కార్తీక మాసం శివుడికి ఎంత ప్రీతికరమైనదో… మార్గశిరం విష్ణుమూర్తికి అంత పవిత్రమైనదని భక్తుల విశ్వసిస్తుంటారు. ‘మార్గశిరం అంటే నేనే’ అని సాక్షాత్తూ విష్ణుమూర్తి భగవద్గీతలో పేర్కొన్నాడట. అందుకే ఈ మాసంలో వైష్ణవ దివ్యదేశాల్లో ప్రధానమైనదిగానూ ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ఆలయంగానూ పేరొందిన శ్రీరంగనాథుడి దర్శనం పుణ్యప్రదంగా భావిస్తారు భక్తులు. ఆ సందర్భంగా ఈ ఆలయ ప్రాశస్త్యాన్ని వీక్షిస్తే… ఉభయ కావేరీ నదుల మధ్య రూపుదిద్దుకున్న ద్వీపంలో సప్త ప్రాకారాలతో పదిహేను గోపురాలతో విలసిల్లే భూలోక వైకుంఠమే శ్రీరంగం… శ్రీరంగనాథస్వామి ఆలయం. దీన్నే తిరువరంగం అనీ పిలుస్తారు.
తమిళనాడులోని తిరుచిరాపల్లిలో ఉంది శ్రీరంగం. శ్రీమహావిష్ణువు స్వయంభువుగా అవతరించిన ఎనిమిది ప్రసిద్ధ దివ్యక్షేత్రాల్లోనూ, 108 వైష్ణవ దివ్యదేశాల్లోనూ ఇదే ప్రధానమైనది. శ్రీరామ, శ్రీకృష్ణావతారాలకు క్షీరాబ్ధినాథుడు మూలమనీ, అర్చావతారాలకు శ్రీరంగనాథుడే మూలమనీ వైష్ణవుల విశ్వాసం. ఆళ్వారులు కీర్తించిన దివ్యదేశాల్లోనూ ఇదే కీలకమైనది. అందుకే వాళ్ల దివ్య ప్రబంధాలతో పాటు రామానుజుని విశిష్టాద్వైత సిద్ధాంతానికీ పట్టుగొమ్మగా నిలిచిందీ శ్రీరంగం. 9వ శతాబ్దంలో తలక్కాడుని పాలించిన గంగ వంశానికి చెందిన తొండమాన్ రాజా ఈ ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించాడట. ఆ తరవాత 44వ అళంగీయ సింగర్ జీయర్‌స్వామి కలలోకి శ్రీమన్నారాయణుడు వచ్చి ఆలయాన్ని కట్టించమని కోరడంతో ఆయన దీన్ని కొంతవరకూ పూర్తిచేసినట్లూ తెలుస్తోంది. ఆపై వరసగా చోళ, పాండ్య, హొయసల, విజయనగర రాజులకు సంబంధించిన శాసనాలెన్నో ఈ ప్రాంగణంలో కనిపిస్తాయి. ఇలా ఎందరో చక్రవర్తులు దీని నిర్మాణంలో పాలుపంచుకున్నప్పటికీ చోళుల కాలంలోనే దీన్ని కట్టించినట్లు తెలుస్తోంది. ముసల్మానుల, ఆంగ్లేయుల దాడుల్నీ ప్రకృతి విపత్తుల్నీ తట్టుకుని నిలిచిందీ ఆలయ సముదాయం. అల్లావుద్దీన్ ఖిల్జీ ఈ ప్రాంతాన్ని ఆక్రమించిన సమయంలో ప్రధాన ఆలయంలోని విష్ణుమూర్తి విగ్రహాన్ని అక్కడి పూజారులు దాచిపెట్టారనీ తరవాతి కాలంలో విజయనగర సామ్రాజ్యాధిపతి అయిన కుమార కంబుడు ఆ విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించి, ఆలయాన్ని పునరుద్ధరించాడట.
ఎన్నెన్నో ప్రత్యేకతలు..
సుమారు 156 ఎకరాల్లో 4,116 మీటర్ల చుట్టుకొలతతో నిర్మితమైన ఈ ఆలయం, ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయ సముదాయంగా పేరొందింది. 11అంతస్తులతో 237అడుగుల ఎత్తు ఉన్న ఇక్కడి రాజగోపురం ఆసియా ఖండంలోకెల్లా పెద్దది. ఆలయ ప్రాంగణంలో 81 దేవతామూర్తుల గుడుల్నీ విశ్రాంతి గదుల్నీ వాణిజ్య సముదాయాల్నీ కట్టించిన తీరు సందర్శకుల్ని చకితుల్ని చేస్తుంది. అందుకే ఇది టెంపుల్ టౌన్‌గా పేరొందింది. ఇక, గర్భాలయంలోని శేష శయన భంగిమలో ఉన్న మూర్తికి పెరియ పెరుమాళ్ అని పేరు. ఆయనకు ఎదురుగా ఉన్న బంగారు స్తంభాలను తిరుమణైత్తూణ్ అంటారు. నంబెరుమాళ్ల సౌందర్య సముద్రంలో పడి కొట్టుకునిపోకుండా ఉండేందుకే ఈ స్తంభాలని ప్రతీతి. ప్రాంగణంలో 12 నీటికొలనులు ఉంటే వాటిల్లోని సూర్య, చంద్ర పుష్కరిణుల్లో 20 లక్షల లీటర్లకు పైగా నీళ్లు పడతాయట. ఇక్కడ స్వామిని గరుడ వాహన, సింహవాహన, హనుమంత, శేషవాహన రథాల్లో ఉరేగిస్తారు. ఇక్కడున్న గరుడాళ్వార్ విగ్రహం ఎత్తు 25 మీటర్లు. ఆయన అలంకరణకు 30 మీటర్ల పొడవాటి వస్త్రాన్ని వాడతారట. గరుడాళ్వార్‌కి ప్రత్యేకంగా మంటపం కూడా ఉంది. క్షీరసాగరమథనంలో పుట్టిన ధన్వంతరికి ఆలయం ఒక్క శ్రీరంగంలోనే ఉంది. చారిత్రక కాలంనాటి మురుగునీటి నిర్వహణ, వర్షపునీటిని నిల్వచేసుకునే విధానంతో ఈ ఆలయం ఐక్యరాజ్యసమితి అవార్డునీ సొంతం చేసుకుంది.
ప్రధాన ద్వారం దాటి వెళ్లగానే వచ్చే మొదటి ప్రాకారంలో చిలుకల మండపం, యాగశాల, విరాజుబావి; రెండో దాంట్లో పవిత్రోత్సవ మండపం, హయగ్రీవ, సరస్వతీ ఆలయాలు; మూడోదాంట్లో గరుత్మంతుని సన్నిధి, వాలీసుగ్రీవుల సన్నిధి, చంద్ర పుష్కరిణి, నాలుగులో గరుడాళ్వార్, నాదముని, కూరత్తాళ్వార్ సన్నిధుల్ని దర్శించుకోవచ్చు. ఐదోదానికే ఉత్తర వీధి అని పేరు. బ్రహ్మోత్సవాల సమయంలో ఈ వీధిలోనే స్వామివారిని ఊరేగిస్తారు. ఆరో ప్రాకారానికి చిత్రవీధి అని పేరు. ఇక్కడి వీధుల్లో ఆళ్వార్లను ఊరేగిస్తుంటారు. ఏడో ప్రాకారంలో వామనుని సన్నిధీ, దశావతారాలూ కనిపిస్తాయి. రంగనాథస్వామి కొలువై ఉన్న గర్భగుడి పై కప్పు విమానం ఆకృతిలో ఉంటుంది. ఇక, గర్భగుడిలో ఆదిశేషునిపై శయనించిన స్వామిని చూడ్డానికి రెండు కళ్లూ చాలవు.
ఇదీ.. స్థల పురాణం!
మనువు కుమారుడైన ఇక్ష్వాకు మహారాజు బ్రహ్మ దేవుడి కోసం తపస్సు చేయగా బ్రహ్మ తాను ఆరాధిస్తున్న శ్రీరంగనాథుడి ప్రతిమను ఇక్ష్వాకు మహారాజుకి ఇస్తాడు. అలా ఆ వంశంలో శ్రీరామచంద్రుడి వరకూ ఆయన్ని ఆరాధించారు. పట్టాభిషేకానంతరం విభీషణుడు శ్రీరామ వియోగాన్ని భరించలేక లంకకు తిరిగి వెళ్లలేకపోతున్న సందర్భంలో- రాముడు తనకు బదులుగా రంగనాథుని విగ్రహాన్ని విభీషణుడికి ఇస్తాడు. అంతట రంగనాథుడితో బయలుదేరిన విభీషణుడు ఉభయ కావేరుల మధ్యకు చేరేసరికి సంధ్యావందన సమయం కావడంతో, స్వామిని కిందపెట్టి నదికి వెళ్ళి, తిరిగి వచ్చేసరికి రంగనాథుడు అక్కడే ప్రతిష్ఠితం కావడం చూసి విచారించాడట. అప్పుడు ఆ ప్రాంతాన్ని పాలించే ధర్మచోళుడు అతన్ని ఓదార్చి విగ్రహం ఉన్నచోటే ఆలయాన్ని నిర్మించాడనీ విభీషణుడి కోరిక మేరకు స్వామి దక్షిణ దిక్కుకు తిరిగాడనీ(లంక దక్షిణంగా ఉంది కాబట్టి) పౌరాణిక కథనం.
రంగనాథుడి ఉత్సవాలు!
ఏడాదికి 365 రోజులు ఉంటే ఈ ఆలయంలో 322 రోజులూ ఉత్సవాలు జరగడం విశేషం. ఆలయంలో పేరుకున్న మలినాల్ని తొలగించేందుకు జూన్-జులై మాసంలో గర్భగుడిని శుభ్రపరిచి ప్రత్యేకంగా తయారుచేసిన మూలికాతైలాన్ని పెరియ పెరుమాళ్‌కు పూసి మెరుగుపెట్టిన బంగారు తొడుగుని తొడుగుతారు. ఆ సమయంలో బంగారు కలశంతో భక్తులు కావేరి నది నుంచి నీళ్లు తీసుకొస్తారు. అలాగే నిత్యపూజల్లోని లోపాలను సరిదిద్దేందుకు పవిత్రోత్సవాన్ని తమిళ మాసమైన ఆణి(ఆగస్టు-సెప్టెంబరు)లో రెండురోజులపాటు చేస్తారు. ఏడాది పొడవునా ఎన్ని ఉత్సవాలు జరిగినా ధనుశ్శుద్ధ ఏకాదశికి ముందువెనకలుగా జరిగే పగల్‌పత్తు, రాపత్తు ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయట. ముఖ్యంగా ధనుర్మాసం (తమిళ నెల మార్గళి)లో వచ్చే వైకుంఠ ఏకాదశికి పదిలక్షలకు పైగా భక్తులు హాజరవుతారట. ఇలా చెప్పుకుంటూ వెళితే ఈ దివ్యక్షేత్రానికున్న ప్రత్యేకతలెన్నో.
అక్కడ 900 ఏళ్లనాటి రామానుజుడు!
మానత్వాన్ని చాటుతూ విశిష్టాద్వైత గొప్పతనాన్ని ప్రపంచానికి చెప్పిన మహనీయుడు రామానుజాచార్యులు. శ్రీపెరంబుదూరులో పుట్టి, కంచిలో వేదవిద్యని అభ్యసించి, శ్రీరంగం వేదికగా శ్రీవైష్ణవాన్ని ప్రభోధించాడాయన. కొందరికే పరిమితమైన అష్టాక్షరీ మంత్రాన్ని తిరుకొట్టియార్ ఆలయగోపురం పైకి ఎక్కి అందరికీ వినిపించారు. దీన్ని బహిరంగంగా వినిపిస్తే నరకానికి వెళతారనే వాదనను తోసిపుచ్చి, ‘వెళ్లినా పరవాలేదు, మరికొందరికి ముక్తి వస్తే అదే మేలు’ అని భావించిన గొప్ప వ్యక్తి. 1137లో ఆయన మరణానంతరం- తొమ్మిది శతాబ్దాలుగా- పార్థివదేహం శ్రీరంగంలో భద్రంగా ఉన్నట్లు చెబుతారు. నాలుగో ప్రాకారంలో రామానుజాచార్యుల ఆలయాన్ని సందర్శించినప్పటికీ విగ్రహం వెనక ఉన్నది ఆయన దివ్యశరీరమేననీ, పద్మాసనంలో కూర్చునే పరమపదించడంతో ఆ భంగిమలోనే దేహాన్ని భద్రపరిచారనీ, ఈ రకమైన మమ్మిఫికేషన్ మరెక్కడా కనిపించదనీ అంటారు. ఏటా ఆయనకి రెండుసార్లు ఉత్సవాలు నిర్వహించిన సమయంలో మాత్రమే కర్పూరం, కుంకుమపువ్వును ముద్దగా నూరి శరీరానికి పూస్తారట. అందువల్ల ఒకరకమైన ఎరుపురంగులో అది మెరుస్తూ ఉంటుంది. హారతి ఇచ్చే సమయంలో ఆయన కళ్లనూ, గోళ్లనూ గుర్తించవచ్చనీ అంటారు.