికి అర్పించడాన్ని ఓ సంప్రదాయంగా పాటించడం మొదలుపెట్టారు.
సాధారణంగా అమ్మవారి ఆలయాల్లో మంగళవారం, శుక్రవారం విశేష పూజల్ని నిర్వహిస్తే… ఇక్కడ మాత్రం బుధవారం నాడు అమ్మవారికి పసుపు నీళ్లతో అభిషేకం చేస్తారు. అందుకోసం భక్తులు వివిధ ప్రాంతాల నుంచి ఆలయానికి చేరుకుంటారు. ముఖ్యంగా వివాహం కానివారూ, సంతానం లేనివారూ విద్యాప్రాప్తి కోరేవారూ, వ్యాపారాల్లో ఒడుదొడుకులు ఉన్నవారూ… బుధవారం నాడు అమ్మవారిని భక్తిశ్రద్ధలతో కొలిచి, పసుపునీళ్లతో అభిషేకిస్తారు. ఆ మర్నాడు మళ్లీ వచ్చి పసుపు కుంకుమలతో పూజలు చేస్తారు. అలా మూడు బుధవారాలు చేస్తే… కోరిన కోర్కెలు నెరవేరతాయని ఓ నమ్మకం. కోర్కెలు నెరవేరిన భక్తులు ఆ తరువాత 108 బిందెలతో అభిషేకాన్ని నిర్వహిస్తారు.
ఎరుకుమాంబను గౌరీ స్వరూపంగా కొలిచే ఈ ఆలయంలో ఏటా శివరాత్రికి ప్రత్యేక జాతరను నిర్వహిస్తారు. అదే విధంగా బీష్మ ఏకాదశి, శ్రావణ పౌర్ణమి, నవరాత్రుల సమయంలో అంగరంగవైభవంగా పూజా కార్యక్రమాలనూ జరిపిస్తారు. అలాగే కొన్నాళ్ల క్రితం ఆలయాన్ని పునర్నిర్మించడంతో ఏటా వార్షికోత్సవాన్ని నిర్వహించి… సుమారు 200 కిలోల అన్నం వండి అమ్మవారికి నివేదించి.. తరువాత భక్తులకు అన్నదానం చేస్తారు. ఇక్కడున్న ప్రత్యేకత ఏంటంటే… భక్తులే నేరుగా గర్భగుడిలోకి వెళ్లి అమ్మవారిని పసుపునీళ్లతో అభిషేకించి… ఆ మర్నాడు వచ్చి పూజల్ని చేయొచ్చు. అలాగే ఈ ఆలయం రైల్వేస్టేషన్‌కీ, బస్స్టేషన్కీ దగ్గరగా… రోడ్డుమీదే ఉండటంతో దారినపోయే భక్తులకూ అమ్మవారి విగ్రహం స్పష్టంగా కనిపిస్తుంది.
ఎలా చేరుకోవచ్చంటే..
ఈ ఆలయం విశాఖపట్నంలోని దొండపర్తిలో ఆర్టీసీ బస్టాండ్, రైల్వేస్టేషన్‌కు దగ్గరగా ఉంటుంది. విశాఖపట్నం వరకూ రైలు, బస్సుల్లో చేరుకుంటే అక్కడినుంచి ఆలయానికి వెళ్లేందుకు ఆటోలూ, బస్సులూ అందుబాటులో ఉంటాయి.