శీతాకాలం ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఈ సమయంలో చలికాలంలో వెచ్చగా ఉండాలంటే ఏం చేయాలి? అని ప్రశ్నిస్తే.. ఉన్ని దుస్తులు ధరించండి.. ప్రతి గంటకు కాఫీ త్రాగండి లేదా రోజంతా హీటర్ ముందు కూర్చోండి.. శీతాకాలంలో మిమ్మల్ని మీరు వెచ్చగా ఉంచుకోవడానికి పలు ద్రవ పదార్థాలు తీసుకోండి అంటూ సలహా ఇస్తుంటారు. సాధారణంగా ఉష్ణోగ్రత తగ్గుదల, చల్లని గాలి మీ సాధారణ దినచర్యకు భంగం కలిగించవచ్చు.
ఈ సీజన్‌లో మిమ్మల్ని మీరు వెచ్చగా ఉంచుకోవడానికి ఒక సాధారణ మార్గం ఉంది. అదే శరీరంలో వేడిని ఉత్పత్తి చేసే ఆహారాన్ని తినడం. సాధారణంగా కొవ్వు, మాంసకృత్తులు, పిండి పదార్థాలు ఉన్న ఆహారం జీర్ణం కావడానికి సమయం తీసుకుంటుంది. ఈ ఆహారం శరీరంలో వేడిని ఉత్పత్తి చేస్తుంది. ఇది శీతాకాలంలో మిమ్మల్ని వెచ్చగా ఉంచుతుంది. కాబట్టి ఆరోగ్యంగా ఉండటానికి ఈ సీజన్‌లో తీసుకోవాల్సిన ఆహార పదార్థాలేంటో ఇప్పుడు తెలుసుకోండి.
దుంప కూరగాయలు
శీతాకాలంలో దుంప కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. జీర్ణక్రియ ప్రక్రియకు చాలా శక్తి అవసరం. ఇది శరీరంలో వేడిని ఉత్పత్తి చేస్తుంది. అందుకే ఈ కాలంలో బంగాళాదుంపలు, బీట్‌రూట్, క్యారెట్లు వంటి రూట్ వెజిటేబుల్స్ తినండి. ఇవి చలితో పోరాడటానికి మీకు సహాయపడతాయి. ఉల్లిపాయలు వంటి కొన్ని ఘాటైన ఆహారాలు కూడా మీ ఆహారంలో భాగం కావచ్చు.
తృణధాన్యాలు, గింజలు
వేరుశెనగ, బాదం, జీడిపప్పు, పిస్తా, ఖర్జూరం వంటి కొన్ని గింజలు కూడా శీతాకాలంలో మేలు చేస్తాయి. ఈ గింజలు మీ జీవక్రియను వేగవంతం చేస్తాయి. మీ శరీర ఉష్ణోగ్రతను పెంచుతాయి, చివరికి శరీరాన్ని వేడిగా అనిపించేలా చేస్తాయి.
ఫ్రూట్స్
కొబ్బరి, ఆపిల్ వంటి పండ్లు శీతాకాలంలో మంచి ఎంపిక. ఈ పండ్లు ఫైబర్‌తో నిండి ఉంటాయి. మన కడుపు వాటిని జీర్ణం చేయడానికి సమయం పడుతుంది. ఈ క్రమంలో ఇది వేడిని ఉత్పత్తి చేసి మిమ్మల్ని వెచ్చగా ఉంచుతుంది.
కోడిగుడ్లు, చికెన్:
గుడ్లు, చికెన్ రెండింటిలో ప్రోటీన్, కాల్షియం, ఐరన్ అధిక మొత్తంలో ఉంటాయి. ఇది త్వరగా జీర్ణం కావడం కష్టం. అందువల్ల ఇవి మీ శరీర ఉష్ణోగ్రతను పెంచుతాయి.
సుగంధ ద్రవ్యాలు
వెల్లుల్లి, నల్ల మిరియాలు, అల్లం వంటి సాధారణ మసాలా దినుసులు, సుగంధ ద్రవ్యాలు కూడా శరీరంలో వేడిని ఉత్పత్తి చేయడానికి సహకరిస్తాయి. ఈ మసాలాలు జీర్ణమైనప్పుడు మీ శరీరం వేడిని పెంచే సమ్మేళనంతో వెచ్చగా ఉంచుతుంది.