ఐదేళ్ల కాలం గిర్రున తిరిగింది. చంద్రబాబునాయుడు తిరిగి ముఖ్యమంత్రి పదవిని చేపట్టడానికి సిద్ధమవుతున్నారు. చంద్రబాబుతో సహా అన్ని రాజకీయ పక్షాల నాయకులు ఊహించని రీతిలో కూటమికి ఘన విజయం దక్కింది. ఇక అధికారికంగా విజేతలందరినీ ప్రకటించడమే తరువాయి. అయితే చంద్రబాబునాయుడి విజయానికి దోహదం చేసిన అంశాలేవి? అనే ప్రశ్నకు తెరలేచింది.
2019లో వైసీపీలో చేతిలో టీడీపీ ఘోర పరాజయం పొందింది. ఆ ఎన్నికల్లో టీడీపీ కేవలం 23 అసెంబ్లీ, 3 లోక్‌సభ స్థానాలకు మాత్రమే పరిమితం అయ్యింది. పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలని సుదీర్ఘ రాజకీయ అనుభవశాలి అయిన చంద్రబాబునాయుడు భావించారు. తన ఓటమికి కారణాల్ని విశ్లేషించుకున్నారు. పంతాలు, పట్టింపులకు వెళ్లకూడదని ఆయన గట్టిగా నిర్ణయించుకున్నారు. ఓటమిలో కుంగిపోకుండా సహనంతో ఎదురు చూడడం, అలాగే అందరినీ కలుపుకెళ్లాలన్న వ్యూహం… తిరిగి ఆయన్ను విజేతగా నిలబెట్టాయి. 2019లో తన ఘోర పరాజయానికి కారణమైన జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్, అలాగే బీజేపీతోనూ మళ్లీ స్నేహం చేయడానికి ఆయన ఏ మాత్రం సంకోచించలేదు.
గతంలో టీడీపీ నష్టపోవడానికి జనసేన ఒంటరిగా పోటీ చేయడం, అలాగే కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీ తన చేతల్లోని వ్యవస్థల్ని ప్రయోగించం ప్రధాన కారణమని బాబు గుర్తించారు. అందుకే ముందుగా ఆ రెండు పార్టీలతో వైరానికి బదులు, పొత్తు పెట్టుకుంటేనే మళ్లీ పూర్వ వైభవాన్ని దక్కించుకోవచ్చని బాబు ఆలోచించారు. అందుకు తగ్గట్టుగా బాబు వ్యూహాత్మకంగా వ్యవహరించారు.
మరోవైపు జనసేన ఒంటరిగా పోటీ చేయడం వల్ల తాను ఎంతోకొంత లబ్ధి పొందానని వైఎస్ జగన్ గుర్తించినా, పవన్‌కల్యాణ్‌ను ఖాతరు చేయలేదు. పవన్‌తో జగన్‌కు వ్యక్తిగత లేదా రాజకీయ వైరం లేకుంటే, జనసేన ఒంటరిగా పోటీ చేసేది. కానీ జనసేనను వైసీపీ టార్గెట్ చేయడంతో రాజకీయంగా తన ఉనికి చాటుకునేందుకు కేంద్రంలోని బీజేపీతో పవన్ పొత్తు పెట్టుకున్నారు. అంతటితో ఆగకుండా ఎన్నికల సమయానికి టీడీపీతో బీజేపీ జత కట్టేలా చేయడంలో పవన్‌కల్యాణ్ కీలక పాత్ర పోషించారు.
అలాగే పవన్‌తో చంద్రబాబు ఎంతో సన్నిహితంగా మెలిగారు. పవన్‌కు చంద్రబాబు విలువ, గౌరవం ఇస్తున్నారని జనసేన కార్యకర్తలు, అలాగే పవర్‌స్టార్ అభిమానులు అనుకునేలా టీడీపీ అధ్యక్షుడు నడుచుకున్నారు. దీంతో టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య ఓట్ల బదిలీ సాఫీగా సాగినట్టు… ఎన్నికల ఫలితాలు చెబుతున్నాయి.
అలాగే సూపర్ సిక్స్ పేరుతో జగన్‌కు మించి సంక్షేమ పథకాలను అందిస్తానని చంద్రబాబు చెప్పారు. అమ్మకు వందనం పేరుతో విద్యార్థులకు ఏడాదికి రూ.15 వేలు చొప్పున ఇంట్లో ఎంత మంది చదువుకుంటే, అంతమందికి పథకం అమలు చేస్తానని చంద్రబాబు చెప్పారు. అలాగే వృద్ధులకు రూ.4 వేలు పింఛన్, మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం, ఏడాదికి మూడు సిలిండర్ల చొప్పున అందజేస్తామని బాబు హామీలిచ్చారు.
అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై కూటమి నేతలు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. భూములు లాక్కోడానికే జగన్ ఈ చట్టం తీసుకొచ్చారని చంద్రబాబు, పవన్‌కల్యాణ్ విస్తృతంగా ప్రచారం చేశారు. కూటమి మేనిఫెస్టో ఆకర్షణీయంగా వుంటే, జగన్ మాత్రం ఏమీ చెప్పకుండా, పాత పథకాలే కొనసాగిస్తానని హామీ ఇచ్చారు. దీంతో జగన్ గత ఐదేళ్లలో ఇచ్చిన సంక్షేమ పథకాల కంటే, చంద్రబాబు ఇస్తామన్న హామీలే బాగా పని చేశాయి.
చంద్రబాబునాయుడు, నారా లోకేశ్ తన పార్టీ కార్యకర్తలు, నాయకులకు నిత్యం అందుబాటులో వుంటూ, ఈ దఫా తప్పనిసరిగా గెలవాలన్న కసి, పట్టుదల పెంచారు. జగన్‌పై వ్యతిరేకతను సృష్టించడానికి కలిసొచ్చే ప్రతి అవకాశాన్ని చంద్రబాబు ఉపయోగించుకున్నారు. సీట్ల పంపిణీలో పట్టింపులకు వెళ్లకుండా చంద్రబాబు తాను తగ్గి, కూటమిని గెలిపించడానికి ప్రాధాన్యం ఇచ్చారు. ఏపీలో అరశాతం ఓటు బ్యాంక్ ఉన్న బీజేపీకి 10 అసెంబ్లీ, 6 లోక్‌సభ స్థానాలను ఇవ్వడానికి చంద్రబాబు ముందుకు రావడమే ఇందుకు నిదర్శనం. ఇందుకు తగ్గ ఫలితాన్ని చంద్రబాబు పొందారు. వ్యవస్థల సహకారం పూర్తిస్థాయిలో కూటమికి అందింది.
అలాగే తన భార్యను అసెంబ్లీ వేదికగా అవమానించారని, తిరిగి ముఖ్యమంత్రి హోదాలోనే కౌరవ సభలో అడుగు పెడతానని చంద్రబాబు శపథం చేసి.. మరీ అసెంబ్లీని బహిష్కరించారు. మీడియా సమావేశంలో చంద్రబాబు కన్నీళ్ల పర్యంతం కావడం తటస్థులను ఆలోచింపజేసింది. స్కిల్ స్కామ్‌లో జైలుకు వెళ్లారు. 50 రోజుల పాటు జైల్లో గడపాల్సి వచ్చినా, ఎక్కడా నిరుత్సాహానికి గురి కాలేదు. ఈ పరిణామాలన్నీ టీడీపీని గెలిపించుకోవాలన్న పట్టుదలను ఆ పార్టీ శ్రేణుల్లో పెంచాయి.
ఏపీలో ఎవరికైనా వైసీపీ ప్రభుత్వం వల్ల నష్టం జరిగితే స్వయంగా ఆయనే స్పందించే వారు. దీంతో చంద్రబాబు ప్రజలకు దగ్గరివాడయ్యారు. మరోవైపు జగన్ తాడేపల్లి నివాసానికే పరిమితం కావడం చంద్రబాబుకు కలిసొచ్చింది. వైసీపీ లేదా ప్రభుత్వానికి సంబంధించి ఏ అంశమైనా సజ్జల రామకృష్ణారెడ్డే మీడియాతో మాట్లాడేవారు. జగన్ ఏనాడూ మీడియాతో మాట్లాడిన దాఖలాలు లేవు. చివరికి చంద్రబాబునాయుడు తన ప్రధాన ప్రత్యర్థి జగన్ కుటుంబ సభ్యులతోనూ స్నేహంగా మెలిగారు. ఇవన్నీ ప్రజానీకం దృష్టిలో చంద్రబాబు దగ్గరి మనిషిని చేశాయి. జగన్ రోజురోజుకూ అందరికీ దూరమవుతూ వచ్చారు. ఆ దూరమే చివరికి ఆయన్ను అధికారానికి దూరం చేసింది. ఆ దగ్గరితనమే బాబును చివరికి అధికారానికి చేరువ చేసింది.