దీపావళి పండుగ అనగానే అందరికీ టక్కున గుర్తొచ్చేది పిండివంటలు, టపాసులు, స్వీట్లు. దేశవ్యాప్తంగా ఈ పండుగను ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. వయసుతో సంబంధం లేకుండా కొత్త బట్టలు కట్టుకొని సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటారు. జీవితంలో చీకట్లను పారద్రోలుతూ వెలుగులు నింపుతుందని.. విజయానికి గుర్తుగా జరుపుకుంటారు. ప్రతి ఇంట్లో లక్ష్మీ పూజ నిర్వహిస్తున్నారు. దాదాపు పండుగలన్నీ హిందూ సాంప్రదాయం ప్రకారం ఉదయాన్నే జరుపుకుంటారు. కానీ ఒక్క దీపావళి పండగ మాత్రం సాయంత్రం లక్ష్మీ పూజ చేసి.. దీపాలు వెలిగిస్తారు. సాధారణంగా అందరూ దీపావళి పండుగను ఇంట్లోనే జరుపుకుంటారు. కానీ తెలంగాణలోని ఓ జిల్లాలో మాత్రం ఈ పండుగ శ్మశానంలో జరుపుకుంటారు.
తెలంగాణలో కరీంనగర్ జిల్లాలోని కార్కానగడ్డ అనే ఊరిలో దీపావళి శ్మశాన వాటికలో సెలబ్రేట్ చేసుకుంటారు. చిన్నా, పెద్ద అంతా నూతన వస్త్రాలు ధరించి దీపాలు, బాణా సంచాలు పట్టుకుని శ్మశానానికి వెళ్తారు. అక్కడున్న వారి తల్లిదండ్రులు, తాత, ముత్తాతల సమాధుల్ని పూలతో అలంకరించి, పిండివంటలు పెట్టి, దీపాలు వెలిగించి అక్కడే టపాసులు కాలుస్తారు. అయితే ఈ పండుగ కోసం వారం రోజుల ముందుగానే సమాధులకు రంగులు కూడా వేస్తారు. అలాగే ఈ ఊరి వాళ్ళు ప్రపంచంలో ఏ మూలన ఉన్నా పండుగకు అక్కడికి చేరుకుంటారు.
ఈ ఆచారం 60 ఏళ్ల నుంచి కొనసాగుతోంది. పుణ్యలోకాల్లో ఉన్న తమ పూర్వీకులు ఆనందంగా ఉండాలని ఇలా చేస్తుంటారని గ్రామస్తులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అది తెలిసిన జనాలు షాక్ అవుతున్నారు. టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా ఇప్పటికీ ఇలాంటి మూఢనమ్మకాలు నమ్మే జనాలు ఉన్నారా అని కొందరు ఆశ్చర్యపోతున్నారు.