
ఆంజనేయునికి సింధూరం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే.. సీతమ్మ పాపిట బొట్టు పెట్టుకోవడం చూసిన ఆంజనేయుడు ఓసారి ఎందుకలా పెట్టుకుంటున్నావని సీతాదేవిని అడుగుతాడు. అందుకు సీతమ్మ నవ్వుతూ ఈ పాపిట బొట్టువలన నేను రామప్రేమను పొందానని చెప్పింది. ఈ బొట్టు రాముల వారికి చాలా ఇష్టమని చెప్పారు. దాంతో వెంటనే హనుమంతుడు సిందూరాన్ని తన శరీరమంతా పూసుకున్నాడు. ఆయనకు ఆపాదమస్తకం రోమాలు ఉండడం చేత ఆ సిందూరం వెంటనే రాలిపోయేది. అప్పుడు హనుమంతుడు నూనెతో కలిపిన గంగ సిందూరాన్ని శరీరమంతా రాసుకున్నాడు. ఇలాంటి అమాయకపు పనిచేసిన హనుమంతుని చూసిన రాముల వారు, నిన్ను సింధూర రూపంతో ఎవరైతే సేవిస్తారో వారికి నేను ప్రసన్నుడును అవుతానని వరమిచ్చారట. అటువంటి భక్తులకు సమస్త దోషాలు తొలగి సుఖశాంతులు పొందుతారని వరం ఇచ్చారు. అందుకే హనుమంతుని శరీరమంతా సిందూరం రాసి ఉంటుంది.
