ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ కూటమి కనీవినీ ఎరుగని అఖండ విజయాన్ని అందుకుంది. 151 సీట్లున్న వైసీపీని 11 స్థానాలకే పరిమితం చేసి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసింది. నేను మంచి చేశానని అనుకుంటేనే ఓేటయాలంటూ పిలుపునిచ్చిన జగన్‌ని ఏపీ ఓటర్లు తిరస్కరించాడు. పెరిగిన ఓటింగ్ శాతం తమకే అనుకూలమని వైసీపీ నేతలు ఎంత చెప్పుకున్నా ఫలితాలు మాత్రం ఆ పార్టీకి మింగుడు పడటం లేదు.
మరోవైపు ఈ ఎన్నికల్లో కూటమి నేతలు సాదాసీదాగా కాకుండా భారీ మెజార్టీతో గెలవడం రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. వీళ్లేం గెలుస్తారు అనుకున్న అభ్యర్థులు సైతం 50వేలకు పైగా మెజార్టీతో గెలిచి కాలరెగరేశారు. అయితే అసలు 175 నియోజకవర్గాల్లో అత్యధిక మెజార్టీ ఎవరికి వచ్చిందా? అని నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఆ ఘనత దక్కించుకుంది గాజువాక నుంచి పోటీచేసిన టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు. వైసీపీ అభ్యర్థి, ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్పై ఆయన 95,235 ఓట్ల మెజార్టీతో భారీ విజయం దక్కించుకున్నారు. అర్ధం పర్థం లేని మాటలతో సోషల్‌మీడియాలో తరుచూ ట్రోలింగ్‌కు గురయ్యే అమర్నాథ్… ఇప్పుడు ఎన్నికల్లోనూ ఘోరంగా ఓడిపోయి పరువు పోగొట్టుకున్నారు.
పల్లా రాజేశ్వరరావు తర్వాత అత్యధిక మెజార్టీ భీమిలి టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావుది. వైసీపీ అభ్యర్థి అవంతి శ్రీనివాసరావుపై గంటా 92,401 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ ఎన్నికల ముందుకు వరకు ఇద్దరు నేతలు ఓటమిని ఎరుగరు. దీంతో ఈ ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. అయితే వార్ వన్‌సైడ్‌గా మార్చేసిన గంటా శ్రీనివాసరావు భారీ మెజార్టీతో సత్తా చాటారు. ఇక మంగళగిరి నుంచి పోటీ చేసిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తన సమీప ప్రత్యర్థి మురుగుడు లావణ్యపై 91,413 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీచేసి కేవలం 5వేల ఓట్ల తేడాతో ఓడిపోయిన లోకేష్ మళ్లీ అక్కడే తిరుగులేని మెజార్టీతో విజయం సాధించి తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు.
వీరి తర్వాత పెందుర్తి నుంచి జనసేన నుంచి పోటీ చేసిన పంచకర్ల రమేష్ 81,870 ఓట్లు, నెల్లూరు అర్బన్ టీడీపీ అభ్యర్థి నారాయణ 72,489 ఓట్లు, తణుకు టీడీపీ అభ్యర్థి రాధాకృష్ణ 72,121 ఓట్లు, కాకినాడ రూరల్ జనసేన అభ్యర్థి పంతం నానాజీ 72,040 ఓట్లు, రాజమండ్రి అర్బన్ టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ 71,404 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక పిఠాపురం నుంచి పోటీచేసిన జనసేనానికి పవన్ కళ్యాణ్ వీరందరి తర్వాత 70,279 ఓట్ల మెజార్టీతో గెలుపొందడం విశేషం.