ఏపీకి మహర్దశ.. సిటీలకు అనుసంధానంగా థీమ్ బేస్డ్ పట్టణాలు

Telugu BOX Office

నగరాల్లో జనాభా భారీగా పెరుగుతుండటంతో వాటి చుట్టూ కొత్త పట్టణ నిర్మాణాల అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రచిస్తోంది. భావి అవసరాల మేరకు ఇప్పటి నుంచే తగిన సదుపాయాలు కల్పించే దిశగా అడుగులు వేస్తోంది. ఈ కోవలోనే దేశవ్యాప్తంగా నీతి ఆయోగ్‌ ఎంపిక చేసిన గ్రోత్‌ సిటీల్లో ఒకటైన విశాఖపట్నంలో ‘థీమ్‌ బేస్డ్‌’ పట్టణాల నిర్మాణానికి కసరత్తు ప్రారంభించింది. ఇందుకోసం వెయ్యి ఎకరాల భూ సేకరణ చేపట్టనుంది. ఈ నమూనాను రాష్ట్రంలోని ఇతర నగరాలకు అమలు చేసేలా ప్రణాళికలు రచిస్తోంద. తొలి విడతగా విశాఖలో చేపట్టే ఈ ప్రాజెక్టు కోసం 1500 ఎకరాల ప్రభుత్వ, ప్రైవేట్‌ భూములను అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. అక్కడ కల్పించాల్సిన సౌకర్యాలు, ప్రాజెక్టులపై రాష్ట్ర పట్టణ మౌలిక సదుపాయాలు, ఆస్తుల నిర్వహణ సంస్థ  అధ్యయనం చేస్తోంది.

రాష్ట్రంలోనే అతి పెద్ద నగరమైన విశాఖ జనాభా 2011 లెక్కల ప్రకారం 18 లక్షలు కాగా, ప్రస్తుతం 21 లక్షలు దాటినట్లు అంచనా. భవిష్యత్తులో ఇంకా పెరిగే అవకాశం ఉన్నందున విశాఖ చుట్టూ ఉన్న అనకాపల్లి, విజయనగరం తదితర ప్రాంతాల్లో స్థిరమైన, వినూత్న రీతిలో థీమ్‌ బేస్డ్‌ పట్టణాలు అభివృద్ధి చేయనున్నారు. వీటిలో మౌలిక సదుపాయాలు కల్పించి ఐటీ, వైద్యం, పర్యాటకం, వినోదం, వాణిజ్యం, పరిశ్రమలు.. ఇలా విభిన్న రంగాల్లో ప్రైవేట్‌ సంస్థల నుంచి పెట్టుబడులు ఆహ్వానించనున్నారు. విజయనగరం, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాల్లో 1,000 ఎకరాల ప్రభుత్వ, ప్రైవేట్‌ భూములను గుర్తించారు. ప్రైవేట్‌ భూముల కోసం భూసమీకరణ పథకం అమలు చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు..

విశాఖ తర్వాత విజయవాడ, గుంటూరు, రాజమహేంద్రవరం, కాకినాడ, మచిలీపట్నం, నెల్లూరు, తిరుపతి. ఒంగోలు,   అనంతపురం, కర్నూలు, కడప, శ్రీకాకుళం నగరాలకు అనుబంధంగా కూడా థీమ్‌ బేస్డ్‌ పట్టణ నిర్మాణాల కోసం ల్యాండ్‌ బ్యాంకు సిద్ధం చేస్తున్నారు. ఈ 12 నగరాల్లో కలిపి 1,500 ఎకరాల భూములను ప్రాథమికంగా గుర్తించారు. తొలి దశలో భాగంగా విజయవాడ, గుంటూరు, తిరుపతి, నెల్లూరు, కాకినాడ, కర్నూలులో థీమ్‌ బేస్డ్‌ పట్టణ నిర్మాణాలకు ప్రణాళికలు సిద్ధం చేయనున్నారు. ఇందుకు అవసరమయ్యే నిధుల కోసం కొంత భూమిలో పట్టణాభివృద్ధి సంస్థల ఆధ్వర్యంలో లేఔట్లు వేసి ప్రజలకు స్థలాలు విక్రయిచాలని నిర్ణయించారు. ఐటీ, టూరిజం, ఎంటర్‌టైన్‌మెంట్ ప్రాజెక్టుల ఏర్పాటు కోసం ప్రైవేట్‌ సంస్థలకు భూములు కేటాయిస్తారు. సిటీల్లో మౌలిక సదుపాయాల కల్పన రాష్ట్రాలకు సవాలుగా మారినందున కేంద్రమే ఈ ఏడాది బడ్జెట్‌లో అర్బన్‌ ఛాలెంజింగ్‌ ఫండ్‌ కింద కొత్తగా రూ.లక్ష కోట్లు కేటాయించింది. దాంట్లో ఏపీ ప్రభుత్వం రూ.10 వేల కోట్లకు పైగా ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ నిధులు వస్తే థీమ్‌ బేస్డ్‌ పట్టణ నిర్మాణాలు సులభతరం అవుతాయని రాష్ట్ర అధికారులు చెబుతున్నారు.

Share This Article
Leave a Comment