Investments in AP : ఏపీలో రూ. 44,776 కోట్ల పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్

Telugu BOX Office

 ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు మూడో సమావేశంలో 15 ప్రాజెక్టులకు సంబంధించి రూ. 44,776 కోట్ల పెట్టుబడులకు ఈ సమావేశంలో ఆమోదం తెలిపారు. ఈ పెట్టుబడుల ద్వారా 19,580 ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉంది. మూడు నెలల్లో అర్సెల్లార్ మిట్టల్ స్టీల్, బీపీసీఎల్ వంటి భారీ ప్రాజెక్టులకు శంకుస్థాపన జరుగనుంది. అల్లూరి జిల్లాలో 2300 మెగావాట్ల ప్రాజెక్టు ఏర్పాటు చేయనున్న నవయుగ ఇంజనీరింగ్ లిమిటెడ్ రూ.14,328 కోట్లతో విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టు ఏర్పాటుకు ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది. అన్నమయ్య జిల్లాలో పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్న మేఘా ఇంజనీరింగ్ రూ.10,300 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు మెఘా సంస్థ ప్రతిపాదన సమర్పించింది.

అలాగే అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో 118 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టు ఏర్పాటుకు యాస్పరీ లిమిటెడ్‌కు ఆమోదం ముద్ర పడింది. రూ.972 కోట్లతో అనంతపురంలో అనంతపూర్ రెన్యూవబుల్ ప్రైవేట్ లిమిటెడ్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. వీటితో పాటు రూ.1163 కోట్ల పెట్టుబడితో సత్యసాయి జిల్లాలో కడప రెన్యూవబుల్ లిమిటెడ్ ప్రాజెక్టుకు సమావేశంలో ఆమోదం లభించింది. 201 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటుకు ఎకోరిన్ సంస్థ ప్రతిపాదనను ఎస్ఐపీబీ ఆమోదించింది. కర్నూలు జిల్లాలో రూ.4435 కోట్లతో ఆయానా రెన్యుబుల్ పవర్ లిమిటెడ్‌కు ఆమోదం లభించింది. యాంపిన్ సంస్థ రూ.3142 కోట్లతో ఏర్పాటు చేయనున్న 350 మెగావాట్ల పవన సౌర విద్యుత్ ప్లాంట్‌కు ఓకే చెప్పారు. రూ.3456 కోట్లతో 600 మెగావాట్ల సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు ఎస్ఏఈఎల్ ప్రతిపాదనకు ఆమోద ముద్ర పడింది.


అలాగే రూ.2 వేల కోట్లతో అనంతపురంలో 400 మెగావాట్ల సౌర విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు టాటాపవర్‌కు పచ్చజెండా ఊపారు. కాకినాడలో ఫెర్టిలైజర్ ప్లాంట్ విస్తరణకు కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్‌కు అనుమతి లభించింది. రూ.1535 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఎస్ఐపీబీ ఆమోదించింది. అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంట్రప్రెన్యూర్స్ ఆఫ్ ఇండియా అలెప్‌కు రూ.305 కోట్లతో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమకు అనుమతి లభించింది. కొప్పర్తి ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు ఆమోదం పడింది. పెట్టుబడులు త్వరితగతిన గ్రౌండ్ అయ్యేలా అధికారులు ట్రాకింగ్ చేయాలని సీఎం సూచించారు. దావోస్‌లో ఆసక్తి చూపిన డీపీ వరల్డ్, ఏపీ ముల్లర్ మార్క్స్ వంటి సంస్థలతో సంప్రదింపులు జరపాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు.

గత రెండు సమావేశాల్లో ఆమోదం పొందిన ప్రాజెక్టుల స్థితిగతులపైనా ఈ సమావేశంలో చర్చించారు. ఒప్పందాలపై పరిశ్రమల యాజమాన్యాలతో నిరంతర చర్చల ద్వారా సాధ్యమైనంత త్వరగా ప్రాజెక్టులు గ్రౌండ్ అయ్యేలా చూడాలని సీఎం సూచించారు. అధికారులు, మంత్రులు పెట్టుబడులను ట్రాక్ చేయడం ద్వారా త్వరితగతిన ఫలితాలు చూపించాలని తెలిపారు. తీవ్రమైన పోటీ నెలకొన్న నేటి పరిస్థితుల్లో ఫలితాలు రావాలంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అమలు చేసి చూపాలని అధికారులకు సీఎం సూచించారు. రాష్ట్ర స్థాయిలో అనుమతులు, క్షేత్ర స్ధాయిలో పనులపై కలెక్టర్లతో సమీక్ష చేయాలని ప్రధాన కార్యదర్శికి సీఎం సూచనలు చేశారు. పెట్టుబడులపై దిగ్గజ సంస్థల నుంచి, జాతీయ, అంతర్జాతీయ పారిశ్రామిక వేత్తల నుంచి వస్తున్న స్పందన సంతృప్తికరంగా ఉందని అభిప్రాయపడ్డారు. ప్రతి అవకాశాన్ని రాష్ట్రానికి పెట్టుబడులు సాధించేందుకు ఉపయోగించుకోవాలని ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

Share This Article
Leave a comment