ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వేడి తారాస్థాయికి చేరింది. మే 13న జరిగే ఎన్నికల్లో ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు రాజకీయ పార్టీలు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనుండగా అందరిచూపు మాత్రం జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ పోటీచేస్తోన్న కాకినాడ జిల్లా పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం మీదే ఉంది. గత ఎన్నికల్లో రెండు చోట్లా ఓడిపోయిన ఆయన ఈసారి పిఠాపురంలో విజయకేతనం ఎగురవేయడం ఖాయమని జనసైనికులు చెబుతున్నారు.
పవన్‌కు ప్రత్యర్థులుగా వైసీపీ నుంచి వంగా గీతతో పాటు మొత్తం 22 మంది నామినేషన్లు వేశారు. దీంతో పిఠాపురం స్థానానికి మొత్తం 23 నామినేషన్లు దాఖలైనట్లు ఆర్వో రామసుందర్‌రెడ్డి తెలిపారు. అయితే వీరిలో ఓ అభ్యర్థి గురించి పిఠాపురంలో అందరూ చర్చించుకుంటున్నారు. ఆయన బ్యాగ్రౌండ్ తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. కొందరైతే ఆయన ధైర్యానికి హ్యాట్సాఫ్ చెబుతున్నారు. ఆయనే పిఠాపురంలో చెప్పులు కుట్టుకునే ఏడిద భాస్కర్‌రావు.
పిఠాపురానికి చెందిన ఏడిద భాస్కర్‌రావు గురువారం ఇండిపెండెంట్‌గా నామినేషన్ దాఖలు చేశారు. ఇంటర్ వరకు చదువుకున్న ఆయన ఆర్థిక సమస్యల కారణంగా చదువు మానేసినట్లు తెలుస్తోంది. జీవనోపాధి కోసం స్థానిక ప్రభుత్వ కాలేజీ ముందు చెప్పులు కుడుతుంటారు. దాని ద్వారా వచ్చిన సంపాదనతోనే కుటుంబాన్ని పోషిస్తున్నారు. అయితే చదువుపై మక్కువతో ఎంఏ రాజనీతి శాస్త్రం అధ్యయం చేయడం విశేషం. ఇండిపెండెంట్‌గా నామినేషన్ వేసిన ఏడిద భాస్కర్‌రావు అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ పది మంది సంతకాలు చేశారు. పిఠాపురం నియోజకవర్గ సమస్యలకు తనదైన పరిష్కారాలతో ఆయనే సొంతంగా ఓ మేనిఫెస్టో తయారుచేశారు. ప్రస్తుతం తన వద్ద రూ.20వేల నగదు మాత్రమే ఉందని ఆయన అఫిడవిట్లో పేర్కొన్నారు.
పిఠాపురంలో పోటీచేస్తోన్న జనసేనాని తన గెలుపును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. ఆయన కోసం జబర్దస్త్ నటులు, గబ్బర్‌సింగ్ బ్యాచ్ సహా పలువురు ప్రముఖులు ప్రచారం చేస్తున్నారు. అంతేకాకుండా పవన్‌కు మద్దతుగా పలువురు ఎన్నారైలు కూడా స్వచ్ఛందంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్థానికుడైన ఏడిద భాస్కర్‌రావు ఎంతమేర ప్రభావం చూపిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. గెలుపోటముల సంగతి పక్కనపెడితే భాస్కర్‌రావు ధైర్యాన్ని మాత్రం మెచ్చుకుని తీరాల్సిందేనని పలువురు అభిప్రాయపడుతున్నారు.