ద్వాదశ జ్యోతిర్లింగాలు… జీవితంలో ఒక్కసారైనా దర్శించాల్సిందే.

Telugu BOX Office

మహాశివుడిని విగ్రహ రూపంలో దేవాలయాలలో పూజించటం బహు అరుదు. మనకు ఆ భోళాశంకరుడు లింగరూపంలోనే దర్శనమిస్తాడు. అటువంటి లింగాలలో ద్వాదశ జ్యోతిర్లింగాలు అత్యంత ప్రసిద్ధమైనవి. అవి ఎక్కడున్నాయి.. వాటి ప్రాశస్త్యం ఏంటి అన్నది ఈ కథనంలో తెలుసుకుందాం…

సౌరాష్ట్రే సోమనాథం చ, శ్రీశైలే మల్లికార్జునమ్
ఉజ్జయిన్యాం మహాకాళమ్, ఓంకారమమరేశ్వరమ్

ప్రజ్వాల్యాం వైద్యనాథంచ, డాకిన్యాం భీమశంకరమ్
సేతుబంధే తు రామేశం, నాగేశం దారుకావనే

వారాణస్యాం తు విశ్వేశం, త్ర్యంబకం గౌతమీ తటే
హిమాలయే తు కేదారం, ఘృష్ణేశం చ శివాలయే

ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పఠేన్నరః
సప్త జన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి.

సోమనాధేశ్వరుడు
దేశంలోని మొత్తం 12 జ్యోతిర్లింగాల‌లో ఇది మొద‌టిది. గుజరాత్‌ రాష్ట్రంలోని సౌరాష్ట్ర జిల్లాలో సోమనాథేశ్వర క్షేత్రం ఉంది. ఈ క్షేత్రాన్ని దర్శించిన శ్రీకృష్ణ పరమాత్ముడు తన లీలతో వెలిగించిన దీపం నేటికీ ప్రజ్వరిల్లుతుండటం ఇక్కడి ప్రత్యేకత. ఇక్కడ ఉన్న చంద్రకుండంలో స్నానం చేసి సోమ నాథేశ్వరుడిని దర్శిస్తే సర్వ పాపాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. చంద్రుడే స్వయంగా ఈ సోమనాథేశ్వరుడిని ప్రతిష్ఠించినట్లు పురాణ గాథలు చెబుతున్నాయి. చ‌రిత్రను బ‌ట్టి చూస్తే ఎన్నో సార్లు ఈ ఆల‌యం కూల్చబ‌డి, మ‌ళ్లీ పున‌ర్మించ‌బ‌డిన‌ట్లు తెలుస్తోంది.

శ్రీశైలం మ‌ల్లికార్జునుడు
అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన భ్రమరాంబికాదేవి, ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకరైన శ్రీశైల మల్లికార్జునుడు మనకు శ్రీశైలంలో దర్శనమిస్తారు. దక్షిణ భారతదేశాన, ఆంద్రప్రదేశ్‌లో నంద్యాల జిల్లా కృష్ణానదీ తీరాన నల్లమల కొండల్లో ‘శ్రీశైలం’ క్షేత్రం ఉంది. ద్రవిడ శైలిలో నిర్మించిన ఈ దేవాలయం చాలా విశాలమైంది. కోటగోడల్లాంటి అతి పెద్ద గోడలపై కుడ్యచిత్రాలు తీరి వుంటాయి. స్థంభాలతో సహా వాస్తుశిల్పంలో సంపన్నత, దర్పం తొణికిసలాడుతుంటాయి. విజయనగర రాజులనాటి వాస్తుకళకు ఇది నిదర్శనం. మహా శివరాత్రికి, ఉగాదికి, చైత్రమాసంలో జరిగే చండీయాగము, కుంభోత్సవము ప్రధానమైనవి. సంక్రాంతికి పార్వతీదేవి కల్యాణోత్సవం, శివరాత్రినాడు శ్రీభ్రమరాంబా కళ్యాణోత్సవం జరుగుతాయి. ఈ రకంగా ఒకే సంవత్సరం రెండు కళ్యాణోత్సవాలు జరిగే విశేషం దేశం మొత్తం మీద శైవ క్షేత్రాల్లో ఇక్కడే.

మహాకాళేశ్వరుడు
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇండోర్‌కి 80 కిలోమీటర్ దూరంలో ఉజ్జయిని నగరంలో క్షిప్రా నదీతీరాన ” శ్రీ మహాకాళేశ్వర స్వామి ” జ్యోతిర్లింగ రూపంలో దర్శనమిస్తాడు. ఈ ఆలయం మూడు అంతస్తులుండి, ఏడు గోపురాలుండి, ఎంతో అద్భుతంగా ఉంటుంది. మొదటి అంతస్తులో మహాకాళేశ్వరుడు, రెండవ అంతస్తులో ఓం కారేశ్వరుడు, మూడో అంతస్తులో నాగచంద్రేశ్వరుడు కొలువై వుంటారు. ఈ మూడవ అంతస్తు మాత్రం నాగపంచమి నాడు మాత్రమే తెరిచి పూజాది కాలు చేస్తూవుంటారు. మిగిలిన రోజుల్లో ఈ అంతస్తు మూసివుంటుంది. ఇక ఈ ఆలయంలో 3 అడుగుల వ్యాసంతో 21/2 అడుగుల ఎత్తున్న జ్యోతిర్లింగేశ్వరుడు పశ్చిమ దిక్కుగా ప్రతిష్టితుడయ్యాడు. ఇక్కడ చితాభస్మంతో చేసే అభిషేకం చాలా ప్రాశస్య్తమైనది. పూర్వం ఒక సాధువు స్మశానం నుంచి చితాభస్మాన్ని తెచ్చి అభిషేకించి వెళ్ళిపోయేవాడట. ఆయనని ఎవరూ దర్శించలేకపోయారు. ఇప్పుడు మాత్రం ఇక్కడ అగ్నిహోమం లోనుంచి వచ్చిన భస్మంతో స్వామిని అభిషేకిస్తున్నారు. ఇక్కడ తాంత్రిక విద్యలకి ఎక్కువ ప్రాధాన్యత ఉంది. అఘోరకులు, కాపాలికులు, తాంత్రికోపాసన చేస్తూ ఇక్కడ గుహలలో నేటికీ కనిపిస్తూంటారు. వీరిని చూడడానికి కొంత భయం కలుగుతుంది.

ఓంకారేశ్వరుడు

మధ్యప్రదేశ్‌ రాష్ట్రం ఖాండ్వా జిల్లాలో ఈ పుణ్యక్షేత్రం ఉంది. వింద్య పర్వత సానువుల్లో నర్మదానది తీరంలో ఓంకారేశ్వరుడు వెలిశాడు. సంస్కృత ఓం ఆకారంలో వెలసిన ఈ క్షేత్రంలోని ఓంకారేశ్వర లింగం అమరేశ్వర లింగం పక్కపక్కనే ఉండడం విశేషం. ఇక్కడ ఉన్న రెండు కొండ‌ల మ‌ధ్య న‌ర్మదా న‌ది, ఈ దివ్య క్షేత్రాల‌ను ఆకాశం నుంచి చూస్తే ‘’ఓం ‘’ఆకారం గా కని పిస్తుందిట. అందుకే దీనికి ఓంకారేశ్వర క్షేత్రం అని పేరు.

వైద్యనాధేశ్వరుడు

జార్ఖండ్‌ రాష్ట్రంలో సంతాల్ ప‌ర‌గ‌ణ ప్రాంతంలో ఢియోగ‌ర్ జిల్లాలో శ్రీవైద్యనాథేశ్వరాలయం ఉంది. పాట్నా నుంచి 220 కిలోమీటర్ల దూరంలో ఉంది. మహారాష్ట్రలో కట్నీపూర్‌ దగ్గర పెద్ద శివాలయాన్ని కూడా శ్రీవైద్యనాథ జ్యోతిర్లింగంగా పూజిస్తున్నారు. ఈ రెండింటి నేపథ్యమూ రామాయాణాంతర్గత రావణాసురిడి కథతో ముడిపడి ఉంది. ఈ లింగాన్ని పూజిస్తే వారికి వ్యాధులు నయం అవుతుండడం వల్ల శ్రీవైద్యనాథేశ్వరుడిగా పిలుస్తారని ప్రతీతి.


భీమశంకరుడు

మహారాష్ట్రలో సహ్యాద్రి కొండ‌ల్లో పూణేకు 110 కిలోమీటర్ల దూరంలో కృష్ణానది ఉపనది భీమనది ఉద్భవ ప్రాంతంలో భీమశంకర జ్యోతిర్లింగంగా వెలసింది. కుంభకర్ణుని కుమారుడు రాక్షస భీముని నాశనం చేసే ఈశ్వరుడి రూపంలో ఈ లింగం ఉంటుంది. భీమ‌శ్వర ఆలయాన్ని 13వ శ‌తాబ్దంలో నాగ‌రా ప‌ద్ధతిలో పీష్వాల దీవాన్ అయిన నానా ఫ‌డ్నవీస్ నిర్మించిన‌ట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. ముంబై, పుణె, ఔరంగాబాద్, అహ్మద్ న‌గ‌ర్ ప్రాంతాల నుంచి వివిధ ర‌కాల ర‌వాణా సౌక‌ర్యాలు ఈ స్థలానికి ఉన్నాయి. ముంబై, పుణె నుంచి బస్సు సౌక‌ర్యం ఉంది.

రామేశ్వరుడు

తమిళనాడు రాష్ట్రంలో శ్రీ రామేశ్వరాలయం ఉంది. ఇక్కడి నిర్మాణ శైలికి చాలా పేరు ప్రఖ్యాత‌లు ఉన్నాయి. రావ‌ణునిపై గెలిచిన త‌ర్వాత రాముడి గెలుపుకు గుర్తుగా ఈ క‌ట్టడం నిర్మాణానికి సంబంధం ఉంద‌ని స్థానికులు చెబుతుంటారు. రామేశ్వరంలోని బావుల్లో నీటితో స్నానం చేస్తే స‌మ‌స్త బాధ‌లు తొల‌గుతాయ‌ని భ‌క్తుల విశ్వాసం. ఇక్కడ మొత్తం 64 తీర్థాలు(నీటి ఆవాసాలు) ఉన్నాయి.

రామేశ్వరం శివుని ద్వాదశ జ్యోతిర్లింగాలలో ప్రముఖమైనది. ఈ క్షేత్ర మహిమను స్కందపురాణం, రామాయణం, రామచరితమానస్, శివపురాణం మొదలగు గ్రంథాలు ప్రస్తావించారు. లంకపైకి యుద్ధానికి వెళ్లేముందు శ్రీరాముడు ఇక్కడే శివపూజ చేసి ఆశీర్వాదం పొందాడు. రావణ సంహారం తర్వాత శ్రీరాముడు తిరిగి వచ్చేటప్పుడు సీతతో కలిసి ఇక్కడ పూజలు నిర్వహించాడు. హనుమంతుడు కైలాసంనుండి తెచ్చిన శివలింగం ఇక్కడే ప్రతిష్టితమైంది. లంకకు వెళ్లే వారధిని విభీషణునికి కోరిక మేరకు శ్రీరాముడు తన ధనస్సుతో ఛిన్నాభిన్నం చేసాడు. నాలుగు మూలల వున్న నాలుగు దామాలలో మొదటిది రామేశ్వరం. మిగతావి ద్వారక, పూరీ జగన్నాధ్, బద్రీనాధ్.

నాగేశ్వరుడు

అరణ్యవాసంలో భాగంగా దారుకా వనంలో ఉన్నప్పుడు పాండవులే స్వయంగా ఈ ఆలయం నిర్మించినట్లు పురాణ గాథ. దీనికి సంబంధించి కొద్దిగా వివాదం ఉంది. రెండు,మూడు చోట్ల ఉన్న ఆల‌యాన్ని నాగ‌నాథ జ్యోతిర్లింగంగా పిలుస్తూ ఉన్నారు. అయితే ఎక్కువ‌గా ప్రాచుర్యంలో ఉన్న నాగ‌నాథేశ్వర దేవాల‌యం మాత్రం గోమ‌తి ద్వార‌క‌, బైత్ ద్వార‌క ద్వీపం మ‌ధ్య గుజ‌రాత్ రాష్ట్రంలోని సౌరాష్ట్రలో ఉన్నదాన్నే చెబుతారు.

కాశీ విశ్వనాథేశ్వరుడు

శ్రీ విశ్వనాథేశ్వరుడి జ్యోతిర్లింగం కాశీక్షేత్రంలో ఉంది. గంగానది తీరంలో బౌద్ధ, జైన మతాలవారు, హైందవులు అనేకమంది తీర్థయాత్రికులు కాశీ విశ్వేశ్వరుని దర్శించుకుంటారు. అవిముక్త జ్యోతిర్లింగంగా నిలిచే విశ్వేశ్వరాలయం బంగారు శిఖరాలను కలిగి ఉంది. విశ్వనాథ దేవాలయం సన్నిధిలో విశాలాక్ష్మి శక్తిపీఠం ఉంది. కాశీలో ఎన్నో ఆలయాలు, గంగానదీ తీరంలో మరెన్నో స్నానఘట్టాలు ఉన్నాయి. ఈ క్షేత్రంలో స్నాన, దాన, హోమం చేసిన వారికి ఈశ్వర వరప్రసాదంతో మరుజన్మ ఉండదని ప్రతీతి.

త్రయంబకేశ్వరుడు

మహారాష్ట్రలోని నాసిక్‌కు 30 కిలోమీటర్ల దూరంలో శ్రీ త్రయంబుకేశ్వరాలయం ఉంది. బ్రహ్మవిష్ణువుల ప్రార్థనలతో స్వయంభువుగా వెలసి బ్రాహ్మతో త్రయంబకేశ్వరుడిగా కీర్తనలందుకొన్న త్రయంబకేశ్వర క్షేత్రం గురించి రెండు కథనాలు ప్రచారంలో ఉన్నాయి.

కేదారేశ్వరుడు

ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కేదారేశ్వలయం ఉంది. ఏప్రిల్‌ నుంచి నవంబరు నెల వరకే ఈ ఆలయం తెరుస్తారు. విష్ణుమూర్తి నరనారాయణులుగా కొన్ని వేల సంవత్సరాలు శివుని ధ్యానించి తపస్సు చేసి లోక కల్యాణానికి ఈ లింగాన్ని ప్రతిష్ఠించినట్లు పురాణ కథ. బొందితో స్వర్గానికి వెళ్లేందుకు పాండవులు ఈ ఆలయాన్ని సర్వాంగ సుందరంగా నిర్మించారని ప్రతీతి. అంతరాలయంలో నేటికీ పాండవులు, ద్రౌపది విగ్రహాలు ఉన్నాయి. ఆదిశంకరాచార్యుల సమాధి, శివపార్వతుల తపోభూమి, ఆదిదంపతుల కళ్యాణసమయంలో హోమగుండం, నేటికీ దర్శించవచ్చు. హరిద్వార్‌ నుంచి గౌరీకుండ్‌ వరకు బస్సు మార్గం ఉంది.


ఘృష్ణేశ్వరుడు

మహారాష్ట్ర ఔరంగబాద్‌ పట్టణానికి 30 కిలోమీటర్ల దూరంలో శ్రీవిఘ్నేశ్వరాలయం ఉంది. అజంతా ఎల్లోరా గ్రామంలో ఘృష్ణేశ్వర ఆలయం ఉంది. అజంతా ఎల్లోరా గుహలు, ప్రపంచ ప్రసిద్ధి పొందిన దర్శనీయ పర్యాటక స్థలాలు, దేవగిరి కొండపై ఘృష్ణేశ్వరుని ఆలయం వెలిసింది.

Share This Article
Leave a comment