Daaku Maharaj Review : ‘డాకు మహరాజ్’ రివ్యూ

Telugu BOX Office
‘డాకు మ‌హారాజ్‌’.. బాక్సాఫీస్‌ ‘ద‌బిడి దిబిడే’
3.5

చిత్రం: డాకు మ‌హారాజ్‌(Daaku Maharaj Review)
నటీనటులు: నందమూరి బాలకృష్ణ, బాబీ దేవోల్‌, ప్రజ్ఞా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి, ఊర్వశి రౌతేలా త‌దిత‌రులు; సంగీతం: తమన్‌; సినిమాటోగ్రఫీ: విజయ్ కార్తీక్‌; ఆర్ట్‌: అవినాష్ కొల్లా; ఎడిటింగ్‌: నిరంజన్ దేవరమానే, రూబెన్; నిర్మాణం: సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ, సాయిసౌజ‌న్య‌; దర్శకత్వం: బాబీ కొల్లి; సమర్పణ: శ్రీకర స్టూడియోస్; సంస్థ: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్‌; విడుద‌ల‌: 12-01-2025

సంక్రాంతికి బాల‌కృష్ణ (Balakrishna) సినిమా వస్తోందంటే బాక్సాఫీస్ ద‌గ్గర క‌నిపించే సంద‌డే వేరు. ఇటు కుటుంబ ప్రేక్షకులు… అటు అభిమానులు చూసేందుకు పోటీ ప‌డ‌తారు. గతేడాది సంక్రాంతికి ‘వీరసింహారెడ్డి’తో హిట్టు కొట్టిన బాలయ్య ఈసారి ‘డాకు మ‌హారాజ్’తో (Daku Maharaj Release Date) అలరించడానికి వచ్చారు. మాస్‌ సినిమాల‌కి పెట్టింది పేరైన యువ ద‌ర్శకుడు బాబీ కొల్లి ఈ మూవీని తెర‌కెక్కించారు. గత సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’తో బాలకృష్ణతో పడిన బాబీ ఈసారి ఆయనతోనే సినిమా తీసి సంక్రాంతికి వచ్చేశాడు. ప్రచార చిత్రాలు, టీజర్, ట్రైలర్‌తో అంచనాలు పెంచేసిన ‘డాకు మహారాజ్’ మూవీ ఎలా ఉందో తెలుసుకుందామా..

 

కథేంటి

చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన కృష్ణమూర్తి(సచిన్‌ ఖేడ్కర్‌) విద్యావేత్త. ఓ పెద్ద స్కూల్‌ని నడుపుతుంటాడు. తనకు పెద్ద కాఫీ ఎస్టేట్‌ ఉంటుంది. దాన్ని లీజుకి తీసుకున్న స్థానిక ఎమ్మెల్యే త్రిమూర్తులు (రవి కిషన్‌) అక్కడ వన్య మృగాలను అక్రమంగా తరలిస్తుంటాడు. త్రిమూర్తులు అరాచకాలు హద్దుమీరడంతో పోలీసులు ఆశ్రయిస్తాడు కృష్ణమూర్తి. దీంతో పగ పెంచుకున్న త్రిమూర్తులు, కృష్ణమూర్తి మనవరాలు వైష్ణవికి ప్రాణహాని తలపెట్టడానికి కిడ్నాప్‌ చేస్తాడు. ఈ ఆపద నుంచి గట్టెక్కించడానికి ఆ ఇంట్లో పని చేస్తున్న మకరంద్‌ దేశపాండే చంబల్‌లోని మోస్ట్‌ వాంటెడ్‌ మహారాజ్‌ (బాలకృష్ణ)కు కబురు పెడతాడు. మహారాజ్‌ నానాజీగా పేరు మార్చుకొని ఆ పాపకు చ రక్షణగా ఉండటానికి వస్తాడు. అసలు ఈ మహారాజ్‌ ఎవరు? ఆ పాపకి తనతో వున్న సంబంధం ఏమిటి?.. ఈ కథలో బల్వంత్‌ ఠాకూర్‌ (బాబీ డియోల్‌), నందిని (శ్రద్థా శ్రీనాథ్‌) ఎవరు? అసలు మహారాజ్‌, నానాజీగా పేరు ఎందుకు మార్చుకున్నాడు. తన శత్రువర్గం ఎవరు అన్నది తెరపైనే చూడాల్సిందే.

ఎలా ఉంది..

కొత్త క‌థ‌ల్ని చెప్పడం కంటే… పాత క‌థ‌ల్నే కొత్తగా చెప్పడం ఓ ప‌ద్ధతి. ఫ్యాన్ బేస్ బ‌లంగా ఉన్న అగ్ర హీరోల‌తో సినిమాలు తీస్తున్నప్పుడు కొత్త క‌థ‌ల‌తో ప్రయోగాలు చేయ‌డం కంటే ఈ ఫార్ములాని అనుస‌రించ‌డ‌మే సుర‌క్షితం అని న‌మ్మే ద‌ర్శకులు చాలా మందే ఉన్నారు. అయితే పాతకథని ఎంత కొత్తగా చెప్పార‌న్న అంశాన్ని బట్టే రిజల్ట్ ఆధారపడి ఉంటుంది. ద‌ర్శకుడు బాబీ ఆ విష‌యంలో ప‌క్కా ప్లాన్‌తో రంగంలోకి దిగిన‌ట్టు ఈ సినిమా రుజువు చేస్తుంది. స్టైలిష్‌గా క‌థానాయ‌కుడిని తెర‌పై ఆవిష్కరిస్తూ, విజువ‌ల్‌గా హాలీవుడ్ సినిమాల్ని గుర్తు చేస్తూ సినిమాని తెర‌కెక్కించారు. బాల‌కృష్ణ సినిమాల్లో ఇదివ‌రకు చూడ‌ని ఓ కొత్త నేప‌థ్యాన్ని ఇందులో ఆవిష్కరించారు. వీట‌న్నిటికీ తోడు బాల‌కృష్ణ మాస్ అంశాలు ఉండ‌నే ఉన్నాయి. దాంతో ఈ కథ తెలిసిందే అనిపించినా, తెర‌పై స‌న్నివేశాలు ఊహ‌కు త‌గ్గట్టే సాగుతున్నా… థియేట‌ర్‌లో ఉన్నంత‌సేపూ ఆ విష‌యాలేవీ గుర్తుకు రాకుండా ఓ కొత్త సినిమా చూస్తున్నామ‌నే అనుభూతి ప్రేక్ష‌కుడికి క‌లుగుతుంది. (Daku Maharaj Review in telugu)

హీరో ఎప్పుడూ చెడు మీద పోరాటం చేసి గెలుస్తాడు. అది పరమ రొటీన్‌ ఫార్మెట్‌ అయినా స్ర్కీన్‌ ప్లే, యాక్షన్‌ లో చూపించిన వైవిధ్యం ఈ చిత్రానికి కొత్త తరహా గ్లామర్‌ తీసుకొచ్చింది. కృష్ణమూర్తి కుటుంబం, పాప, ఎమ్మెల్యే త్రిమూర్తులు, అతడి తమ్ముడు ఈ మూడు పాత్రలు చుట్టూ తిరిగిన కథ కాస్త నెమ్మదిగా సాగుతాయి. నానాజీగా బాలయ్య ఎంట్రీతో సినిమా జెట్‌ స్పీడ్‌ అందుకుంటుంది. ఫస్టాఫ్‌ పాప ఎమోషన్‌ని ఎలివేట్‌ చేయడానికి చాలా సమయం తీసుకున్నారు. మరోవైపు స్పెషల్‌ ఆఫీసర్‌ స్టీఫెన్‌ రాజ్‌ (షైన్‌ టామ్‌ చాకో) డాకు గురించి చేసే అన్వేషణ డాకూ పాత్రపై ఆసక్తిని పెంచేలా ఉంటుంది. అక్కడ ఫైట్‌ సీక్వెన్స్‌ తర్వాత వచ్చే డబిడి దిబిడి సాంగ్‌ రాకతో థియేటర్‌ దద్దరిల్లింది. దర్శకుడు చెప్పినట్లుగా ఇంటర్వెల్‌ హైలెట్‌గా నిలిచింది. 15 నిమిషాల ఆ సీన్‌ అభిమానులకు పండగే. సెకండ్‌ హాఫ్‌లో హై అని చెప్పుకునే సన్నివేశాలు చాలానే ఉన్నాయి. కలెక్టర్‌ ప్యాలెస్‌ సీన్‌, విలన్‌ ఇంటి ముందు పోరాట ఘట్టాలు, ఇసుక తుఫాన్‌ బ్యాక్‌ డ్రాప్‌లో వచ్చే యాక్షన్‌ ఎపిసోడ్‌ ప్రత్యేకంగా నిలుస్తాయి. అయితే సెకెండాఫ్‌ ఎక్కువ శాతం విలన్‌ కథే నడుస్తుంది. సినిమాలో ఉన్న హై మోమెంట్స్‌ పక్కన పెడితే విలన్‌ సీన్స్‌ కాస్త బోర్‌ కొట్టిస్తాయి. హింసాత్మక సన్నివేశాలు ఎక్కువే ఉన్నాయి.

ఎవరెలా చేశారంటే…
బాలయ్యకు ఈ తరహా పాత్రలో కొట్టిన పిండి. దబిడిదిడిబే అనేలా లౌడ్‌ వాయిప్‌ లేకుండా స్మూత్‌గా బాలకృష్ణ పాత్రను తీర్చిదిద్దారు. బాలయ్య మాత్రం కొత్తగా కనిపించారు. అయితే మాస్‌ అంశాలను ఆకట్టుకోవడం బాలయ్య బలం. దాంతో పాటు భావోద్వేగ సన్నివేశాల్లో ఆయన పిండేస్తారు. కానీ ఈ సినిమాలో అది మిస్‌ అయింది. నీళ్లు అడిగిందన్న పాపానికి ఓ చిన్న పిల్లను, ఆ ఊరిని తగలబెట్టిన విలన్‌ గ్యాంగ్‌ ఇంటికి వెళ్లి ఊచ కోత కోసి, నందిని పాత్రధారి శ్రద్ధాతో పలికే సంభాషణల్లో బాలయ్య తరహా ఎమోషన్స్‌ మిస్‌ అయిన భావన కలిగింది. అక్కడక్కడా బాలయ్య తరహా పవర్‌ఫుల్‌ డైలాగ్‌లు వదిలి ఉంటే బావుండేది. ప్రగ్యా జైస్వాల్‌ పాత్ర ఓకే అనిపించింది. కలెక్టర్‌గా శ్రద్ధా శ్రీనాథ్‌ పాత్ర మంచి ప్రాధాన్యం ఉంది. నటన పరంగా కూడా ఆకట్టుకుంది. బాబీ డియోల్‌ ప్రజెన్స్‌ ఆకట్టుకుంది. ఊర్వశి రౌతేలా కాసేపు అలరించింది. దబడిదిబిడి పాటతో ఉర్రూతలూగించింది. మొత్తానికి సంక్రాంతి పండక్కి బాలయ్య తన అభిమానులకు డబుల్ బొనాంజా ఇచ్చాడనే చెప్పాలి.

‘డాకు మ‌హారాజ్‌’.. బాక్సాఫీస్‌ ‘ద‌బిడి దిబిడే’
3.5
Acting 4 out of 5
Direction 3 out of 5
Music 4 out of 5
Production 3 out of 5
Share This Article
Leave a review