రాష్ట్రాన్ని మాఫియాల రాజ్యంగా మార్చేశారని వైకాపా ప్రభుత్వంపై తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ఇష్టానుసారం జే బ్రాండ్లు పెట్టి రాష్ట్రాన్ని అతలాకుతలం చేశారని, 30వేల మంది ఆడబిడ్డల తాళిబొట్లు తెంచారని ఆవేదన వ్యక్తంచేశారు. దుర్మార్గ పాలనను తుదముట్టించి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందామని ప్రజలకు పిలుపునిచ్చారు. బాపట్ల జిల్లా చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో చంద్రబాబు ప్రసంగించారు.
‘‘రాష్ట్రాన్ని జగన్ నియంతలా పాలించాలనుకున్నారు. విధ్వంసం చేయడమే ఆయన స్వభావం. అప్పులు వచ్చే పరిస్థితి లేదు.. ఆదాయం తగ్గింది. జీతాలు ఇవ్వలేరు. భవన నిర్మాణ కార్మికులు పని దొరక్క ఆత్మహత్యలు చేసుకున్నారు. టీచర్లను మద్యం దుకాణాల వద్ద కాపలా పెట్టారు. స్కూళ్లకు రంగులు వేస్తే.. పిల్లలకు చదువు వస్తుందా? రూ.పది ఇచ్చి రూ.వంద దోచేస్తుంటే ప్రజల జీవితాల్లో మార్పు వస్తుందా? ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకొచ్చి.. ఆస్తులను బలవంతంగా రాసుకున్నారు. ప్రజల భూములపై జగన్ పెత్తనం ఏంటి? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు దస్త్రంపైనే రెండో సంతకం చేస్తా. మళ్లీ చంద్రన్న బీమా అమలుచేస్తాం. సహజంగా మారణిస్తే రూ.5 లక్షలు, ప్రమాదంలో చనిపోతే రూ.10 లక్షల బీమా కుటుంబానికి అందజేస్తాం. ప్రతీ కుటుంబానికి ఆరోగ్య బీమా కల్పిస్తాం. అందరికీ డిజిటల్ హెల్త్‌కార్డులు జారీ చేస్తాం. మండల కేంద్రాల్లో జనరిక్ మెడికల్ షాపులు ఏర్పాటుచేసి బీపీ, షుగర్ ఉన్నవారికి ఉచితంగా మందులు అందజేస్తాం’ అని చంద్రబాబు హామీ ఇచ్చారు.