ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒంగోలు ఒకటి. రాష్ట్రవ్యాప్తంగా కీలకంగా ఉండే స్థానాల్లో ఒంగోలు కూడా ఒకటి కావడంతో అక్కడ గెలుపును రాజకీయ పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటుంటాయి. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో గత మూడు ఎన్నికల నుంచి ఇద్దరు ప్రత్యర్థులే తలపడుతున్నారు. వారే వైసీపీ సీనియర్ నాయకుడు. సిట్టింగ్ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ రావు. 2022 ఉపఎన్నికల్లో దామచర్లపై బాలినేని గెలవగా.. 2014లో బాలినేనిపై జనార్దన్ విజయం సాధించారు. 2019లో దామచర్ల జనార్దన్‌పై బాలినేని శ్రీనివాసరెడ్డి గెలుపొందారు.
దామచర్ల జనార్థనరావు… తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు. 1975 జనవరి 20న ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెం గ్రామంలో జన్మించిన ఆయన గుంటూరులోని విజ్ఞాన్ పబ్లిక్ స్కూల్లో పదో తరగతి, విజ్ఞాన్ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్, బెంగళూరులోని PESIT కాలేజీలో ఇంజినీరింగ్ పూర్తిచేశారు.
తెలుగుదేశం పార్టీలో చేరికతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన దామచర్ల జనార్దన్.. 2009లో టీడీపీ నుంచి కొండెపి నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఆశించారు. అయితే ఆ స్థానం ఎస్సీకి రిజర్వ్ కావడంతో ఆ ఎన్నికల్లో పోటీ చేయడం కుదరలేదు. 2010లో అధిష్థానం ఆయన్ని ప్రకాశం జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా నియమించింది. 2012లో కాంగ్రెస్ పార్టీతో పాటు ఎమ్మెల్యే పదవికి బాలినేని శ్రీనివాసరెడ్డి రాజీనామా చేయడంతో ఉపఎన్నిక అనివార్యమైంది. ఆ ఎన్నికల్లో టీడీపీ నుంచి ఒంగోలులో పోటీ చేసిన దామచర్ల జనార్దన్… వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు.
రాష్ట్ర విభజన తర్వాత 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి పోటీచేసి బాలినేనిపైనే 12,428 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2019 శాసనసభ ఎన్నికలలో తన ప్రత్యర్థి బాలినేని శ్రీనివాస రెడ్డి చేతిలో ఓడిపోయారు. తాజా ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి వైసీపీ నుంచి బాలినేని, టీడీపీ నుంచి జనార్ధన్ బరిలో ఉన్నారు. అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో ఉన్న వ్యతిరేకత, కూటమిపై ప్రజల్లో ఉన్న బలమైన నమ్మకమే తనను గెలిపిస్తుందని దామచర్ల జనార్ధన్ నమ్మకంతో ఉన్నారు.
విజయమే లక్ష్యంగా దూసుకుపోతోన్న దామచర్ల జనార్ధన్ ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తూ కేడర్‌లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. ఎన్నికల ప్రచారంలో ప్రతి ఒక్కరినీ పలకరిస్తూ టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధి, ఈ ఐదేళ్లలో వైసీపీ పాలనలో కొనసాగిన అరాచకాన్ని ప్రజలకు వివరిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారంటోన్న ఆయన… బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం ఆవిర్భవించిన తెలుగదేశం పార్టీ అందరికీ మేలు జరిగేలా పాలన సాగిస్తుందని హామీ ఇస్తున్నారు. గడిచిన ఐదేళ్ళలో అన్ని వర్గాల ప్రజలు అగచాట్లు పడ్డారని… సైకో పాలనలో సమస్యలు తప్ప అభివృద్ధి శూన్యమని మండిపడుతున్నారు. వైసీపీ హయాంలో ఒంగోలులో ఒక్క అభివృద్ధి పనికూడా జరగలేదని ప్రజలకు అర్ధమయ్యేలా వివరిస్తున్నారు.
ప్రకాశం పంతులు పోటీ చేసిన నియోజకవర్గం
తెలుగు రాష్ట్రాల్లో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శాసనసభ్యునిగా గెలుపొందిన టంగుటూరి ప్రకాశం పంతులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా పనిచేశారు. 1955లో ద్విసభ్య శాసనసభ్యులు కొనసాగగా ఆ సమయంలో టంగుటూరు ప్రకాశం పంతులు సీపీఐ అభ్యర్థి ఎం. నారాయణస్వామిపై విజయం సాధించారు. 1953 అక్టోబరు 1 నుంచి 1954 నవంబరు 15వ తేదీ వరకు ప్రకాశం పంతులు ముఖ్యమంత్రిగా పనిచేశారు. జిల్లా వాసైన ప్రకాశం పంతులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా ఒక ఏడాది 45 రోజుల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసి ఒంగోలుకు ప్రత్యేక గుర్తింపు తెచ్చారు.