ఓటరు ఐడీ కార్డు లేకపోయినా ఓటు వేయొచ్చు.. ఎలాగంటే!

Telugu BOX Office

ప్రజాస్వామ్యంలో ఓటు ఒక పదునైన ఆయుధం. ఇంటి పెద్ద సరిగా లేకుంటే, ఆ కుటుంబం మనుగడ, పరిస్థితి అధ్వాన్నమవుతుంది. మరి మీ నియోజకవర్గానికి ప్రతినిధి సరిగా లేకుంటే.. లక్షలాది మంది భవిష్యత్తుపై ప్రభావం పడుతుంది. వచ్చే ఐదేళ్లకు గాను మిమ్మల్ని పాలించేందుకు సరైన నాయకుడిని ఎన్నుకోవాలంటే.. మీరు ఓటేయాలి. సరైన అభ్యర్థిని ఎమ్మెల్యేగా, ఎంపీగా గెలిపించుకోవాలి. సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు లక్షలాది మంది.. ఇతర ప్రాంతాల నుంచి తమ సొంతూళ్లకు చేరుకున్నారు. వీరిలో కొంత మంది తమ ఓటరు కార్డులను మర్చిపోయి ఉండవచ్చు. మరి కొంత మందికి తమ ఓటరు కార్డులను ఎక్కడ భద్రపరిచామో గుర్తురాకపోవచ్చు. ఇంకొంత మందికి ఓటర్ లిస్ట్‌లో పేరు వచ్చినా.. ఓటర్ ఐడీ కార్డు జారీ అయుండకపోవచ్చు. ఓటరు కార్డు లేదనో, మరేదైనా కారణం వల్లో ఓటు వేయడం మాత్రం మానుకోవద్దు. ఓటర్ కార్డు లేకున్నా ఓటు వేయొచ్చు. 12 రకాల ఐడెంటిటీ కార్డుల్లో ఏదో ఒకటి చూపించి, ఓటు వేసేందుకు భారత ఎన్నికల సంఘం అవకాశం కల్పిస్తోంది.

ఆధార్ కార్డు చూపించి ఓటెయ్యొచ్చు.
డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డులు చూపించి కూడా ఓటెయ్యుచ్చు. అయితే, వాటిపై ఫోటో ఉండాలి.
భారత ప్రభుత్వం జారీ చేసిన పాస్‌పోర్టు చూపించి ఓటెయ్యొచ్చు.
ఇక మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం జాబ్ కార్డు చూపించి కూడా ఓటు వేయొచ్చు.
ఏదైనా బ్యాంకు గానీ, పోస్టాఫీస్ గానీ జారీ చేసిన పాస్‌బుక్ చూపించి కూడా ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. ఆ పాస్‌బుక్‌పై అభ్యర్థి ఫోటో తప్పనిసరిగా ఉండాలి.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ ఎంప్లాయీస్ ఐడీ కార్డులు చూపించి ఓటెయ్యుచ్చు.
దివ్యాంగులకు కేంద్ర సామాజిక న్యాయ, సాధికారిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఐడీ కార్డుల్లో ఏదో ఒకటి ఎన్నికల అధికారులకు చూపించి ఓటు హక్కును వినియోగించుకోవచ్చు.
ఫోటోగ్రాఫ్‌తో కూడిన పెన్షన్ డాక్యుమెంట్ చూపించి ఓటెయ్యుచ్చు.

కేంద్ర కార్మిక శాఖ జారీ చేసిన హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డును చూపించి కూడా ఓటెయ్యొచ్చు.
నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ (జాతీయ పౌర పట్టిక) కింద రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సెస్ కమిషనర్ ఆఫ్ ఇండియా జారీ చేసిన స్మార్ట్ కార్డు చూపించి ఓటెయ్యొచ్చు.
ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు ఇచ్చిన అధికారిక గుర్తింపు కార్డులు చూపించి ఓటెయ్యొచ్చు.

ఓటర్ హెల్ప్‌లైన్ నంబర్ 1950కు ఫోన్ చేసి మన పేరు ఓటర్ లిస్ట్‌లో ఉందో, లేదో తెలుసుకోవచ్చు. ముందుగా ఓటర్ లిస్ట్‌లో పేరు ఉందా, లేదా చెక్ చేసుకోవాలి. ఓటర్ లిస్టులో పేరుంటే, పోలింగ్ కేంద్రానికి వెళ్లి.. అక్కడి అధికారులకు ఇప్పటివరకూ పేర్కొన్న ఐడీ కార్డు్ల్లో ఏది ఉన్నా.. చూపించి, వారి అనుమతితో ఓటు వేయవచ్చు. ఇంకేం.. ఓటేద్దాం పదండి మరి..!

Share This Article
Leave a comment