ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా బుధవారం నారా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ మేరకు మంగళవారం విజయవాడలోని ఏ కన్వెన్షన్ హాల్‌లో జరిగిన ఎన్డీయే శాసనసభాపక్ష సమావేశంలో ఆయన్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అయితే ఈ సమావేశానికి చంద్రబాబు వస్తుండగా ఆయన్ని చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున రోడ్ల మీదకు వచ్చారు. టీడీపీ కార్యకర్తలు, అభిమానులు దారి పొడవునా ఘనంగా స్వాగతం పలికారు. సమావేశం అనంతరం చంద్రబాబు ఉండవల్లిలోని నివాసానికి బయల్దేరి వెళ్తుండగా ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. బాబు కాన్వాయ్ వెంట ఓ మహిళ పరుగులు తీయగా… ఏం జరుగుతుందో తెలియక సెక్యూరిటీ సిబ్బంది కంగారుపడ్డారు.
ఆ మహిళను కారులో నుంచి గమనించిన చంద్రబాబు వెంటనే కాన్వాయ్‌ను ఆపారు. ఆమెను దగ్గరికి పిలిచి ఆప్యాయంగా పలకరించారు. తన పేరు నందిని అని.. మదనపల్లి నుంచి మిమ్మల్ని చూడటానికి ఇంతదూరం వచ్చానంటూ ఆమె చంద్రబాబుకు చెప్పింది. ఆమె అభిమానానికి ముగ్ధుడైన చంద్రబాబు సెక్యూరిటీని వారించి ఆమెతో ముచ్చటించారు.
మా కష్టం.. కోరిక ఫలించి ‘మీరు సీఎం అయ్యారు సార్’ అంటూ సంబరపడిపోయిన ఆమె ‘మీ కాళ్లు మొక్కుతాను’ అని అడగ్గా.. వద్దంటూ చంద్రబాబు సున్నితంగా వారించారు. ఆమెను ఆప్యాయంగా పలకరించి ఫోటో దిగారు. 104 డిగ్రీల జ్వరంతో ఉన్నప్పటికీ మిమ్మల్ని చూడటానికి వచ్చానని నందిని చెప్పగా.. ముందు ఆస్పత్రికి వెళ్లమ్మా అని జాగ్రత్తలు చెప్పారు. ఆమె ఎక్కడ ఉంటారో తెలుసుకుని.. అవసరమైన వైద్యం సాయం చేయాలని పార్టీ నేతలకు చంద్రబాబు సూచించారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవతున్నాయి.