హిందువులు ఎక్కువుగా ఇష్టపడే దైవం శ్రీరామచంద్రుడు. దేశంలోని ప్రతి పల్లెలో కూడా రామాలయం ఉంటుంది. ఇక పట్టణాల్లో అయితే నాలుగైదు గుళ్లు ఉంటాయి. అందరికి ఆరాధ్యదైవం శ్రీరామచంద్రుడు… దశాబ్దాలనాటి వివాదానికి తెరదించి అయోధ్య రామజన్మ భూమి రాముడిదే అంటూ తేలిన సందర్బంగా అక్కడ మందిరం నిర్మించి.. ఈనెల 22న శ్రీరామ చంద్రుడి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నారు. అసలు అయోధ్య పట్టణం ఎక్కడ ఉంది.. దాని చరిత్ర ఏంటి…అయోధ్య నగరానికి ఆ పేరు ఎలా వచ్చింది అనే విషయాలు అయోధ్య చరిత్ర గురించి ఈ కథనంలో తెలుసుకుందాం..
అయోధ్య భారతదేశంలోని అతి పురాతన నగరాలలో ఒకటి. అయోధ్య నగరం చారిత్రాత్మకమైన పవిత్రాలయం ఉన్న పుణ్యక్షేత్రం. ప్రతి హిందువు తప్పక చూడాలని కోరుకునే పుణ్యక్షేత్రాలలో అయోధ్య ఒకటి. శ్రీరాముడు ఈ అయోధ్య నగరంలోనే జన్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి. విష్ణుమూర్తి… శ్రీరాముడిగా అవతరించిన ప్రదేశమే ఈ అయోధ్య పురి. అయోధ్యను సాకేతపురం అని కూడా పిలుస్తారు. రామాయణ మహాకావ్య ఆవిష్కరణకు మూలమే అయోధ్య నగరం. అయోధ్య నగరం ఉత్తరప్రదేశ్ లోని ఒక ముఖ్యపట్టణం. ఇది ఉత్తరప్రదేశ్లోని ఫైజాబాదుని ఆనుకుని… సముద్రమట్టానికి 305 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఒకప్పటి కాలంలో అయోధ్య నగరం కోసల రాజ్యానికి రాజధానిగా ఉంటూ వచ్చింది. అయోధ్య నగరానికి శ్రీరాముని చరిత్రలో చాలా ప్రాముఖ్యత ఉంది.
స్కంద పురాణంతో పాటు ఇతర పురాణాలు భారతదేశంలోని ఏడు మోక్ష పుణ్యక్షేత్రాల్లో అయోధ్య ఒకటిగా చెబుతున్నాయి. వేదాలు.. పురాణాలు అయోధ్య నగరాన్ని దేవతలు నిర్మించారని… అది స్వర్గంతో సమానమని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు.
అయోధ్యను మొదట ఎవరు పాలించారు..
అయోధ్యను మొదటిసారిగా సూర్యవంశ రాజైన వైవసత్వ మనువు కుమారుడు ఇక్ష్వాకుడు నిర్మించి పాలించాడని పురాణ కథనాలు వివరిస్తున్నాయి. ఈ వంశం వాడైన పృధువు వలన భూమికి పృధ్వి అనే పేరు వచ్చిందని పురాణాలు చెపుతున్నాయి. అనంతరం రాజు మాంధాత. .. సూర్యవంశంలోని 31వ రాజు హరిశ్చంద్రుడు ఈ రాజ్యాన్ని పాలించారు. హరిశ్చంద్రుడు సత్యవాక్పరి పాలనకు ప్రసిద్ధి చెందిన వాడు. ఆయన వంశం రాజుల గొప్పతనానికి తన సత్యవాక్పరిపాలనతో ఘనతను తీసుకు వచ్చాడు. ఆయన వంశస్థుడైన సగరుడు అశ్వమేధయాగం చేసి… ఆ యాగంతో విఘ్నం వైదొలగించి ఆయన ముని మనుమడైన భగీరధుడు గంగానదిని విశేషప్రయత్నం చేసి భూమికి తీసుకువచ్చాడు. అనంతరం వచ్చిన రఘుమహారాజు రాజ్యావిస్తరణ చేసి పేరుగడించి సూర్యంశంలో మరో వంశకర్త అయ్యాడు. రఘుమహారాజు తరువాత సూర్యవంశం రఘువంశంగా కూడా పిలువబడింది. రఘుమహారాజు మనుమడు దశరథుడు. .. దశరథుడి కుమారుడు రామచంద్రుడు.
ఆయోధ్య చరిత్ర
అతి పురాతన హిందూ నగరాలలో అయోధ్య ఒకటి. ఈ నగరం గంగానదీ తీరంలో… సరయూ నదికి కుడివైపున ఉంది. రామాయణంలో అయోధ్య నగరవైశాల్యం 250 చదరపు కిలోమీటర్లుగా వర్ణించబడింది. అయోధ్యను రాజధానిగా చేసుకుని సూర్యవంశరాజైన ఇక్ష్వాకుడు కోసల రాజ్యాన్ని పాలించాడు. 63వ సూర్యవంశరాజైన దశరథుడి రాజ్యసభగా అయోధ్య ఉంది. వాల్మికి రచించిన రామాయణ మాహాకావ్యం మొదటి అధ్యాయాల్లో అయోధ్య మహోన్నతంగా వర్ణించబడింది. అంతేకాక కోసల సామ్రాజ్య వైభవం, రాజ్యంలోని ప్రజలు అనుసరిస్తున్న ధర్మం, సంపద, ప్రజల విశ్వసనీయత గురించి గొప్పగా వర్ణించబడింది.
జైన్ మతస్థులకు కూడా ప్రాముఖ్యమైన నగరం అయోధ్య. 2000 సంవత్సరాలకు ముందే ప్రముఖ తీర్థంకరులిద్దరికి అయోధ్య జన్మస్థలం అయింది. అంతేకాదు మరో ఐదుగురు తీర్థంకరులకు కూడా జన్మస్థలంగా ఈ నగరం ఉంది. అలాగే అయోధ్య బౌద్ధమత వారసత్వం కూడా కలిగిన నగరం. అందువల్ల ఇక్కడ మౌర్య చక్రవర్తుల కాలంలో నిర్మించబడిన పలు బౌద్ధాలయాలు, స్మారకచిహ్నాలు, శిక్షణాకేంద్రాలు ఉన్నాయి. గుప్తులకాలంలో అయోధ్య వాణిజ్యంలో శిఖరాగ్రానికి చేరుకుంది. క్రీ.పూ 600 లలో కూడా అయోధ్య వాణిజ్యకేంద్రంగా విలసిల్లింది. చరిత్రకారులు దీనిని సాకేతపురంగా పేర్కొన్నారు. క్రీ.పూ 5వ శతాబ్దం నుండి క్రీ.శ 5వ శతాబ్దం వరకు బౌద్ధమతకేంద్రంగా అయోధ్య విలసిల్లినది. బుద్ధుడు ఈనగరానికి చాలాసార్లు వచ్చినట్లు భావిస్తున్నారు.
అయోధ్య పేరు ఎందుకొచ్చింది..
మహారాజైన ఆయుధ్ పురాణాల్లో శ్రీరాముడి పూర్వీకుడుగా పేర్కొనబడింది. అతడి పేరు సంకృత పదమైన యుద్ధ్ నుండి వచ్చింది. ఆయుధ్ అపరాజితుడు కనుక ఈ నగరానికి అయోధ్య అన్న పేరు వచ్చింది. అయోధ్య అంటే జయించశక్యం కానిది అని అర్ధం. గౌతమ బుద్ధుని కాలంలో ఈ నగరం పాలిలో అయోజిహా అని పిలువబడింది అది కూడా సంస్కృతంలో అయోధ్య అని అర్ధాన్ని ఇస్తుంది. పురాణాలు గంగానది గురించి వివరించినప్పుడు అయోధ్య ప్రస్తావన ఉంది.