దేవతలకోసం అతిసుందర నగరాలూ, కళ్లు మిరుమిట్లుగొలిపే భవనాలెన్నింటినో దేవశిల్పి విశ్వకర్మ సృష్టించాడట! శ్రీకృష్ణుడి అంశగా భావించే ‘స్వామి నారాయణ్’కోసం భూమ్మీద అటువంటి అత్యద్భుత ఆలయాన్ని నిర్మించింది ‘బీఏపీఎస్’ సంస్థ. అమెరికాలోని రాబిన్స్‌విల్లేలో ప్రారంభోత్సవానికి సిద్ధమైన ఈ గుడి… ప్రపంచంలోని అతిపెద్ద హిందూ ఆలయాల్లో రెండోది… అక్షరధామ్లలో మొదటిది!
ఆధ్యాత్మికతను పంచుతూ… ఆహ్లాదానికి నెలవైన ఆ ఆలయాలెన్నో మన చుట్టూ ఉన్నాయి. దేని అద్భుత కళ దానిదే… అలాంటి వాటిల్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది మాత్రం స్వామినారాయణ్ ‘అక్షరధామ్’ గురించి. శ్రీకృష్ణుడి అంశగా ఆరాధించే స్వామి నారాయణ్ కొలువు దీరిన ఆలయమే ‘అక్షరధామ్’. ఆకట్టుకునే నిర్మాణశైలి… అబ్బురపరిచే కళావైభవంతో అలరారే ఆ దేవాలయాలు దేశవిదేశాల్లో దర్శనమిస్తాయి. అలాంటి వందలాది దేవాలయాల్లో- అమెరికాలోని న్యూజెర్సీ రాబిన్స్‌విల్లే టౌన్షిప్లో 182 ఎకరాల్లో నిర్మితమైన స్వామినారాయణ్ అక్షరధామ్ మాత్రం ఎంతో ప్రత్యేకమైంది.
అమెరికాలోని అతి పెద్ద హిందూ దేవాలయాల్లో మొదటిదీ, ప్రపంచంలోనే రెండోది అయిన ఆ ఆలయాన్ని- రాజస్థానీ సంప్రదాయాలకు అనుగుణంగా చూపుతిప్పుకోనివ్వని అందమైన శిల్పాలతోనూ, భారీ గోపురాలతోనూ, అట్టహాసమైన మండపాలతోనూ కళ్లు చెదిరిపోయేలా తీర్చిదిద్దారు. గుజరాత్‌కు చెందిన బోచాసన్వాసి అక్షర్ పురుషోత్తమ్ స్వామినారాయణ్ సంస్థ ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న ఈ ఆలయ నిర్మాణంలో ఇసుమంతైనా ఉక్కూ ఇనుమూ వాడకుండానే వేలాది సంవత్సరాలపాటు చెక్కు చెదరని విధంగా నిర్మించడం విశేషం.
బీఏపీఎస్ మనదేశంతోపాటు, కెనడా, యూకే, కెన్యా, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో దాదాపు 1400 వందల ఆలయాలను నిర్మించింది. ఈ సంస్థకు గురువుగా ఉన్న ప్రముఖ్ స్వామి మహరాజ్- రాబిన్స్‌విల్లేలో అతిపెద్ద గుడిని నిర్మించాలని పాతికేళ్ల క్రితమే సంకల్పించారు. 2011లో అది కార్యరూపం దాల్చడంతో ఈ అక్షరధామ్ నిర్మాణానికి పునాదిరాయి పడింది. అక్షరధామ్ ఆలయాలంటేనే పురాతన శిల్పకళకు పెట్టింది పేరు. ఆలయం లోపలా, బయటా ఉన్న రాతి స్తంభాలూ, గోడలపైన చెక్కిన- చిత్రాలూ, స్ఫూర్తిదాయక కథలూ భక్తులకు స్వామి నారాయణ్ జీవిత చరిత్రనూ సందేశాలనూ వర్ణిస్తుంటాయి. పదివేలకుపైగా శిల్పాలూ, విగ్రహాలూ, భారతీయ సంగీత, నృత్యరూపాలతో సహా పురాతన సంస్కృతి ఆ ఆలయంలో అడుగడుగునా ప్రతిబింబిస్తుంది. రాతిని అంత రమణీయంగా చెక్కి చూపుతిప్పుకోనివ్వకుండా తీర్చిదిద్దిన ఈ నిర్మాణంలో సున్నపురాయి, పింక్ శాండ్ స్టోన్, పాలరాయి, గ్రానైట్లను వినియోగించారు. ఈ రాళ్లను భారత్, బల్గేరియా, తుర్కియే, గ్రీస్, ఇటలీ, చైనాల నుంచి సేకరించారు.
రాబిన్స్‌విల్లే అక్షరధామ్ని నిర్మించింది అమెరికాలోనే అయినా చాలా వరకూ ఆ పనులు జరిగింది మాత్రం మనదేశంలోనే. రాజస్థానీ చెక్కుళ్లూ, నగిషీలూ అచ్చుగుద్దినట్టు తీసుకురావాలనే ఉద్దేశంలో సేకరించిన రాళ్లను మొదట కంటైనర్ల సాయంతో షిప్పుల్లో ముంబయికీ¨, తరవాత రాజస్థాన్‌కూ తీసుకెళ్లారు. అక్కడ వందల మంది శిల్పులు ఆ రాళ్లను అందమైన శిల్పాలుగానూ, విడిభాగాలుగానూ, పలు కళాకృతులుగానూ చెక్కారు. గుడి నిర్మాణ ప్లాన్ ప్రకారం శిల్పులు చెక్కిన శిల్పాలకూ, పిల్లర్లకూ, ఇతర కళాకృతులకూ నంబర్లు వేసి… ఏది ఎక్కడ పెట్టాలో వివరాలను జత చేసి మళ్లీ కంటైనర్లలో అమెరికాకు తీసుకెళ్లేవారు. ఆ వివరాల ఆధారంగా నిపుణులు వాటిని అమర్చి నిర్మించేవారు. దాదాపు ఆలయనిర్మాణం ఆ విధంగానే పూర్తిచేయడం విశేషం.
అద్భుత పనితీరుతో ఆకట్టుకునేలా చెక్కిన దేవీదేవతల విగ్రహాలూ, గురువుల ప్రతిమలూ, నెమలి తోరణాలూ, ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన డోమ్‌ల వంటివాటితో భూలోక స్వర్గంగా దర్శనమిచ్చే స్వామి నారాయణ్ మందిరం- పన్నెండు ఉపాలయాలు, తొమ్మిది శిఖరాలు, రెండు పెద్ద-ఎనిమిది చిన్న గుమ్మటాలతో కూడిన భారీ ఆలయ సముదాయం. 42 అడుగుల ఎత్తు, 133 అడుగుల పొడవు, 87 అడుగుల వెడల్పు ఉండే మహామందిరాన్ని అయితే పూర్తిగా ఇటాలియన్ కరారా మార్బుల్‌తో కట్టారు. అందుకే అదాటున చూడగానే వెండి వెలుగుల్లో మెరిసిపోతూ ఆలయం అంతటినీ వెండితోనే నిర్మించారనే భ్రమను కలిగిస్తుంది. లైట్ల వెలుతురులో అయితే గాజు నిర్మాణాన్ని తలపించే ఈ ఆలయ నిర్మాణ పనుల్లో శిల్పులూ, ఇతర నిపుణులతోపాటు వలంటీర్లు కూడా పాలుపంచుకోవడం విశేషం.
ఈ ఆలయ నిర్మాణ పనుల్లో దాదాపు 12,500 మంది భక్తులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి తలో చేయి వేశారు. పనులు జరుగుతున్న ప్రదేశాలను శుభ్రం చేయడం- శిల్పులూ, ఇతర కార్మికులకు భోజనాలు వడ్డించడం వంటి పనుల్లో భాగస్వాములయ్యారు. ఇలా వేలాది మంది దాదాపు పన్నెండేళ్లపాటు సుమారు 47లక్షల పనిగంటలు శ్రమించి ఆవిష్కరించిన అందాల అక్షరధామ్ ప్రాంగణంలోనే ఓ జలాశయం ఉంటుంది. మతాచార కార్యక్రమాల నిమిత్తం ఈ జలాశయాన్ని ‘బ్రహ్మకుండ్’ పేరిట నిర్మించారు. ఆలయం మాదిరే దానికీ ఓ ప్రత్యేకత ఉండాలనే ఉద్దేశంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాదాపు మూడొందల నదుల నుంచి నీళ్లను తెప్పించి బ్రహ్మకుండ్ను నింపారు. అందుకోసం వేలాదిమంది స్వామి నారాయణ్ భక్తులు దేశవిదేశాలకు వెళ్లి ఈ నీటిని సేకరించారు. ఆ బ్రహ్మకుండ్ పక్కనే బాలుడి రూపంలో ఆధ్యాత్మికతతో అలరారే స్వామి నారాయణ్ శిల్పం సాక్షాత్కరిస్తుంది.
మహామందిరంలో రాధాకృష్ణులూ, సీతారాములూ, శివపార్వతులూ తదితర దేవీ దేవతలెందరో దర్శనమిస్తారు. అలానే పరమగురువులూ, యోగులూ, స్వామీజీల శిల్పాలు కూడా సజీవ శోభతో కనిపిస్తాయి. ఎంతో వైభవోపేతంగా శిల్ప సౌందర్యంతో అలరారే ఈ మందిరం నిర్మాణానికి బీఏపీఎస్ దాదాపు రూ.150 కోట్లు ఖర్చుపెట్టింది. రాబిన్స్‌విల్లే అక్షరధామ్ అణువణువూ అత్యున్నత భారతీయ శిల్పకళకు, హైందవ ఆధ్యాత్మిక సంపదకు ప్రతిరూపమైనది. ఖండాలకు ఆవల ఎక్కడో సుదూర ప్రాంతంలో మన దేశ సాంస్కృతిక సౌరభాన్ని అది దివ్యంగా వెదజల్లుతోంది.