టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ భారీ విజయం సాధించారు. తన తండ్రి, పార్టీ అధినేత చంద్రబాబుకు ఇచ్చిన మాటను నారా లోకేశ్ నిలబెట్టుకున్నారు. గతంలో టీడీపీ గెలవని మంగళగిరి స్థానం నుంచి పోటీ చేసి మరీ విజయం సాధించారు. 39 ఏళ్ల తర్వాత అక్కడ పసుపు జెండాను ఎగురవేశారు. 1985లో టీడీపీ తరఫున కోటేశ్వరరావు గెలిచారు. ఇప్పటివరకు ఆ నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీ 17,265 మాత్రమే. ఆ రికార్డును లోకేశ్ తిరగరాస్తూ.. వైకాపా అభ్యర్థి ఎం. లావణ్యపై.. 91 వేలకుపైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో నారా లోకేష్‌దే అత్యధిక మెజార్టీ కావడం విశేషం. ఎమ్మెల్యేగా గెలవలేనోడు అంటూ ప్రత్యర్థి పార్టీల నుంచి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న లోకేష్ పోగొట్టుకున్న చోటే గట్టిగా నిలబడి భారీ మెజార్టీతో విజయం సాధించడం ఆయన పట్టుదలకు నిదర్శనం.
అయితే నారా లోకేష్‌కు ఈ విజయం అంత సులభంగా లభించలేదు. 2019లో ఓడిపోయిన తర్వాత ఈ ఐదేళ్లు ఎంతో కష్టపడ్డారు. ఓడిపోయాను కదాని మంగళగిరి నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేయలేదు. అధికార పార్టీ ఎమ్మెల్యే కంటే ఎక్కువగా ప్రజలను పట్టించుకుని వారి బాగోగులు చూశారు. అన్ని వర్గాలను పలకరిస్తూ ఏ చిన్న సమస్య ఉన్నా తన దగ్గరకి వస్తే పరిష్కరిస్తారన్న నమ్మకాన్ని కలిగించారు. లోకేష్‌ను ఓడించేందుకు వైసీపీ ఎన్ని కుట్రలు, కుయుక్తులు చేసినా ప్రజల ఆదరణ ముందు అవన్నీ పనిచేయలేదు. 2019లో 5వేలు పైచిలుకు ఓట్ల తేడాతో ఓడిపోయిన లోకేష్ ఇప్పుడు ఏకంగా 91వేల ఓట్లకు పైగా గెలుపొందడం ఓ రికార్డనే చెప్పాలి.