శివాలయాన్ని దాచి ఉంచే సముద్రం… ‘నిష్కలంక్ మహదేవ్’ ఆలయం

Telugu Box Office

సాధారణంగా హిందూ దేవాలయాలు కొండల్లో, పర్వత ప్రాంతాల్లో, గుహల్లో, సముద్ర తీర ప్రాంతాల్లో, జలపాతాలు, నదులకు సమీపంలో అందమైన ప్రకృతి మధ్య ఎంతో గొప్పగా కనిపిస్తాయి. కానీ గుజరాత్‌లోని నిష్కలంక మహదేవ్ ఆలయం వీటన్నింటికీ ఎంతో భిన్నం. భీకరమైన అలల ప్రవాహం మధ్య తీరానికి సముద్రం మధ్యలో ఈ ఆలయం ఉంటుంది. నిష్కలంక్ అంటే పాపాలు దూరం చేసేది అని అర్ధం. మహాభారత యుద్ధం తరువాత పాండవులు తమ దోషాలను, కళంకాలను ఇక్కడే రూపుమాపుకున్నారని పురాణ కధనం. అందుకే ఇక్కడి శివుణ్ణి నిష్కలంక్ మహదేవ్ గా పూజిస్తారు. గుజరాత్ లోని భావనగర్‌కు తూర్పున 23 కిలోమీటర్ల దూరంలో కొలియాక్ సముద్ర తీర ప్రాంతంలో నిష్కలంక్ మహాదేవ్ ఆలయం ఉంది. భారతీయ క్యాలెండర్ ప్రకారం భదర్వ అమావాస్య రాత్రి పాండవులు ఇక్కడ నిష్కలంక్ మహదేవ్ ను స్థాపించారని చెబుతారు.

వెనక్కి వెళ్లే సముద్రం


కొలియాక్ సముద్ర తీరానికి ఉదయం పూట వచ్చే టూరిస్టులకు ఇక్కడ ఎటువంటి ఆలయం ఉన్నట్లు కనిపించదు. ఎందుకంటే ఆ సమయంలో ఆలయం పూర్తిగా నీటమునిగి ఉంటుంది. సముద్రం మధ్యలో ఆలయం ఉందనడానికి సూచికగా ఆలయ ధ్వజస్తంభంపై ఉండే జెండా మాత్రమే రెపరెపలాడుతూ కనిపిస్తుంది. మధ్యాహ్నం 11 గంటలు దాటిన తరువాత నుంచి సముద్రం మెల్లగా వెనక్కి వెళ్లడం ప్రారంభిస్తుంది. దీంతో భక్తులు ఆలయానికి చేరుకునేందుకు మార్గం సుగమం అవుతుంది. ముఖ్యంగా పౌర్ణమి, అమావాస్య రోజుల్లో భక్తులు ఇక్కడికి అధిక సంఖ్యలో దర్శనానికి వచ్చి అలలు ఎప్పుడు మాయమౌతాయా అని ఎదురుచూస్తుంటారు. ఏటా మహాశివరాత్రి పర్వదినం రోజున ఇక్కడ అత్యంత వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి. సముద్రం మధ్యలో ఈ ఆలయం నిర్మాణం ఎలా చేశారనేది నేటి తరం ఇంజినీర్లకు, సాంకేతిక నిపుణులకు అంతుచిక్కని పెద్ద ప్రశ్నగా మిగిలింది. ఈ ఆలయానికి వీక్షించిన వారు ప్రాచీన భారతీయుల పనితనాన్ని, నైపుణ్యాన్ని కొనియాడకుండా ఉండలేరు.

ప్రతిరోజూ మధ్యాహ్నం 1 గంట సమయానికి సముద్రం పూర్తిగా వెనక్కి వెళ్లడంతో పూలు, పండ్లు, పూజా సామగ్రి అమ్మే వర్తకులు తమ సామాగ్రిని తోపుడు బండ్లపై వేసుకుని సముద్రంలో నడుచుకుంటూ ఆలయానికి చేరుకుంటారు. ఆ తరువాత ఆలయానికి వెళ్లే భక్తుల తాకిడి కూడా పెరుగుతుంది. రాత్రి 7 గంటల వరకూ భక్తులు ఈ ఆలయం వద్ద సమయం గడపవచ్చు. ఆ సమయం దాటిన తరువాత సముద్రం మళ్లీ ముందుకు రావడం ప్రారంభిస్తుంది. అర్ధరాత్రి దాటే సమయానికి ఆలయం పూర్తిగా సముద్రగర్భంలో మునిగిపోతుంది.

ఆలయం వెనుక ఆసక్తికరమైన కధ

మహాభారతం యుద్ధం సమయంలో పాండవులు కౌరవులపై యుద్ధాన్ని గెలిచిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ యుద్ధంలో సొంత బంధువులను చంపిన పాపాలను వారు మూటగట్టుకుంటారు. ఆ పాపాల నుంచి విముక్తి పొందడానికి పాండవులు శ్రీకృష్ణున్ని ఆశ్రయిస్తారు. అప్పుడు శ్రీకృష్ణుడు ఒక నల్లని ఆవుకు నల్లని జెండాను కట్టి అవి ఎంత దూరం వెళితే అంత దూరం వాటి వెంట వెళ్లమంటాడు. ఎప్పుడైతే ఆ ఆవు, జెండా తెల్లగా మారతాయో అప్పుడు ఆ పాపాల నుంచి విముక్తి దొరుకుతుందని సెలవిస్తాడు. కృష్ణుడి సూచన మేరకు పాండవులు రోజుల తరబడి వాటి వెంటే నడిచేవారు. ఎంత దూరం నడిచినా వాటి రంగులో మార్పు రాలేదు. ఎప్పుడైతే చివరిగా ఆవు, జెండా కొలియాక్ సముద్ర తీరానికి చేరుకున్నాయో అప్పుడు ఉన్నట్టుండి అవి తెల్లగా మారతాయి. అప్పుడు ఐదుగురు అన్నదమ్ములు ఆ ప్రదేశంలోనే కూర్చుని పరమశివుని కోసం ఘోర తపస్సు చేస్తారు. వారి భక్తికి మెచ్చిన శివుడు ఒక్కొక్కరి ఎదుట ఒక్కో స్వయంభువు శివలింగంగా అవతరిస్తాడు. దీంతో పాండవులు అమితానందపడి ఆ ఐదు శివలింగాలకు పూజలు నిర్వహించినట్లు పురాణ కధనం. పాండవుల పాపాలను కడిగిన ఈ పరమ పవిత్ర ప్రదేశం అప్పటి నుంచి నిష్కలంక్ / నిష్కలంక్ మహదేవ్ గా ప్రసిద్ధి పొందింది.

భదర్వి మాసంలో అమావాస్య రోజున పాండవులు ఈ దేవాలయాన్ని ఇక్కడ స్థాపించడంతో ప్రతి ఏటా శర్వణ్ మాసం (ఆగస్టు)లో అమావాస్య రోజున ‘భైదర్వి’ అనే పండుగను ఘనంగా నిర్వహిస్తారు. ఆలయాన్ని సందర్శించే భక్తులకు ప్రతి శివలింగం ఎదుట ఒక్కో నంది కనిపిస్తుంది. భక్తులు ముందుగా పాండవ కొలను అని పిలవబడే నీటి గుంట వద్ద తమ కాళ్లను శుభ్రపరచుకుని పూలు, పాలు, పండ్లతో శివలింగాలకు స్వయంగా అభిషేకిస్తుంటారు. ఇక్కడ ప్రతి అమావాస్య, పౌర్ణమి రోజుల్లో కెరటాలు చాలా ఉధృతంగా వస్తుంటాయి. భక్తులు తెల్లవారుజామునే ఇక్కడికి చేరుకుని కెరటాలు శాంతించే వరకూ ఎదురుచూస్తుంటారు. మనకు బాగా కావాల్సిన వారు ఎవరైనా మరణిస్తే వారి ఆస్తికలను ఇక్కడి నీటిలో కలపడం ద్వారా వారి ఆత్మకు శాంతి చేకూరి ముక్తి లభిస్తుందని బలంగా నమ్ముతారు. ఆలయం గోపురంపై సూచికగా ఎగిరే జెండాను సంవత్సరానికి ఒక్క సారి మాత్రమే మారుస్తారు. ఇప్పటివరకూ తుఫాన్ల వలన కానీ, అలల వలన కానీ ఈ జెండా దెబ్బతిన్న దాఖలాలు లేవు.

దేవుడిపై భక్తి, పర్యటనల పట్ల ఆసక్తి ఉన్న వారికి ఈ ప్రదేశం తప్పకుండా ఓ మరపురాని అనుభూతిని ఇస్తుందనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. భగవంతుడి అద్భుత సృష్టికి ఇంతకంటే వేరే నిదర్శనం మరొకటి లేదని ఈ ప్రాంతాన్ని సందర్శించే పర్యాటకులు చెబుతుంటారు. ఈ ఆలయ విశేషాలు తెలుసుకున్న ఎవరైనా జీవితంలో ఒక్కసారైనా ఈ సాహసభరిత యాత్ర చేయాలని కోరుకుంటారు. మార్చి నుంచి జూలై మాసాల మధ్య ఈ ఆలయాన్ని సందర్శించేందుకు మంచి సమయం.

ఎలా వెళ్లాలంటే


విమాన మార్గం ద్వారా వచ్చే వారు అహ్మదాబాద్ విమానాశ్రయంలో దిగి 196 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ ప్రదేశానికి చేరుకోవాల్సి ఉంటుంది. అహ్మదాబాద్ రైల్వే స్టేషన్ నుంచి భావనగర్‌కు రైలు మార్గం ద్వారా చేరుకోవచ్చు. భావనగర్ ఎక్స్‌ప్రెస్, మహువ ఎక్స్ ప్రెస్ రైళ్లు ఈ మార్గంలో ప్రయాణిస్తాయి. సుమారు 5 గంటల ప్రయాణం ఉంటుంది. భావనగర్ నుంచి కొలియాక్ గ్రామానికి 22 కిలోమీటర్ల దూరం. రైల్వే స్టేషన్ నుంచి ట్యాక్సీ, ఆటో రిక్షా లేదా బస్సుల ద్వారా అక్కడికి చేరుకోవచ్చు.

Share This Article