తిరుమలకు వెళ్ళినప్పుడు చాలామంది తప్పకుండా దర్శించుకునే వినాయక దేవాలయం కాణిపాకం. ఈ వినాయకుడు రోజురోజుకి పెరిగి భగవంతుని మహిమ ఎటువంటిదో చూపిస్తున్నాడు. ఆ కాణిపాక వినాయకుని ఆలయచరిత్ర నిజానిజాలేంటో మీకు తెలుసా? తెలుసు కానీ అంత వివరంగా తెలీదు కదా. మరెందుకాలస్యం ఆ కాణిపాకం వినాయకుని గూర్చి వివరంగా తెలుసుకుందాం. హిందువులు ఎలాంటి శుభకార్యం చేయాలన్నా మొదటిగా పూజించేది వినాయకుణ్ణి. వినాయకుణ్ణి పూజ చేస్తే శుభం కలుగుతుందని ప్రజల నమ్మకం. వినాయకుడనగానే మనకెక్కువగా గుర్తుకొచ్చేది కాణిపాకం. వినాయకుడు వెలసిన పవిత్రమైన స్థలం. తెలుగు రాష్ట్రాలలో చాలా ప్రాముఖ్యం వున్న క్షేత్రాల్లో కాణిపాకం ఒకటి. ఇక్కడ వినాయకుణ్ణి ఎవరూ ప్రతిష్టించలేదు. తానే స్వయంగా వెలశాడు. అందుకే కాణిపాకం వినాయకుణ్ణి స్వయంభూ అంటారు.
ఆలయ చరిత్ర
చిత్తూరు జిల్లాలో బాహుదా నదీ తీరంలో వెలసిన గణపయ్యకు వెయ్యేళ్ల చరిత్ర ఉంది. పూర్వం విహారపురి అనే ఊరిలో ధర్మాచరణ పరాయణులైన ముగ్గురు అన్నదమ్ములు వ్యవసాయం చేసి జీవనం సాగించేవారు. అందులో పెద్దవాడు గుడ్డివాడైతే, మిగతా ఇద్దరు మూగ, చెవిటివారిగా పుట్టారు. కొన్నాళ్లకు ఆ ఊరిని కరువు కమ్మేసింది. దీంతో అక్కడి ప్రజలు అల్లాడిపోయారు. ఈ నేపథ్యంలో ఈ సోదరులు పంటలు పండించుకునేందుకు తమ స్థలంలో ఒక బావిని తవ్వడం ప్రారంభించారు. కొంత లోతు తవ్విన తరువాత అక్కడ ఒక పెద్దరాయి అడ్డు వచ్చింది. దాన్ని పెకళించడానికి ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలో రాయికి పార తగిలింది. వెంటనే రాయి నుంచి రక్తం చిమ్మి ఆ సోదరుల మీద పడిందట. ఆ మరుక్షణమే వారి వైకల్యం పోయింది. ఈ విషయాన్ని వాళ్లు తమ ఊరి ప్రజలందరికీ చెప్పారు. పరుగు పరుగున గ్రామ ప్రజలు బావి వద్దకు వచ్చి చూడగా వినాయకుడి రూపం దర్శన మిచ్చిందట. వెంటనే ఆ స్వామికి ప్రజలంతా కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు. ఆ కాయల నుంచి వచ్చిన నీరు ఎకరం(కాణి) దూరం పారిందట. అలా విహారపురికి కాణి పారకమ్ అని పేరు వచ్చింది. క్రమేణా అదే పేరు కాణిపాకంగా మారింది.
విగ్రహంలోనూ ఎదుగుదల
బావిలో ఉద్భవించిన వినాయకుడి విగ్రహంలోనూ ఎదుగుదల ఉండడం విశేషం. చోళ రాజుల కాలంలో కాణిపాక ఆలయంతోపాటు అనుబంధ ఆలయాలు నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. అప్పట్లో ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న కుళతుంగ చోళరాజు 11వ శతాబ్దంలో ఇక్కడ ఆలయాన్ని నిర్మించినట్లు ఆధారాలు ఉన్నాయి. 65 ఏళ్ల క్రితం బహుకరించిన వెండికవచం, 2000, 2002, 2006, 2007 సంవత్సరాల్లో భక్తులు ఇచ్చిన తొడుగులు స్వామికి ఇప్పుడు సరిపోక పోవడం విగ్రహం వృద్ధికి నిదర్శనంగా చెబుతారు. ఈ కవచాలను భక్తుల దర్శనార్థం ఆలయంలో ప్రత్యేకంగా అలంకరించి ఉన్నారు.
సత్యప్రమాణాల దేవుడిగా..
వరసిద్ధి వినాయకుడు సత్యప్రమాణాల దేవుడిగా ప్రసిద్ధికెక్కారు. స్వామి ఎదుట తప్పుడు ప్రమాణాలు చేస్తే శిక్షపడుతుందని భక్తుల విశ్వాసం. వ్యసనాలకు బానిసలైన వారు ఇక్కడ ప్రమాణం చేస్తే వాటికి దూరమవుతారని నమ్మకం. దీంతోపాటు రాజకీయ ప్రమాణాలు సైతం చేస్తుండడం విశేషం. అసెంబ్లీలో నాయకులు సైతం ఆరోపణలు వచ్చిన సమయంలో కాణిపాకంలో ప్రమాణానికి సిద్ధమా? అంటూ సవాళ్లు విసురుకోవడం గమనార్హం. ఇక్కడ చేసిన ప్రమాణాలకు బ్రిటిష్ కాలంలో న్యాయస్థానాల్లో కూడా ప్రామాణికంగా తీసుకునేవారు. స్వయంభువు వరసిద్ధి వినాయకస్వామి గుడికి వాయువ్య దిశగా ఉన్న మణికంఠేశ్వరస్వామి ఆలయం ప్రధాన ఆలయానికి అనుబంధ నిలయం.”బ్రహ్మహత్యా పాతక నివృత్తి” కోసం శివుడి ఆజ్ఞ మేరకు ఈ ఆలయం నిర్మించారని ప్రసిద్ధిచెందింది.
ఆలయంలో సర్పం
ఈ ఆలయంలో ఎప్పుడు ఒక సర్పం తిరుగుతూ ఉంటుంది. అది ఎవరికీ అపకారం చేసినట్లు ఇంతవరకు ధాఖలాలు లేవు. అది దేవతా సర్పమని, ఎంతో గొప్ప మహిమ గలదని, ఆ పాము పడగఫై మణి కుడా దర్శనం ఇస్తూ ఉంటుందని అక్కడి అర్చకులు, భక్తులు చెప్పుతూ ఉంటారు.
శ్రీ వరదరాజస్వామి ఆలయం
శ్రీ వరసిద్ది వినాయకుని ఆలయానికి తూర్పుగా ఈశాన్య దిశలో శ్రీ వరదరాజ స్వామి వారి ఆలయం వుంది. పూర్వం జనమేజయుడు సర్ప యాగం చేసిన తర్వాత శ్రీ మహా విష్ణువు అతనికి కలలో కనపడి శ్రీ వరదరాజస్వామి వారి ఆలయాన్ని కట్టించమని అజ్ఞాపించడం చేత దీన్ని కట్టించాడని అంటారు. కాణిపాకంలో ప్రసిద్దమైన ఆంజనేయస్వామి గుడి కూడా వుంది. అద్దాల మేడ వరదరాజస్వామి ఆలయంలో నవగ్రహాల మండపం, అద్దాల మేడ కూడా ఉంది. కాణిపాకం మూడో వంతు వివిధ దేవాలయాలతో నిండి వుంది.