ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు నాలుగోసారి ప్రమాణం చేశారు. ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ చంద్రబాబుతో ప్రమాణం చేయించారు. అనంతరం పవన్ కల్యాణ్, నారా లోకేష్ ప్రమాణం చేశారు. ఆతర్వాత మిగతా మంత్రులతో గవర్నర్ ప్రమాణం చేయించారు. గన్నవరం ఎయిర్‌పోర్టు సమీపంలో ఉన్న కేసరపల్లిలోని ఐటీ పార్క్‌లో ఈ ప్రమాణస్వీకార మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఎన్డీఏ నేతలు, కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. వీవీఐపీలు, వీఐపీలతోపాటు నేతలు, ప్రజల కోసం 36 గ్యాలరీలు సిద్ధం చేశారు. అలాగే 7 వేల మంది పోలీసులతో భారీభద్రతను కూడా ఏర్పాటు చేశారు.
చంద్రబాబు ప్రమాణస్వీకారం నేపథ్యంలో బెజవాడ నుంచి కేసరపల్లి వరకు 3 పార్టీల జెండాలను ఏర్పాటు చేశారు. 14 ఎకరాల్లో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతోంది. 11.5 ఎకరాల్లో సభా ప్రాంగణం.. 2.5 ఎకరాల్లో సభా వేదిక ఏర్పాటు చేశారు. దాదాపు రెండు లక్షల మంది కూర్చుని ప్రమాణ స్వీకారాన్ని తిలకించేలా ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా ప్రమాణ స్వీకారాన్ని వీక్షించేందుకు.. విజయవాడలో పలుచోట్ల LED స్క్రీన్లు సైతం ఏర్పాట్లు చేశారు.