చేయని నేరానికి 43 ఏళ్లుగా జైల్లోనే.. అమెరికాలో ప్రవాస భారతీయుడి దీనగాథ

Telugu BOX Office

భారత సంతతికి చెందిన వేదం సుబ్రహ్మణ్యం (Subramanyam Vedam) జీవితం అమెరికాలో న్యాయవ్యవస్థలో జరిగిన ఒక అసాధారణ సంఘటనగా నిలిచింది. కేవలం తొమ్మిది నెలల ప్రాయంలో భారత్‌ నుంచి అమెరికాకు వెళ్లిన సుబ్రహ్మణ్యం, చిన్నతనంలోనే అమెరికా పౌరసత్వం పొందాడు. కానీ 19 ఏళ్ల వయసులోనే తన స్నేహితుడి హత్య కేసులో అరెస్టై, సుమారు నాలుగు దశాబ్దాలు జైలు గోడల మధ్యే గడపాల్సి వచ్చింది. చివరికి నిర్దోషిగా తేలినా, ఇప్పుడు మరో కేసుతో మళ్లీ నిర్బంధంలోకి వెళ్లడం ఆయన జీవితంలో మరో మలుపుగా మారింది.

1961లో భారత్‌లో జన్మించిన వేదం సుబ్రహ్మణ్యం, 1962లో తల్లిదండ్రులతో కలిసి అమెరికాకు వెళ్లాడు. పెన్సిల్వేనియాలో స్థిరపడిన ఈ కుటుంబానికి అక్కడ పౌరసత్వం లభించింది. సుబ్రహ్మణ్యం, థామస్ కిన్సర్ అనే స్నేహితుడు చిన్ననాటి స్నేహితులే. 1980లో కిన్సర్ అనుమానాస్పదంగా అదృశ్యమై, కొంతకాలం తర్వాత శవంగా గుర్తించడంతో పోలీసులు సుబ్రహ్మణ్యాన్ని అనుమానితుడిగా అరెస్ట్ చేశారు. పిస్టల్‌తో కాల్చి చంపాడని ఆరోపించినప్పటికీ, ఆయుధాన్ని మాత్రం కనుగొనలేకపోయారు. సరైన ఆధారాలు లేకున్నా 1983లో కోర్టు ఆయనకు జీవిత ఖైదు విధించింది.

జైలులో ఉన్నంత కాలం సుబ్రహ్మణ్యం తన విద్యను కొనసాగించి, అనేక డిగ్రీలు సాధించాడు. శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు విద్య బోధించి, వారికి ప్రేరణగా నిలిచాడు. అయితే, తాను నిర్దోషినేనని నిరూపించేందుకు నాలుగు దశాబ్దాల పాటు నిరంతరం పోరాటం కొనసాగించాడు. ఈ పోరాటంలో ఆయన కుటుంబం, స్నేహితులు, మానవహక్కుల సంస్థలు అండగా నిలిచాయి.

2022లో ఆయన కేసును ఓ స్వచ్ఛంద సంస్థ మళ్లీ పరిశీలించింది. సరైన సాక్ష్యాలు లేవని తేలడంతో పెన్సిల్వేనియా కోర్టు ఇటీవల ఆయనను నిర్దోషిగా ప్రకటించింది. దీంతో అక్టోబర్‌ 3న జైలు నుంచి విడుదల కావాల్సి వచ్చింది. అయితే విడుదలకు ముందు కొత్త మలుపు తిప్పింది. హత్య కేసుకు ముందు సుబ్రహ్మణ్యంపై మాదకద్రవ్యాల సరఫరా కేసు నమోదై ఉండటంతో, ఆ కేసు ఆధారంగా ఇప్పుడు ఇమ్మిగ్రేషన్‌ అధికారులు ఆయనను మళ్లీ నిర్బంధించారు. హత్య కేసులో జైల్లో ఉండటం వల్ల ఆ సమయంలో ఆయనపై దేశ బహిష్కరణ చర్యలు నిలిచిపోయాయి. ఇప్పుడు నిర్దోషిగా విడుదల కావడంతో ICE అధికారులు ఆయనను భారత్‌కు పంపేందుకు చర్యలు ప్రారంభించారు.

అయితే భారత్‌లో ఆయనకు ఎవరూ లేరని, అక్కడికి పంపడం అమానవీయమని ఆయన సోదరి సరస్వతి వేదం వాదిస్తున్నారు. ఆమె సహా కుటుంబ సభ్యులు మళ్లీ న్యాయపోరాటం మొదలుపెట్టారు. సుబ్రహ్మణ్యం కేసు ఇప్పుడు అమెరికా న్యాయవ్యవస్థలో మరో చర్చనీయాంశంగా మారింది.
Share This Article
Leave a Comment