‘ఘాటి’ రివ్యూ.. అనుష్క మెప్పించిందా?

Telugu BOX Office

చిత్రం: ఘాటి

నటీనటులు: అనుష్క, విక్రమ్‌ ప్రభు, చైతన్యరావు, జగపతిబాబు, జిషు సేన్‌ గుప్త, జాన్‌ విజయ్‌, రవీంద్ర విజయ్‌, వీవీటీ గణేశ్‌ తదితరులు

నిర్మాత: వై.రాజీవ్‌రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి

రచన: చింతికింది శ్రీనివాసరావు

దర్శకత్వం: క్రిష్‌ జాగర్లమూడి

విడుదల: 05-09-2025

అనుష్క నటించిన లేటెస్ట్ యాక్షన్ క్రైమ్ డ్రామా ‘ఘాటి’ (GHAATI). డైరెక్టర్ క్రిష్ తెరకెక్కించాడు. యూవీ క్రియేషన్స్ సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్మెంట్స్‌ బ్యానర్‌‌పై రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మించారు. పలుమార్లు వాయిదా పడుతూ వస్తున్న ఈ మూవీ, ఎట్టకేలకు ఇవాళ (సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 5న) విడుదలైంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ‘ఘాటి’ కథ.. ఆ ప్రపంచం సినీప్రియుల్ని మెప్పించిందా?.. లేదా?

ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లోని తూర్పు కనుమల్లో ఎత్తయిన పర్వతాల మధ్య ఓ కొండ నీడ మరో కొండపై పడే చోట నాలుగు రకాల గంజాయిలు పెరుగుతాయి. వాటిలో అత్యంత నాణ్యమైనది, ఖరీదైనది శీలావతి రకం. ఆ కనుమల్లో పండే ఈ గంజాయి పంటపై పూర్తి ఆధిపత్యం కాష్టాల నాయుడు (రవీంద్ర విజయ్‌), కుందుల నాయుడు (చైతన్య రావు) సోదరులదే. కనుమల్లో పండే గంజాయి పంటను ఘాటీ తెగ కూలీలు పోలీసుల కంట పడకుండా అక్రమంగా నాయుడు సోదరుల అడ్డాకు చేరవేస్తే దాన్ని వాళ్లు తమ బాస్‌ మహావీర్‌ (జిషు సేన్‌ గుప్తా)కు పంపుతారు. అతని కార్టెల్‌ దాన్ని దేశ విదేశాలకు అక్రమ మార్గాల్లో ఎగుమతి చేసి సొమ్ము చేసుకోవడం పరిపాటి. అయితే ప్రాణాలకు తెగించి గంజాయిని అక్రమ రవాణా చేసే ఘాటీలకు కష్టానికి తగ్గ ఫలితం, గౌరవం దక్కకపోవడంతో ఆ తెగకు చెందిన దేశీరాజు (విక్రమ్‌ ప్రభు) ఓ ఆలోచన చేస్తాడు. తన మరదలు షీలావతి (అనుష్క)తో పాటు తోటి ఘాటీలతో కలిసి ఓ కొత్త దందాకు తెర లేపుతాడు. గంజాయిని ద్రవరూపంలోకి మార్చి దేశ విదేశాలకు ఎగుమతి చేయడం మొదలు పెడతారు. అయితే ఈ విషయం నాయుడు సోదరులకు తెలియడంతో ఘాటీలను అంతమొందించేందుకు సిద్ధమవుతారు. మరి ఆ తర్వాత ఏమైంది? షీలావతికి జరిగిన అన్యాయమేంటి? నాయుడు సోదరులతో ఆమె ఎలాంటి యుద్ధం చేసింది? అన్నది మిగిలిన కథ.

మనిషి కథను మనసుకి హత్తుకునే చెప్పడంలో దిట్ట క్రిష్. ‘గమ్యం.. కంచె.. కృష్ణం వందే జగద్గురుం.. గౌతమిపుత్ర శాతకర్ణి.. ఆయన ప్రతి కథలోనూ మనిషి తాలూకా అంతర్మథనం ఆవిష్కృతం అవుతుంది. ఆయన మాటల్లో చెప్పాలంటే.. ‘గమ్యం’ ఒక వ్యక్తి కథ.. జీవితపు వ్యథ. ‘వేదం’ ఒక సమాజం కథ. ‘కృష్టం వందే జగద్గురుం’ అన్నం ముద్దలాంటి సమాజం మెతుకులుగా విడిపోకూడదని తీసిన కథ. ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ అన్ని యుద్ధాలనూ ఆపివేయటానికి ఒక యుద్ధం చాలని చెప్పే కథ. సమాజంలో ఉన్న సమస్యని వేలెత్తి చూపించడమే కాకుండా.. పరిష్కారం దశగా అడుగులు పడిన కథ ‘ఘాటి’. గంజాయి సరఫరా నేపథ్యంలో నేరస్తురాలిగా మారిన బాధితురాలి కథ ‘ఘాటి’.

తూర్పు కనుమలు.. అక్కడి కొండల మధ్య సాగే గంజాయి అక్రమ సాగు.. దాన్ని దందాగా చేసుకుని బతికే నాయుడు సోదరులు.. అతనిపైనున్న కార్పొరేట్‌ ముఠాను చూపిస్తూ కథను ప్రారంభించిన తీరు ఆసక్తిరేకెత్తిస్తుంది. ఆ తర్వాత ఘాటి తెగను తెరపైకి తెచ్చి వాళ్ల నేపథ్యాన్ని.. గంజాయి స్మగ్లింగ్‌లో వాళ్ల శక్తి సామర్థ్యాల్ని పరిచయం చేశారు అయితే నాయకానాయికల పాత్రలు తెరపైకి వచ్చిన తర్వాత నుంచి కథలో వేగం మందగిస్తుంది. దేశీరాజు – షీలావతిల కొత్త దందా బయట పడిన తర్వాత కథలో సంఘర్షణ మొదలవుతుంది. బాధితురాలిగా మారిన షీలావతి (Anushka Shetty) కత్తి చేతబట్టి ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధపడటం.. ఈ క్రమంలో నేరస్థురాలి నుంచి లెజెండ్‌గా ఎదగడం ద్వితీయార్ధానికి కీలకం. ఫస్టాఫ్ అంతా ఓ సామాన్య మహిళగా కనిపించిన కథానాయిక పాత్ర ద్వితీయార్ధంలో ఆరంభం నుంచే అమ్మోరులా విజృంభించడం ప్రేక్షకుల్లో ఓ జోష్‌ను నింపుతుంది. ఈ క్రమంలో గుహలో నాయుడు ముఠాతో జరిగే యాక్షన్‌ సీక్వెన్స్, బస్సులో పోలీసు తల తెగ నరికే ఎపిసోడ్‌ రోమాంచితంగా ఉంటాయి. కానీ, ఆ తర్వాత నుంచి షీలావతి చేసే పోరాటంలోని సంఘర్షణను ఉద్విగ్నభరితంగా కనిపించదు.

అనుష్క పూర్తి రా అండ్‌ రస్టిక్‌ లుక్‌లో అనుష్క ఆకట్టుకుంది. ఆమె ఇప్పటివరకూ ఈ తరహా పాత్రలో కనిపించలేదు. యాక్షన్‌ సన్నివేశాల్లోనూ అదరగొట్టింది. దేశీరాజు పాత్రకు విక్రమ్‌ ప్రభు న్యాయం చేసే ప్రయత్నం చేశారు. కుందుల నాయుడుగా చైతన్యరావు విలనిజం ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరుస్తుంది. ఇకపై ఆయన్ని ఇలాంటి విలన్‌ పాత్రల్లో తరచూ చూసే అవకాశముంది. కాష్టాల నాయుడుగా రవీంద్ర విజయ్‌ ఫర్వాలేదు. జగపతిబాబు, వీటీవీ గణేశ్, జిషు సేన్‌ గుప్తా, రాజు సుందరం పాత్రలు పరిధి మేరకు ఉంటాయి.

‘ఘాటి’ అనే పేరు వినగానే.. ఏంటీ? అనే ప్రశ్న రాకమానదు. ఎందుకంటే ఘాటి అనేది వాడుక భాష కాదు కాబట్టి. ఘాటి అనేది ‘ఘట్ట’ అనే సంస్కృత పదం నుంచి పుట్టింది. కొండల మధ్య ఉండే లోతైన దారి, లోయ అని అర్థం. ఆంధ్రా- ఒడిశా సరిహద్దు కొండల్లో జరిగే ఘాటీల కథ ఇది. ఘాటి కొండల అంచుల్లో కొన్ని గ్రామాలు నివసించేవారు వారినే ఘాటీలని పిలుస్తారు. అక్కడ ‘శీలావతి’ అనే అరుదైన గంజాయి పండుతుంది. దానికి ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఉంటుంది. గుట్టుగా వేలకోట్ల రూపాయిల గంజాయి బిజినెస్ జరుగుతుంది. వీటిని ఘాటీలు సరఫరా చేసేవారు. ఆ ఎత్తైన కొండల్ని ఘాటీలు మాత్రమే సునాయాసంగా ఎక్కగలుగుతారు. ఒక్కొక్కరు వంద నుంచి నూటయాభై కేజీలున్న గంజాయిని భుజంపై మోస్తుంటారు. గంజాయి సరఫరా చేసే ఘాటీల నేపథ్యంలోని కథ కాబట్టి.. ఈ చిత్రానికి ‘ఘాటి’ అని పేరు పెట్టారు.

Share This Article
Leave a Comment