ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న ఒమిక్రాన్ వేరియంట్.. డెల్టాతో పోలిస్తే ఆరు రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతోందని ఆరోగ్యరంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. డెల్టాతో పోల్చితే కొత్త వేరియంట్ ఆర్‌వాల్యూ ఎక్కువంటున్న నిపుణులు.. మోనోక్లోనల్ యాంటీబాడీ థెరపీ, కాక్ టెయిల్ చికిత్సలకు సైతం లొంగడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒమిక్రాన్ కేసులు మొదట వెలుగుచూసిన దక్షిణాఫ్రికాతో పాటు పలు దేశాల్లో నిర్వహించిన ప్రాథమిక విశ్లేషణ ఆధారంగా.. డెల్టా వేరియంట్‌తో పోలిస్తే ఒమిక్రాన్ ఆరు రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతోందని పేర్కొన్నారు. అయితే ఒమిక్రాన్ గురించి రకరకాల ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి.. కానీ ఈ వైరస్ గురించి నిజంగా మనకు ఇప్పటివరకు ఏం తెలుసు? నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం.
కాన్పూర్ ఐఐటీ ప్రొఫెసర్ పద్మశ్రీ మనీంద్ర అగర్వాల్ మాట్లాడుతూ… కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ మహమ్మారి మూడవ వేవ్ కు కారణం కావచ్చు. దీని ప్రకారం కొత్త కరోనా వేరియంట్ గురించి ఎక్కువగా భయపడే బదులు, మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఒమిక్రాన్(Omicron) అత్యంత అంటువ్యాధి. ఈ కారణంగా, ఇది మూడవ తరంగాన్ని తీసుకురాగలదు. అయితే, ఇది మునుపటి కంటే తక్కువ ప్రాణాంతకంగా ఉంటుందని భావిస్తున్నారు. వ్యాక్సిన్ కంటే సహజ రోగనిరోధక వ్యవస్థ కొత్త వేరియంట్‌ను ఓడించగలదు అని అన్నారు.
‘ఒమిక్రాన్ వేరియంట్ గురించి ఎన్నో విషయాలు ప్రచారంలో ఉన్నాయి. కానీ వాటి పట్ల ఒక నిర్ధిష్ట నిర్ధారణకు రావాలంటే వాటిని శాస్త్రీయ ప్రాతిపదికన పరీక్షించాల్సిన అవసరం ఉంది’ అని ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా అన్నారు. ఒమిక్రాన్‌లో 30 కంటే ఎక్కువ మ్యుటేషన్లు ఉన్నాయి. వైరస్ స్పైక్ ప్రోటీన్‌లో ఈ మ్యుటేషన్లు ఏర్పడ్డాయి అని తెలిపారు. వైరస్ స్పైక్ ప్రోటీన్‌లో మ్యుటేషన్ కారణంగా ఈ వేరియంట్ రోగనిరోధక శక్తిని ఎదురించగల సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకుంటుంది. టీకాల వల్ల శరీరంలో ఏర్పడిన రోగ నిరోధక శక్తి లేదా మరే ఇతర ఇమ్యూనిటీ కూడా ఈ వైరస్‌ను ప్రభావితం చేయలేదు. అటువంటి పరిస్థితుల్లో ప్రపంచంలోని అన్ని కోవిడ్ వ్యాక్సీన్లను సమీక్షించాల్సి ఉంటుంది. ఎందుకంటే చాలా వ్యాక్సీన్లు, వైరస్ స్పైక్ ప్రోటీన్‌కు వ్యతిరేకంగా యాంటీబాడీలను అభివృద్ధి చేస్తాయి. దీని ఆధారంగానే వైరస్ పనిచేస్తుంది’ అని గులేరియా చెప్పారు.
చాలా స్వల్ప లక్షణాలు
దక్షిణాఫ్రికాలో ఈ నెలలోనే ఒమిక్రాన్ వేరియంట్‌ను కనుగొన్నారు. తర్వాత దీని గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)కు సమాచారమిచ్చారు. నవంబర్ 24న ఈ కొత్త వేరియంట్‌ను ధ్రువీకరించిన డబ్ల్యూహెచ్‌వో ఈ మేరకు ప్రకటనను విడుదల చేసింది. గత వారం దీన్ని ఆందోళనకర రూపాంతరంగా పేర్కొంటూ ఒమిక్రాన్ అని పేరు పెట్టింది. ఈ వేరియంట్లో చాలా మ్యుటేషన్లు ఉన్నాయని, ప్రాథమిక లక్షణంగా రీఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉన్నట్లు ఒక ప్రకటనలో WHO పేర్కొంది. ఒమిక్రాన్‌తో రిస్క్ ఎక్కువే, తీవ్ర పరిణామాలు తప్పవని తాజాగా డబ్ల్యూహెచ్‌వో హెచ్చరించింది. తొలుత ఈ కొత్త వేరియంట్‌ను దక్షిణాఫ్రికా డాక్టర్ ఏంజెలిక్ కోట్జీ గుర్తించారు. ఇప్పటివరకు ఈ వేరియంట్ బారిన పడిన ప్రజల్లో చాలా స్వల్ప స్థాయిలో కోవిడ్ లక్షణాలు కనబడ్డాయని తెలిపారు. చాలా మంది రోగులు ఒళ్లు నొప్పులు, విపరీతమైన అలసటతో బాధపడుతున్నారని, ప్రమాదంలో ఉన్న వ్యక్తులపై కొత్త వేరియంట్ ప్రభావం తీవ్రతను అంచనా వేయడానికి ఇంకా సమయం పడుతుందని ఆమె చెప్పుకొచ్చారు.
ఈ కొత్త వేరియంట్ దక్షిణాఫ్రికా నుంచి చాలా దేశాలకు వ్యాపించింది. అమెరికా, బెల్జియం, హాంకాంగ్, ఇజ్రాయెల్, జర్మనీ, బ్రిటన్, ఆస్ట్రేలియా దేశాల్లో కూడా ఈ వైరస్‌ను గుర్తించారు. ఇటీవల దక్షిణాఫ్రికా నుంచి భారత్ వచ్చిన కొందరికి కూడా కరోనా సోకినట్లు తేలింది. అయితే, వారికి సోకింది ఒమిక్రాన్ వేరియంటా కాదా అన్నది తెలుసుకునేందుకు జీనోమ్ సీక్వెన్స్ కోసం శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపించారు. మిగతా వేరియంట్లతో పోలిస్తే ఒమిక్రాన్ చాలా భిన్నమైనది. ఇది అసాధారమైన మ్యుటేషన్ల సమూహాన్ని కలిగి ఉంటుంది అని దక్షిణాఫ్రికాలోని సెంటర్ ఫర్ ఎపిడెమిక్ రెస్పాన్స్ అండ్ ఇన్నోవేషన్ డైరెక్టర్, ప్రొఫెసర్ టులియో డి ఓలివెరా వివరించారు. ఒమిక్రాన్‌లో మొత్తం 50 మ్యుటేషన్లు ఉన్నాయని, ఇందులో 30 మ్యుటేషన్లు స్పైక్ ప్రోటీన్‌లో సంభవించాయని ఆయన తెలిపారు.