ఉరుకులు పరుగుల జీవితంలో ప్రజలు వ్యాయామానికి తగిన సమయం కేటాయించడం లేదు. తరుచూ వ్యాయామం చేయకపోతే శరీరంలో కొవ్వు పేరుకుపోయి ఊబకాయానికి దారి తీయొచ్చని, దాని కారణంగా అనేక వ్యాధులు శరీరంపై దాడి చేస్తాయని డాక్టర్లు చెబుతున్నారు. అయితే చాలామంది టైమ్ లేదంటూ వ్యాయామాన్ని పట్టించుకోరు. అలాంటివారికి నడక చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. రోజూ కాస్త సమయం నడిస్తే స్థూలకాయాన్ని తగ్గించడమే కాకుండా.. అనేక ప్రయోజనాలు ఉన్నాయని పేర్కొంటున్నారు. ఊబకాయం సమస్యతతో బాధపడుతున్న వారు రోజూ ఉదయం, సాయంత్రం 30 నిమిషాలు నడవడం వల్ల శరీరంలోని అనేక రకాల సమస్యల నుంచి బయటపడవచ్చని పేర్కొంటున్నారు. రోజూ నడవడం వల్ల మీ శరీరం అదనపు కేలరీలను బర్న్ చేయడంతో పాటు బరువును అదుపులో ఉంచుతుంది. అలాగే ఉత్సాహం రెట్టింపవుతుంది. నిత్యం క్రమం తప్పకుండా ఓ అరగంట పాటు నడిస్తే చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఒత్తిడి నుంచి ఉపశమనం
ఈ రోజుల్లో ఒత్తిడి కూడా పెను సమస్యగా మారుతోంది. ఒత్తిడి వల్ల ఊబకాయం, మెదడు సంబంధిత, గుండె సంబంధిత వ్యాధులు వస్తాయి. అయితే క్రమం తప్పకుండా నడవడం వల్ల శరీరంలో ఒత్తిడి హార్మోన్ల ఉత్పత్తి తగ్గుతుంది. దీని వల్ల ఒత్తిడి నుంచి ఉపశమనం పొందవచ్చు.
హై బీపీ కంట్రోల్
హై బీపీ, కొలెస్ట్రాల్ గుండెపోటుకు ప్రధాన కారణంగా చెప్పొచ్చు. హైబీపీ ఉన్నా, శరీరంలో కొలస్ట్రాల్ స్థాయి పెరుగుతున్నట్లు అనిపించినా క్రమం తప్పకుండా నడవడం మంచింది. ఈ ప్రక్రియ వల్ల హైబీపీ కంట్రోల్ కావడమే కాకుండా కొలస్ట్రాల్‌ను అదుపులో ఉంచుకోవచ్చు.
బోలు ఎముకల వ్యాధి ప్రమాదం తగ్గుతుంది
ప్రస్తుతం 30 ఏళ్లలోపు యువతలోనూ ఆస్టియోపోరోసిస్ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. శారీరక శ్రమ లేకపోవడం, సరైన ఆహారం లేకపోవడం వల్ల ఈ సమస్య వెంటాడుతోంది. బోలు ఎముకల వ్యాధి సమయంలో పగుళ్లు ప్రమాదం పెరుగుతుంది. దీనితో పాటు, భవిష్యత్తులో మోకాలు, తుంటి దెబ్బతినే ప్రమాదం పెరుగుతుంది. అయితే క్రమం తప్పకుండా నడిచేవారిలో ఆస్టియోపోరోసిస్ ముప్పు చాలా తక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
షుగర్ కంట్రోల్..
షుగర్ పేషెంట్లకు నడక ఎంతో మేలు చేస్తుంది. మధుమేహానికి దీన్ని సరైన ఔషధంగా చెబుతుంటారు. ఏదైనా వ్యాధి కారణంగా లేదా వంశపారంపర్యంగా మధుమేహం వచ్చే ప్రమాదం ఉన్నవారికి నడక ఎంతో మేలు చేస్తుంది.