గతంలో అడవుల్లోనూ, గ్రామాల శివారుల్లో రాబందులు కనిపించేవి. ఇటీవల కాలంలో ఎక్కడా వాటి జాడే లేకుండా పోయింది. అంతరించిపోతోన్న పక్షుల జాబితాలో అవికూడా చేరిపోయాయి. అయితే వీటి సంఖ్యను పెంచడానికి కర్ణాటక ప్రభుత్వం ఓ పరిష్కారాన్ని కనిపెట్టింది. ఆ పక్షుల కోసం బందిపుర అడవిలో కొంతభాగాన్ని రాబందుల ఆహార కేంద్రంగా మార్చింది. దానికి ‘వల్చర్స్ రెస్టారెంట్’ అనే పేరు పెట్టింది.
దక్షిణ భారతదేశంలో ఇలాంటి ‘రెస్టారెంట్’ ఏర్పాటు కావడం ఇదే ప్రథమం. అడవుల్లో చనిపోయిన ఏనుగుల కళేబరాల్ని కూడా ఇక్కడికి తరలించి రాబందులకు ఆహారంగా ఇస్తున్నారు అటవీ అధికారులు. వాళ్లే కాదు- చుట్టుపక్కల పల్లెల్లోని రైతులు కూడా చనిపోయిన తమ పశువుల్ని ఈ రెస్టారెంట్‌కి తీసుకురావడం విశేషం.
పర్యావరణ చక్రంలో రాబందుల పాత్ర చాలా కీలకం. అడవిలో చనిపోయిన జంతువుల కళేబరాలు కుళ్ళి వ్యాధులు ప్రబలకుండా కాపాడటం వాటి పని. కానీ మాంసం కోసం పెంచే పశువులకి వాడే కొన్ని రకాల యాంటీబయోటిక్స్ వల్ల ఆయా జంతువుల మృత కళేబరాలను తిన్న రాబందులు అనారోగ్యం పాలై ఆ జాతి అంతరించిపోయే స్థితికి వచ్చింది. అందుకే వాటి సంఖ్య పెరిగేదాకా ఈ రెస్టారెంట్ సేవల్ని అందిస్తామంటున్నారు అటవీ అధికారులూ. అరుదైన పక్షులకు కాపాడుకునేందుకు వీరు చేస్తున్న ప్రయత్నం బాగుంది కదూ.