ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. రాష్ట్రవ్యాప్తంగా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘తల్లికి వందనం’ (Thalliki Vandanam) పథకం నిధుల విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 22న లబ్ధిదారులైన తల్లుల ఖాతాల్లోకి ఆర్థిక సాయాన్ని జమ చేయనున్నట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ పథకం నిర్వహణ కోసం ఏకంగా రూ.10,120.78 కోట్ల భారీ బడ్జెట్‌ను చెల్లించేందుకు విద్యాశాఖ అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు కూడా జారీ చేశారు.
67 లక్షల మందికి పైగా విద్యార్థులకు లబ్ధి
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, పాఠశాలల్లో చదువుతున్న ప్రతి చిన్నారి చదువుకు ఆసరాగా నిలిచేందుకు ఏటా రూ.15 వేల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది. ఈ విద్యాసంవత్సరానికి గానూ ఒకటి నుంచి 12వ తరగతి (ఇంటర్మీడియట్) వరకు చదువుతున్న విద్యార్థులందరికీ ఈ పథకం వర్తించనుంది. ఇందులో భాగంగా లబ్ధిదారులైన తల్లుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా రూ.13,000 జమ అవుతుండగా, మిగిలిన రూ.2,000 మొత్తాన్ని సదరు పాఠశాలల నిర్వహణ, మౌలిక వసతుల కల్పన కోసం ప్రభుత్వం ఖర్చు చేయనుంది. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 67.47 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుండగా.. 42.70 లక్షల మంది తల్లుల ఖాతాల్లోకి నగదు నేరుగా చేరనుంది.

వెరిఫికేషన్ పూర్తి.. రెండు విడతల్లో నగదు జమ!
ఈ విద్యాసంవత్సరంలో ఇప్పటికే స్కూళ్లు, కాలేజీల్లో చదువుతున్న విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల వెరిఫికేషన్ ప్రక్రియను ప్రభుత్వం విజయవంతంగా పూర్తి చేసింది. అర్హులైన లబ్ధిదారుల తుది జాబితాను ఈ నెల 22నే గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించనున్నారు. అదే రోజున నేరుగా వారి ఖాతాలకు నగదు బదిలీ (DBT) కానుంది. ఇక ఈ ఏడాది కొత్తగా అడ్మిషన్లు తీసుకున్న ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులతో పాటు, ఇంటర్ ప్రథమ సంవత్సరంలో చేరిన విద్యార్థుల తల్లులకు కూడా ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. వారి అర్హతలను పరిశీలించి, ఆగస్టు 30 నాటికి వారి తల్లుల ఖాతాల్లోనూ ఈ ఆర్థికసాయాన్ని జమ చేయనున్నారు.
నెరవేరనున్న లోకేశ్ హామీ
ఈ పథకంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సమాజంలో నిరంతరం సేవలు అందించే అంగన్‌వాడీ కార్యకర్తలు, శానిటేషన్ (పారిశుధ్య) వర్కర్లుగా పనిచేస్తున్న వారి పిల్లలకు కూడా ఈ పథకం వర్తింపజేయనున్నారు. గతంలో నిర్వహించిన ‘యువగళం’ పాదయాత్రలో విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఇచ్చిన ఈ హామీని నిలబెట్టుకుంటూ, వారిని కూడా అర్హుల జాబితాలో చేర్చుతున్నట్లు ప్రభుత్వం జీవోలో పేర్కొంది. సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అమలవుతున్న ఈ పథకం ద్వారా, ఒక ప్రాథమిక అంచనా ప్రకారం జిల్లాల వారీగా సగటున లక్షా 5 వేల మంది వరకు తల్లులు లబ్ధి పొందనున్నారు. ఈ నిర్ణయంతో విద్యార్థుల కుటుంబాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
