విజయానికి ప్రతీక విజయ దశమి. చెడుపై మంచి సాధించిన చిహ్నంగా ఈ పండుగను జరుపుకుంటారు. తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాకుండా దేశ వ్యాప్తంగా దసరా పండుగను ప్రజలు పెద్ద ఎత్తున జరుపుకుంటారు. విజయ దశమి తమ జీవితాల్లో కొత్త విజయాలను తీసుకురావాలని కోరుకుంటారు. దసరా అనగానే ఠక్కున గుర్తొచ్చేది జమ్మి చెట్టు. మరీ ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో జమ్మి ఆకులు ఇచ్చిపుచ్చుకునే సంప్రదాయం ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే పాలపిట్ట దర్శనానికి కూడా ఎంతో ప్రాశస్త్యం ఉంటుంది. దసరా రోజు కచ్చితంగా పాలపిట్టను చూడాలని భావిస్తుంటారు. ఇంతకీ పాలపిట్టను చూడాలనే ఆచారం ఎందుకు వచ్చింది.? దీనికి వెనక ఉన్న అసలు కారణమేంటి.? లాంటి విషయాలు మీకోసం..
మన తెలుగు రాష్ట్రాల్లో గ్రామీణ ప్రాంతాలు చాలా ఎక్కువ. పల్లెటూరి వాతావరణంలో దసరా పండుగ పూట పాలపిట్ట తళుక్కున మెరిసి అందరికీ ఆనందాన్ని పంచుతుంది. విజయాలకు ప్రతీకగా చెప్పుకునే విజయదశమి రోజున పాలపిట్టను చూస్తే కచ్చితంగా శుభాలు జరుగుతాయని, ఏ పని ప్రారంభించినా కచ్చితంగా విజయం సాధిస్తారని చాలా మంది నమ్ముతారు. అందుకే విజయదశమి(దసరా) రోజున పాలపిట్టను చూడటాన్ని ప్రజలు ఎంతో అదృష్టంగా, శుభ సూచకంగా భావిస్తారు.
పురాణాల ప్రకారం పాండవులు అరణ్య వాసాన్ని ముగించుకుని తమ రాజ్యానికి తిరిగొస్తుండగా పాలపిట్టను చూశారట. అదే రోజు విజయదశమి ఉండటం వల్ల అప్పటి నుంచి పాండవులకు తిరుగనేదే లేకుండా ప్రతి ఒక్క విషయంలో విజయాలు వరించాయని శాస్త్రాలలో పేర్కొనబడింది. అప్పటినుంచి దసరా పండుగ రోజున మగాళ్లు అడవికి వెళ్లి మరీ పాలపిట్టను చూడటం అలవాటుగా చేసుకున్నారట. అప్పటినుంచి ఈ సంప్రదాయం ప్రతి ఏటా కొనసాగుతూ వస్తోందని పెద్దలు చెబుతారు.
త్రేతా యుగంలో రావణాసురుడితో యుద్ధం చేయడానికి శ్రీరాముడు బయలుదేరి వెళ్లే సమయంలో విజయ దశమి రోజునే పాలపిట్ట ఎదురు వస్తుంది. ఆ తర్వాత జరిగిన యుద్ధంలో రాముడు విజయం సాధించి.. సీతమ్మను రావణ చెరనుంచి తీసుకువస్తాడు. ఆ తర్వాత ఆయోధ్యకు రాజుగా మారుతాడు. పాలపిట్టను విజయానికి సూచికగా భావించడానికి ఇదొక కారణం.
సాధారణంగా జనావాసాలకు దూరంగా చెట్లు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోనే ఈ పాలపిట్టలు కనిపిస్తుంటాయి. అందుకే జమ్మి ఆకుల కోసం వెళ్లిన సమయంలో ఈ పక్షిని చూస్తుంటారు. నీలం, పసుపు రంగులో ఉండే ఈ పక్షి రూపం కూడా ఎంతో బాగుంటుంది. పాలపిట్టను పరమేశ్వరుడి స్వరూపంగా భావిస్తుంటారు. అందుకే దసరా రోజు ఈ పక్షిని చూస్తే ఏడాదంతా విజయలు అందుతాయని విశ్వాసం.
అయితే.. ప్రస్తుతం అడవులతో పాటు ఇప్పుడు పాలపిట్ట జాడ కూడా కనుమరుగవుతోంది. పల్లెటూళ్లలో అక్కడక్కడా ఓ మెరుపు మెరుస్తున్నట్టు కనిపిస్తున్నా నగర శివార్లలో మాత్రం పూర్తిగా కనిపించడం లేదు. మరోవైపు దసరా రోజున పాలపిట్టను తప్పనిసరిగా చూడాలనే ప్రజల విశ్వాసాన్ని కొంత మంది సొమ్ము చేసుకోవడానికి చూస్తున్నారు. పాలపిట్టను పంజరాల్లో బంధించి తీసుకొచ్చి శుభాలు కలుగుతాయంటూ ప్రజలకు చూపిస్తున్నారు.