బడికి వెళ్లబోయే పిల్లలకు ముందుగా సరస్వతీదేవి సమక్షంలో అక్షరాభ్యాసం చేయడం తెలిసిందే. కానీ ఈ ఆవనంకోడ్ సరస్వతీదేవి ఆలయంలో పిల్లలతోపాటూ ఉన్నత విద్యావంతులు, పెద్దపెద్ద అధికారులు సైతం అక్షరాభ్యాసం చేయించుకోవడం విశేషం. పరశురాముడు నిర్మించిన ఈ ఆలయంలోనే జగద్గురువు ఆదిశంకరాచార్యులకూ అక్షరాభ్యాసం జరిగిందని ప్రతీతి.
అద్వైత వేదాంత సృష్టికర్త అయిన జగద్గురువు ఆదిశంకరాచార్యులకు చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతో అక్షరాభ్యాసం జరగలేదట. కొన్నాళ్లకు శంకరాచార్యుల తల్లి ఈ ఆలయానికి తీసుకొచ్చి అమ్మవారి సమక్షంలోనే అక్షరాభ్యాసం చేయించిందని ఐతిహ్యం. అలా వందల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆవనంకోడ్ సరస్వతీ దేవాలయం కేరళలోని కొచ్చి విమానాశ్రయానికి దగ్గరగా ఉంటుంది.
ఇక్కడ అక్షరాభ్యాసాన్ని చేయించుకునే వారికి చదువుతోపాటూ వాక్కునూ అందించే శక్తిస్వరూపిణిగా సరస్వతీదేవి పూజలు అందుకుంటోంది. ఈ ఆలయంలో అమ్మవారితోపాటూ జ్ఞానాన్ని ప్రసాదించే దక్షిణామూర్తినీ ఆటంకాలను తొలగించి విజయాలను అందించే వినాయకుడినీ దర్శించుకోవచ్చు.
స్థల పురాణం
ఒకప్పుడు ఈ ఊరివాళ్లు గడ్డికోసేందుకు వెళ్లినప్పుడు… ఓ రాయికి కొడవలి తగిలి నెత్తురోడిందట. సరిగ్గా అప్పుడే పరశురాముడు అక్కడికి వచ్చి ఆ శిలలో సరస్వతీదేవి ఉందని గ్రహించి ఆ శిలనే ప్రతిష్ఠించి ఆలయాన్ని నిర్మించాడని కథనం. అలా పరశురాముడు నిర్మించిన 108 దుర్గాలయాల్లో ఆవనంకోడ్ సరస్వతీదేవి సన్నిధానం కూడా ఒకటి.
రెండు రకాలుగా అక్షరాభ్యాసం
ఈ ఆలయంలో విద్యారంభం, విద్యావాగీశ్వరీ పేరుతో రెండురకాల అక్షరాభ్యాసాలు చేస్తారు. చదువును మొదలుపెట్టే పిల్లలకు విద్యారంభాన్ని నిర్వహిస్తే… ఉన్నతవిద్యను అభ్యసించాలనుకునేవారు విద్యావాగీశ్వరి పూజను చేయించుకుంటారు. ఒక్క విజయదశమి, గ్రంథపూజగా పిలిచే ప్రత్యేక పర్వదినాల్లో తప్ప ఏడాది మొత్తం ఉదయం పూట అక్షరాభ్యాసాలు చేయించుకోవచ్చు ఇక్కడ. ఆ ప్రక్రియ కూడా కాస్త ప్రత్యేకంగానే ఉంటుంది.
ఆలయంలోని ప్రధానార్చకుడు… అమ్మవారిని పూజించిన బియ్యాన్ని తీసుకొచ్చి అందులో ‘ఓం హరి శ్రీ గణపతయే నమః’ అని పిల్లల చేత రాయిస్తాడు. తరువాత అదే నామాన్ని వాళ్ల నాలుకపైనా రాస్తాడు. ఆ ప్రక్రియ పూర్తయ్యాక బియ్యాన్ని పిల్లలకే ఇచ్చేసి అమ్మవారిని అభిషేకించిన నెయ్యిని ప్రసాదంగా ఇస్తారు. అక్షరాభ్యాసం చేయించాలనుకునేవారు నావ్, మణి, నరయంగా పిలిచే నాలుక, గంట, కలం, ఆకారాలను దేవికి కానుకగా సమర్పించడమూ కనిపిస్తుంది. దానివల్ల పిల్లల్లో వాక్కు, వినికిడి శక్తి పెరిగి విద్య వస్తుందని భక్తుల నమ్మకం.
ఇక, విద్యావాగీశ్వరి పేరుతో నిర్వహించే పూజను చేయించుకునేందుకు పండితులూ, రీసెర్చి స్కాలర్లూ, పెద్దపెద్ద అధికారులూ, ఉన్నత విద్యకోసం పోటీ పరీక్షలు రాసేవారూ ఆసక్తి చూపిస్తారు. ఆ పూజవల్ల జ్ఞాన సముపార్జనతో పాటూ, చదువుల్లో ఏకాగ్రత కుదురుతుందనీ, ఉద్యోగాల్లో పదోన్నతి లభిస్తుందనీ అంటారు. ఆలయానికి వచ్చే భక్తులు ఈ ప్రాంగణంలోని ఇసుకలోనూ అక్షరాలను రాయడాన్ని చూడొచ్చు.
ఆవనంకోడ్ సరస్వతీ దేవి ఆలయం కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయానికి దగ్గరగా నెడుంబస్సెరీలో ఉంటుంది. ఉన్నత విద్య లేదా ఉద్యోగాల నిమిత్తం విదేశాలకు వెళ్లేవారు ముందుగా అమ్మవారి సమక్షంలో పాస్‌పోర్టులను ఉంచి పూజిస్తే ప్రయాణం ఏ ఆటంకం లేకుండా సాగడంతోపాటూ విజయాలూ సొంతమవుతాయనే ఉద్దేశంతోనే… విమానం ఎక్కేముందు ఇక్కడకు వచ్చి అమ్మవారిని దర్శించుకుని పాస్‌పోర్టులకూ పూజలు చేయిస్తారు. అందుకే ఈ సన్నిధానానికి పాస్‌పోర్ట్ ఆలయమనే పేరూ ఉంది.
అదేవిధంగా కళాకారులూ, రచయితలూ సైతం తమ పుస్తకాలనూ, సంగీత వాయిద్యాలనూ అమ్మవారి సమక్షంలో ఉంచి పూజలు చేయిస్తూనే తమకు వచ్చిన విద్యనూ ఇక్కడ ప్రదర్శించేందుకూ ప్రాధాన్యం ఇస్తారు. ఇక, స్వయంభువుగా సాక్షాత్కరించిన అమ్మవారు ఈ ఆలయంలో పడమరవైపు దర్శనమిస్తుంది. అమ్మవారితో పాటూ దక్షిణామూర్తినీ, వినాయకుడినీ దర్శించుకోవచ్చు. సరస్వతీదేవికి రోజువారీ చేసే పూజలతోపాటు ఏడాదికోసారి మార్చి నెలలో పూరమ్ పేరుతో పదిరోజుల పాటు అంగరంగవైభవంగా ఉత్సవాలనూ జరిపిస్తారు.