Kuppamలో మళ్లీ చంద్రబాబుకే మళ్లీ పట్టం!

Telugu BOX Office

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఒక మూలకు విసిరినట్లు ఉండే కుప్పం.. ఒకప్పుడు నియోజకవర్గ కేంద్రమే. 1989 నుంచి ఏడుసార్లు చంద్రబాబు ఇక్కడ విజయం సాధించి, కంచుకోటగా మార్చుకున్నారు. ఆయన సీఎం అయ్యాకే నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపు వచ్చింది. కుప్పం నుంచి వచ్చామంటే ఎక్కడైనా ఆదరంగా చూస్తారనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. చంద్రబాబు నామినేషన్‌ వ్యవహారాల్ని టీడీపీ నేతలే చూసుకుంటారు. డిపాజిట్‌ సొమ్ము సైతం నియోజకవర్గంలోని ఓటర్లే ఇచ్చి తమ అభిమానాన్ని చూపిస్తారు.

కుప్పం నుంచి చంద్రబాబు వరుసగా ఎనిమిదోసారి పోటీ చేస్తున్నారు. ఎన్నికలు వచ్చాయంటే కుప్పంలో చంద్రబాబు గెలుపుపై కాకుండా.. మెజారిటీపైనే చర్చలు సాగుతాయి. 1999లో 65,687 ఓట్లతో గెలుపొందగా.. 2004లో 59,588, 2009లో 46,066, 2014లో 47,121 ఓట్ల ఆధిక్యంతో సునాయాసంగా టీడీపీ జెండా ఎగరవేశారు. 2019లో 30,722 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈసారి వైసీపీ పక్షాన ఎమ్మెల్సీ భరత్‌ పోటీలో ఉన్నారు. గత ఎన్నికల్లో భరత్‌ తండ్రి చంద్రమౌళి… చంద్రబాబు మీద పోటీచేసి ఓటమిపాలవ్వగా.. ఈ సారి కుమారుణ్ని ఓడించాలని టీడీపీ వర్గాలు ఉవ్విళ్లూరుతున్నాయి.


కుప్పం నియోజకవర్గంలో గురుకులాలు, ప్రభుత్వ జూనియర్‌, డిగ్రీ కళాశాలలే కాదు… ఇంజినీరింగ్‌, వైద్య కళాశాలలు కూడా ఏర్పాటయ్యేలా చంద్రబాబు కృషిచేశారు. ద్రవిడ విశ్వవిద్యాలయాన్ని సైతం ఇక్కడే నెలకొల్పడం విశేషం. ఊరూరికీ తారు రోడ్లు, అంతర్గత సిమెంటు రోడ్లు కొన్నేళ్ల క్రితమే వచ్చేశాయి. ఇక్కడ పండని పంటలు లేవు. కోనసీమ తరహాలో కొబ్బరి చెట్లూ కనిపిస్తుంటాయి. రాయలసీమలో కోనసీమ అన్నట్లు కుప్పం నియోజకవర్గంలోని పల్లెలు పచ్చని పంట పొలాలతో కనువిందు చేస్తుంటాయి.


నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ఇంటింటికీ శుద్ధజలం ఇవ్వాలని ఎన్టీఆర్‌ ట్రస్టు ద్వారా సుజల అనే పథకానికి పదేళ్ల క్రితమే టీడీపీ శ్రీకారం చుట్టింది. ఆర్‌ఓ ప్లాంట్ల ద్వారా 20 లీటర్ల లీటిని రూ.2కే సరఫరా చేశారు. 2019లో జగన్‌ సీఎం కావడంతోనే నీటి క్యాన్ల ధరను రూ.5కు పెంచారు. ఎన్టీఆర్‌ బొమ్మ స్థానంలో పెద్దిరెడ్డి, జగన్‌ బొమ్మలు వేశారు. అందుకు అయిన ఖర్చునూ పంచాయతీల నుంచి రాబట్టారు. కొద్ది నెలలకే పూర్తిగా పంపిణీని నిలిపివేశారు. ఫలితంగా ఊరూరా నిర్మించిన ట్యాంకులు, ప్లాంట్లు వృథాగా ఉన్నాయి. ప్రజలు ప్రైవేటు వ్యాపారుల నుంచి నీళ్లు కొంటున్నారు. ఈసారి చంద్రబాబును ఓడించాలని వైఎస్ జగన్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా కుప్పం ప్రజలు మాత్రం తమ ఓటు చంద్రబాబుకేనని తేల్చి చెప్పేస్తున్నారు. భరత్‌ని గెలిపిస్తే మంత్రిని చేస్తానని జగన్ హామీ ఇవ్వగా.. మా బాబుగారు గెలిస్తే ఏకంగా ముఖ్యమంత్రే అవుతారు.. మీ మంత్రి పదవి మాకెందుకంటూ పలువురు ఎద్దేవా చేస్తున్నారు.

Share This Article
Leave a comment