హనుమంతుడి ఆలయం లేని ఊరు ఉండదంటారు. ఆ ఆలయాల్లోనూ స్వామి దక్షిణముఖంగా ఉండటం… ధ్యానముద్రలో కనిపించడం… గదాధారియై దర్శనమివ్వడం… చూస్తుంటాం. కానీ ఇక్కడ మాత్రం విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా శయన భంగిమలో కనిపిస్తూ భక్తుల్ని అనుగ్రహిస్తున్నాడు. జామ్‌సావలీ హనుమాన్ మందిర్‌గా ప్రసిద్ధిగాంచిన ఈ ఆలయంలో స్వయంభువుగా ప్రకటితమైన స్వామి నాభి నుంచి నీరు ఉద్భవిస్తుందనీ.. ఆ నీటికి ఔషధగుణాలుంటాయనీ ప్రతీతి.
రామభక్తుడైన ఆంజనేయుడిని ధ్యానించినా, పూజించినా శారీరక, మానసిక అనారోగ్యాలు తగ్గుతాయనీ.. భూతప్రేత పిశాచాలు దరిచేరవనీ చెబుతుంది హనుమాన్ చాలీసా. అందులో పేర్కొన్నట్లుగానే తనని దర్శించుకునే భక్తుల సకల రుగ్మతలనూ నయం చేసేందుకు హనుమంతుడు స్వయంభువుగా కొలువుదీరిన ఆలయమే ఈ చమత్కారిక్ జామ్‌సావలీ హనుమాన్ మందిర్. మధ్యప్రదేశ్‌లోని ఛింద్వాఢ జిల్లా, సౌసర్ తాలూకాలోని జామ్‌సావలీ అనే ఊళ్లో ఉండే ఈ ఆలయంలో వాయునందనుడు రావి చెట్టు నీడలో విశ్రాంతి తీసుకుంటున్న రూపంలో దర్శనమిస్తున్నాడు. ఈ ఆలయం ఎప్పటినుంచి ఉందనేదీ, ఎవరు నిర్మించారనేదీ స్పష్టంగా తెలియకపోయినా ఇక్కడున్న నిధుల్ని కాపాడేందుకే స్వామి ఇలా కొలువుదీరాడనీ… సంజీవని తెచ్చే క్రమంలో ఈ ప్రాంతంలోనూ విశ్రాంతి తీసుకున్నాడనీ కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి.
స్థల పురాణం…
రామ రావణ యుద్ధం సమయంలో లక్ష్మణుడు మూర్ఛపోయినప్పుడు… హనుమంతుడు సంజీవని కోసం హిమాలయాలకు పయనమయ్యాడట. సంజీవని పర్వతాన్ని తెస్తూ మార్గమధ్యంలో ఇక్కడున్న రావిచెట్టు నీడలో కాసేపు విశ్రాంతి తీసుకున్నాడనీ… ఆ తరువాత ఈ ప్రాంతంలోనే స్వయంభువుగా కొలువుదీరాడనీ ప్రతీతి. మరో కథ ప్రకారం… స్వామి ఒకప్పుడు ఇక్కడ నిల్చునే దర్శనమిచ్చేవాడట. అలా నిల్చున్న స్వామి పాదాల కింద నిధులు ఉన్నాయని స్థానికులు చెప్పుకునేవారట. ఓసారి కొందరు దొంగలు ఆ నిధుల్ని దొంగిలించేందుకు వచ్చి విగ్రహాన్ని పక్కకు జరిపేందుకు సిద్ధమయ్యారట. ఎన్నిరకాలుగా ప్రయత్నించినా అంగుళం కూడా కదల్చలేకపోయారట. కాసేపటికి అప్పటిదాకా నిల్చున్న స్వామి ఒక్కసారిగా శయనభంగిమలోకి మారిపోవడంతో భయపడి పోయిన దొంగలు అక్కడినుంచి పారిపోయారట. అప్పటినుంచి హనుమంతుడు ఆ నిధుల్ని కాపాడేందుకు అలా విశ్రాంత భంగిమలోనే ఉండిపోయాడని అంటారు.
స్వామి నాభి నుంచి నీరు…
ఈ ఆలయానికి వచ్చే భక్తులకు హనుమంతుడు పదిహేను అడుగుల్లో ఉండి… విశ్రాంతి తీసుకుంటున్న భంగిమలో కనిపిస్తాడు. తెల్లవారుజామున నాలుగుగంటలకే తెరిచే ఈ మందిరంలో మొదట స్వామికి రకరకాల అభిషేకాలూ, పూజలూ నిర్వహించి… సుమారు అయిదున్నర గంటల నుంచి భక్తులను అనుమతిస్తారు. అప్పటి నుంచీ రాత్రి పది గంటల వరకూ నిర్విరామంగా స్వామిని చూడొచ్చన్నమాట. ఇక, మందిరానికి వచ్చే స్త్రీ, పురుషులిద్దరికీ వేర్వేరు మార్గాలు ఉంటాయి. స్వామి ఇక్కడ బ్రహ్మచారి రూపంలో ఉండటం వల్లే… పురుషులతో పోలిస్తే స్త్రీలు కాస్త దూరం నుంచి హనుమంతుడిని దర్శించుకోవాలనే నియమం పెట్టారని చెబుతారు ఆలయ నిర్వాహకులు. నిద్రావస్థలో విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా కనిపించే స్వామి నాభి నుంచి ఉద్భవించే నీటికి అనారోగ్యాల్ని నయం చేసే శక్తి ఉందని చెబుతారు. అందుకే భక్తులు ఆ నీటిని స్వీకరించేందుకు ప్రాధాన్యమిస్తారు. శారీరక, మానసిక సమస్యలున్నవారు ఇక్కడే కొన్నిరోజులు ఉండి రోజూ హనుమంతుడిని దర్శించుకుని పూర్తిగా నయమయ్యాకే ఇంటికెళ్లేందుకు సిద్ధమవుతారనీ అంటారు. ఇక, అంజనీ సుతుడికి రోజువారీ నిర్వహించే అభిషేకాలు ఒకెత్తయితే… హనుమాన్ జయంతిని పురస్కరించుకుని జరిపే ప్రత్యేక పూజా కార్యక్రమాలు మరొకెత్తు. ఆ పూజల్లో పాల్గొనేందుకు వేల సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుంటారు. ప్రతి పౌర్ణమికీ ప్రత్యేకంగా నిర్వహించే పూజాదికాలను చూసేందుకు రెండు కళ్లూ చాలవు.
ఎలా చేరుకోవచ్చు
ఈ ఆలయానికి వెళ్లాలనుకునేవారికి వివిధ ప్రాంతాల నుంచి జామ్‌సావలీ వరకూ రైళ్లు అందుబాటులో ఉంటాయి. అక్కడి నుంచి ప్రైవేటు వాహనాల్లో బస్సుల్లో ఆలయానికి చేరుకోవచ్చు. బస్సుల్లో అయితే నాగ్‌పూర్ మీదుగా జామ్‌సావలీకి వెళ్ళొచ్చు.