సకల సంపదలకు నిలయం శ్రీ మహాలక్ష్మీ అమ్మవారు. ఆమె కరుణ తమపై ప్రసరించాలని కోట్లాది భక్తులు నిత్యపూజలు చేస్తుంటారు. వైకుంఠంలో వున్న అమ్మవారు భక్తుల కోసం భూమిపై వెలసిన క్షేత్రమే మహారాష్ట్ర కొల్హాపూర్‌లోని శ్రీమహాలక్ష్మీ ఆలయం. నిత్యం వేలాదిమంది భక్తులు ఆమెను దర్శించుకొని పునీతులవుతుంటారు. అష్టదశ శక్తిపీఠాలలో ఎంతో విశిష్టత పొందిన శక్తిపీఠం శ్రీ మహాలక్ష్మి దేవి శక్తిపీఠం. మహాలక్ష్మి అమ్మవారు కోలహాసురుడు అనే రాక్షసుడిని సంహరించి ఇక్కడ వెలసిందని అందుకే కొల్హాపూర్ అనే పేరు వచ్చిందని కొందరు చెబుతుంటా. పద్మావతి పరిణయం వేళ తిరుమలేశుడిపై అలిగిన అమ్మవారు ఇక్కడకు వచ్చి వెలిసిందని మరో కథ ప్రాచుర్యంలో ఉంది.
వైకుంఠపురి నుంచి..
శ్రీమహావిష్ణువు వైకుంఠంలో వుండగా భృగుమహర్షి వచ్చాడు. అయితే రుషి రాకను విష్ణువు గమనించలేదు. దీంతో ఆగ్రహం చెందిన భృగువు స్వామివారి ఎదపై కాలుపెట్టారు. దీంతో ఆగ్రహించిన లక్ష్మీదేవి భూలోకానికి వెళ్లి కొల్హాపూర్ సమీపంలో తపస్సులో మునిగిపోయింది. భృగువు పాదంలో కన్నును లౌక్యంగా తీసివేసిన మహావిష్ణువు రుషి గర్వాన్ని అణచివేశాడు. అనంతరం అమ్మవారి కోసం అన్వేషిస్తూ తిరుమలలో శ్రీ వేంకటేశ్వరుడిగా అవతరించినట్టు పురాణాలు పేర్కొంటున్నాయి. కొల్హాపురంలో వెలసిన అమ్మవారి ప్రాశస్త్యం అందరికి తెలియడంతో క్షేత్రం అందరికి దర్శనకేంద్రంగా మారింది.
ప్రళయంలోనూ చెక్కుచెదరదు..
ఈ ప్రాంతాన్ని కర్వీర్‌గా వ్యవహస్తారు. ఆ మహాదంపతులకు ఇష్టమైన ప్రదేశం కావడంతో మహాప్రళయంలోనూ చెక్కుచెదరదు. అందుకనే ఈ క్షేత్రాన్ని అవిముక్తేశ్వర క్షేత్రమని పేర్కొంటారు. లోకమాత జగదాంబ ఈ క్షేత్రాన్ని సృష్టించింది. అందుకనే ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో మహర్షులు, రుషులు పూజలు చేసినట్టు చారిత్రక ఆధారాలు పేర్కొంటున్నాయి. అమ్మవారి తపస్సు అనంతరం ఒక్క రాత్రిలోనే ఈ ఆలయాన్ని నిర్మించినట్టు తెలుస్తోంది.
అరుదైన శిలపై అమ్మవారి రూపం..
శ్రీమహాలక్ష్మీదేవి విగ్రహాన్ని అరుదైన శిలపై చెక్కారు. నాలుగు హస్తాలు కలిగి భక్తులను దీవిస్తున్న రూపం మనల్ని ఆకట్టుకుంటుంది. ఫలం, గద, కవచం, పాత్రను నాలుగుచేతుల్లో కలిగివున్న దివ్యమంగళరూపం భక్తులకు ఎల్లప్పుడూ ఆశీర్వచనాలు ఇస్తుంటుంది. అంబా బాయిగా ఆమెను భక్తులు ఆరాధనతో పిలుస్తారు. ఆలయంలో ప్రతిరోజు జరిగే కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకర్షిస్తాయి. శక్తిపీఠాల్లో కూడా కొల్హాపూర్ ఒకటి కావడం విశేషం.
కిరణోత్సవం..
సూర్యదేవుడు అమ్మవారి కటాక్షం కోసం ఏటా మూడురోజులు గర్భాలయంలోకి సూర్యకిరణాలను ప్రసారిస్తాడు. తొలిరోజు పాదాలకు, రెండో రోజు నడుము భాగానికి మూడోరోజు శిరస్సు భాగానికి కిరణాలు ప్రసారిస్తాయి. ఈ ఉత్సవాలను కిరణ్ ఉత్సవ్‌గా వ్యవహరిస్తారు. ఈ దినాల్లో అమ్మవారిని దర్శనం చేసుకునేందుకు వేలాదిమంది భక్తులు కొల్హాపూర్‌కు చేరుకుంటారు. క్షీరసాగర మథనంలో జన్మించిన శ్రీలక్ష్మీదేవిని సాక్షాత్తూ శ్రీమహావిష్ణువు తన హృదయేశ్వరిగా స్వీకరిస్తారు. నారాయణిగా ప్రసిద్ధికెక్కిన లక్ష్మీదేవి ఎక్కడ వుంటే అక్కడ సిరిసంపదలకు లోటువుండదు. ఆమె కటాక్షం కోసం యావత్ మానవాళి ప్రార్థిస్తుంది. స్వయంగా ఆమె తపస్సు చేసి వెలసిన ప్రాంతమే కొల్హాపురం. అందుకనే ఆ నగరంలో పేదరికం వుండదని సామెత. సహకార ఉద్యమంలో కొల్హాపూర్ కీలకమైన భూమిక పోషించింది. చక్కెర మిల్లులు ఎక్కువగా వుండటంతో భారతదేశానికి చక్కెర కేంద్రంగా మారింది. ప్రతి ఏడాది శరన్నవరాత్రి ఉత్సహావాలు వైభవంగా జరుపుతుంటారు. చైత్ర పూర్ణిమ రోజున జరిగే ఉత్సవంలో అమ్మవారి ఊరేగింపు జరుగుతుంది. ఇక్కడ అమ్మవారిని అంబబాయి అని కరివీర్ మహాలక్ష్మి అనే పేరులతో పిలుస్తారు. ఈఆలయ ప్రాంగణం అంతా అలనాటి రాజ సంస్కృతుల సాంప్రదాయలతో కనిపిస్తాయి.
చూడదగిన ప్రదేశాలు
లక్ష్మీదేవి ఆలయం గర్భగుడి ముందు 100 అడుగుల పొడవుగల మండపం ఉంటుంది. గర్భగుడిలో ఆరడుగుల చదరంగా ఉన్న ఎత్తైన వేదిక మీద రెండడుగుల పీఠం, దాని మీద మహాలక్ష్మి అమ్మవారు విగ్రహం కుర్చొని ఉన్న స్థితిలో ఉంటుంది. ఈ ఆలయ ప్రాంగణంలో విరోబా ఆలయంఉంది. విద్యాబుద్ధులు ప్రసాదించే తల్లి అయిన శారదా అమ్మవారు ఇక్కడ కొలువై ఉన్నారు. అలాగే కాళికా అమ్మవారు ,అతిబలేశ్వర స్వామి విగ్రహం కూడా ఉంది.
ఎలా వెళ్లాలి..
దేశంలోని ప్రధాన నగరాలతో కొల్హాపూర్‌కు రోడ్డు, రైలు మార్గాలున్నాయి.
హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో దూరం 540 కి.మీ.
పుణె, ముంబాయి విమానాశ్రయాల నుంచి కొల్హాపూర్‌కు రోడ్డుమార్గాన చేరుకోవచ్చు.